ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినప్పుడు – నా పుట్టిన తేదీ ప్రకారం అప్పటికి నా వయస్సు కొంచెం అటూ ఇటుగా పదకొండేళ్లు. అప్పటి విశేషాలు గుర్తుండే వీలు లేదు కాబట్టి నాటి పరిస్తితులను సింహావలోకనం చేయడానికి వీలుగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ఆరు మాసాలముందు ఆంధ్ర పత్రిక దినపత్రిక ఏప్రిల్ నాలుగో తేదీన మొదటి పుటలో ప్రధాన శీర్షికతో ప్రచురించిన వార్తను యధాతధంగా అక్షరం పొల్లు పోకుండా కింద ఇవ్వడం జరిగింది.
అయితే ఓ చిరు విజ్ఞప్తి
రాష్ట్ర విభజన గురించి ఆందోళనలు, చర్చోపచర్చలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో, పీర్లు గుండానపడుతున్న సందర్భంలో - ఆ నాటి (1956) స్తితిగతులను ఓమారు స్పురణకు తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో మరో రకం ఆలోచనకు తావివ్వరాదని నా అభ్యర్ధన.
సంపుటం - 43 సంచిక - 4 బుధవారం 4-4-1956 6 పేజీలు 1 అణా
‘ఆంధ్ర ప్రదేశ్’ అనే పేరుకు తెలంగాణా నాయకుల సమ్మతి
కోస్తా జిల్లాలకోసం గుంటూరు లో హైకోర్టు బెంచి నెలకొల్పే నిర్ణయం
అక్టోబర్ లోగా విలీనం మినహా కార్యాలయాల తరలింపు అసాధ్యం అని డాక్టర్ బూర్గుల ప్రకటన
(ఆంధ్ర పత్రిక ప్రతినిధి)
కర్నూలు, ఏప్రిల్ 3
‘ఆంధ్ర ప్రదేశ్’ అని నూతన రాష్ట్రానికి పేరు పెట్టడానికే చివరికి ఆంధ్ర – తెలంగాణా నాయకులు తీర్మానించారు.
ఆంధ్ర ప్రాంత న్యాయవాదుల ప్రాబల్యానికి హైదరాబాద్ న్యాయవాదులు భయపడుతున్న కారణం వల్ల- రాయలసీమపై న్యాయ విచారణాధికారాన్ని హైదరాబాదు కోర్టుకు ఒప్పగించి, కోస్తా జిల్లాలకోసం గుంటూరులో హై కోర్టు బెంచి నెలకొల్పాలని కూడా ఉభయ ప్రాంతాల నాయకులు నిర్ణయించారు.
ఆంధ్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో –ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాద్ రెవిన్యూ మంత్రి శ్రీ కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, హైదరాబాద్ వ్యవసాయ మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జె.వి. నరసింగరావు, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, పూర్వ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం, విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పాల్గొన్నారు.
నూతన రాష్ట్ర నామకరణం విషయమై కొంత దీర్ఘ చర్చ జరిగింది.
హైదరాబాద్ నాయకుల్లో శ్రీ రంగారెడ్డి, శ్రీ చెన్నారెడ్డి, శ్రీ నరసింగరావు – ‘తెలుగు ప్రదేశ్’ అని కానీ, ‘తెలంగాణా’ అని కానీ కొత్త రాష్ట్రానికి పేరు వుంచాలని దీర్ఘవాదం చేశారు.
'ఆంధ్ర' లో దోషం లేదు
తదితరులు, హైదరాబాద్ ముఖ్యమంత్రి తో సహా – ఆంధ్ర అనే పదంలో దోషం ఏమీ లేదని వాదించారు.
‘ఆ పేరు ఉపనిషత్తుల కాలం నుంచి వ్యవహారంలో వుంది. ఆ పేరు ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. ఆంధ్ర పితామహ, శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషానిలయం – ఈ మొదలయిన ప్రఖ్యాత వ్యవహార నామములు బట్టి చూచినట్టయితే – ఆంధ్ర ప్రజలకు, తెలంగాణా ప్రజలకు భేదం కనబడదు. అందరినీ ఆంధ్ర అనే పదం తోనే వ్యవహరించారు’
చివరికి ‘ఆంధ్ర ప్రదేశ్’ అనే నూతన రాష్ట్రానికి పేరు వుంచాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి