తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్టు వాదం ముదిరితే పిడివాదం అవుతుంది.
రాష్ట్రంలో ఈనాడు నెలకొనివున్న పరిస్థితులు గమనిస్తున్న
‘మౌన వీక్షకులు’ నోరు తెరవలేని దుస్తితిలో వుండడానికి కారణం ఈ పిడివాదులే.
రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని కోరేవారు,
విభజించాలని కోరేవారు ఇరుప్రాంతాల్లో అధిక సంఖ్యలో వున్నారు. అలాగే కలసివుంటే పోలా
అనుకునేవాళ్ళు ఇటు తెలంగాణలో, విడిపోతే పోలా అనుకునేవాళ్ళు అటు సీమాంధ్ర లోనూ
వున్నారు. కాకపొతే వీరు అల్పసంఖ్యాకులు. వీరే ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్న ‘నోటా’
(NONE OF THE ABOVE) కేటగిరీ వాళ్లు. విభజన వద్దూ, సమైక్యం వద్దూ అనే వారన్న
మాట. వీరికి కావాల్సింది ప్రత్యేక రాష్ట్రమూ కాదు, కలసి వుండడమూ కాదు. బతుకులు వెళ్ళదీసుకోవడం.
ప్రత్యేక తెలంగాణావాదం తాటి ప్రమాణంలో వున్న రోజుల్లో
కూడా వీరున్నారు. సీమాంధ్రలో ఈ మధ్య సమైక్య ఉద్యమం వువ్వెత్తున ఎగసిన రోజుల్లో కూడా వీరు ఆ
ప్రాంతంలో కూడా వున్నారు. కానీ వీరు కనబడరు. వీరి గోడు ఎవ్వరికీ వినపడదు.
ప్రత్యేక రాష్ట్రం
కోరుకోవడాన్ని ఎవ్వరూ ఆక్షేపించరు. అలాగే సమైక్యంగా వుండాలని అనుకోవడం కూడా
ఆక్షేపణీయం కాదు. కానీ ఈ నినాదాలను అడ్డు పెట్టుకుని పిడివాదం చేసేవాళ్ళతోటే అసలు
తంటా.
సమస్య ఏదో కొలిక్కి
వస్తోందని అనుకుంటే, సమస్యను తీర్చేవాళ్ళూ, సమస్యలో భాగం అయినవాళ్ళూ రాజకీయం
తప్పితే రాష్ట్ర ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తున్నట్టులేదు.
రాష్ట్ర విభజన దిశగా కేంద్రం
త్వరితగతిన అడుగులు వేస్తుంటే, అదీ రాజకీయమే సందేహం లేదు, సీమాంధ్ర పిడివాదులు ‘యెలా
జరుగుతుందో చూస్తాం, ప్రాణాలు పోయినా వొప్పుకోం’ అంటారు. ‘హైదరాబాదు సంగతి
తేల్చకుండా యెలా’ అంటారు. హైదరాబాదు విషయం రాగానే ‘అది లేని తెలంగాణా మాకెందుకు
మేం వొప్పుకోం’ అంటారు వేర్పాటు పిడివాదులు.
అసలు ఈ ఇరుపక్షాలు వొప్పుకోవడం,
వొప్పుకోకపోవడం అనే ప్రాతిపదికపైన పరిణామాలు ఈ దశ వరకూ రాలేదన్న సంగతి ఇరువురికీ
తెలుసు. అయినా మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూనే వుంటారు.
హైదరాబాదును అభివృద్ధి చేసింది మేమే అని చంకలు కొట్టుకునే
సీమాంధ్ర పిడివాదులు అలాటి మరో రాజధాని నగరాన్ని అధ్బుతంగా నిర్మించుకోగల
సామర్ధ్యం లేనివాళ్ళు అనుకోలేము కదా.
అలాగే, ప్రజాభీష్టానికి
వ్యతిరేకంగా రాష్ట్రాన్ని నిలువునా విభజిస్తున్నారన్న ఆగ్రహంతో కాంగ్రెస్
అధినేత్రికి సీమాంధ్రలో ‘సమాధి’ కట్టినప్పుడు కోపంతో వూగిపోయిన తెలంగాణా
పిడివాదులు, రేపు ఖర్మం కాలి హైదరాబాదును సరిహద్దులు పెంచి ఉమ్మడి గవర్నర్ పాలన
కిందకు తీసుకువచ్చే ప్రతిపాదన తీసుకువస్తే మళ్ళీ అలాటి అనాగరిక చర్యకు పూనుకోబోమని ఏమైనా హామీ ఇవ్వగలరా? అందుకే అనేది ఈ విధేయతలు, వినయాలు అన్నీ నిర్ణయాలు తమకు
అనుకూలంగా వున్నప్పుడు మాత్రమే.
రాష్ట్రాన్ని రెండుగా
చేస్తారో, కలిపి వుంచుతారో తెలియదు కాని కాంగ్రెస్ తో సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని
నిప్పుల కొలిమిలోకి నెట్టి, వినోదం చూస్తున్నాయి. బహుశా ఇటువంటి వికృత, పైశాచిక
రాజకీయ క్రీడ ఒక్క మన దేశంలోనే సాధ్యమేమో!
అందుకే - ‘నోటా’ లు నోళ్ళు తెరవాలి.
(11-11-2013)
అయ్యా భండారువారూ
రిప్లయితొలగించండిఇప్పుడు సామాన్యులు ఎవరూ నోరు తెరిచే పరిస్థితి లేదండీ.
వాతావరణం అంతా రాజకీయనాయుకుల గోలగోలతో నిండిపోయింది.
తెలంగాణాలో ఉండి ప్రత్యేకతెలంగాణా వాదపు రాజకీయదృక్పధంతో ఏకీభవించలేని వారు, వీరతెలంగాణావాదుల, ముఖ్యంగా తెరాస వారి దురుసుతనంతో నోరు తెరవలేని పరిస్థితిలో ఉన్నారు.
సీమాంధ్రలో ఉండి కేవలం హైదరాబాదు కేంద్రబిందువుగా సాగుతున్న హడావుడికి విసుగుపుడుతున్న వాళ్ళు సీమాంధ్రవాదుల చీవాట్లకు జవాబులు చెప్పటానికి ఓపికలేక నోరుమూసుకోవలసిన పరిస్థితి.
అదీకాక, తెలంగాణావాదుల పడికట్టు దూషణ ఐన 'విషం కక్కటం' అనే మాటకు నొచ్చుకుని ఇరుప్రాంతాలవారూ తెలంగాణా వాదానికి వ్యతిరేకంగా ఒక్కముక్క అన్నా వారికి దాదాపుగా తలంటుగా ఉంది వ్యవహారం.
సీమాంద్రలో చూస్తే, నవనందుల్లాంటి నిష్ప్రయోజక కేంద్రమంత్రు లనబడే మూర్ఖులముఠా నిర్వాకం చూస్తూ, అలాగే తెలంగాణాలో తెరాసా & కో, ఇష్టారాజ్యమే అన్నట్లుండటం వలనా, ఎవరేం చెప్పీ ప్రయోజనం లేని స్థితిలో యావత్తు రాష్ట్రంలోని ప్రజలూ మౌనంగా జరుగుతున్న గందరగోళాన్ని భరిస్తున్నారు.
కాని కాలం మనుషుల మాట వినదు. మనం మంచి అనుకుని చేసుకునే చెడులకు ఫలితం మనమే అనుభవించాలి. వేరే దారిలేక నోర్మూసుకుంటున్న దక్షులైన వారు కూడా మౌనంగానే కాలం విధించే శిక్షను అనుభవించే వారే కాక తప్పదు.
మన రాజకీయప్రయోజనాలతో కాలానికి సంబంధం లేదు కదా!
@శ్యామలీయం - సవివరమైన మీ విశ్లేషణకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండి(అసలు ఈ ఇరుపక్షాలు వొప్పుకోవడం, వొప్పుకోకపోవడం అనే ప్రాతిపదికపైన పరిణామాలు ఈ దశ వరకూ రాలేదన్న సంగతి ఇరువురికీ తెలుసు. అయినా మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూనే వుంటారు.)-- Absolutely!!
రిప్లయితొలగించండి@సూర్య - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండి