ఖమ్మం జిల్లా ఏర్పడి నిన్నటికి అరవై ఏళ్ళు
నిండాయి. నిన్న మొదలయిన ఈ అరవై వసంతాల ఉత్సవాలను వచ్చే జనవరి ఇరవై ఆరువరకు జరపాలని
జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈనాడు ఖమ్మం ఎడిషన్ లో చాలా ఆసక్తికరమైన విషయాలను,
ఫొటోలతో సహా ప్రచురించారు.
రాజీవ్ గాంధి ప్రధాన మంత్రిగా జిల్లాలో వరద బాధిత
ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. జలగం
వెంగళరావు గారు కేంద్ర మంత్రి, పీసీసీ అధ్యక్షుడు కూడా. భద్రాచలం చుట్టుపక్కల అటవీ
ప్రాంతాల్లో తగిన భద్రతా సిబ్బంది కూడా లేకుండా తిరిగినప్పుడు ఆయన వెంట
వున్నవారిలో ఆకాశవాణి విలేకరిగా నేను కూడా వున్నాను. ఓ మారుమూల గిరిజ పల్లెకు
వెళ్ళి, ఒక స్థానికుడి ఇంట్లోకి వెళ్ళి పోయ్యిమీది చట్టిలోని అన్నం మెతుకులను రుచి
చూసి, బయటి ప్రపంచానికి దూరంగా వున్న వారి బీద బతుకులకు సర్కారు భరోసాగా వుందన్న
నమ్మకాన్ని ఆ పేదవారిలో కలిగించారు.
ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా జిల్లాలో
ఎన్నికల ప్రచారానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల కారణంగా ఆవిడను ఘనంగా కాకపోతే పోనీండి, ఓ మోస్తరుగా రిసీవ్ చేసుకునే నాయకులు కూడా
లేకపోయారు. ఓ గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు అప్పట్లో ఓ చోటా కాంగ్రెస్ నాయకుడు
ఈశ్వర్ లింగం ఆమె బ్రేక్ ఫాస్ట్ కోసం దగ్గర్లో ఓ హోటల్ నుంచి ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు
ఇచ్చిన ఓ సత్తు చెంచాతో తినలేక ఇందిరాగాంధి చేత్తోనే తిన్నారని దానికి ప్రత్యక్ష సాక్షి
అయిన కౌటూరు దుర్గాప్రసాద్ చెప్పారు. ఆవిడ
టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి
సత్యనారాయణ రావు గారు (మాజీ ఐజీ రావులపాటి సీతారామారావుగారి తండ్రి) వున్నారు.
ఆరోజుల్లో శ్రీమతి గాంధి రాజకీయంగా వొంటరి.
కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు.
అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆమెతో
విభేదించి పాత కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఇక ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే
నాధుడు యెవ్వడు?
ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ
వెంకటస్వామి ప్రభ్రుతులు శ్రీమతి గాంధీని హిల్ బంగ్లా లో
దింపి వసతి సరిపోకనో యేమో మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంచేత ఆవిడ
బ్రేక్ ఫాస్ట్ బాధ్యత చిన్న నాయకుల మీద పడింది.
ఖమ్మం ఎన్నికల సభ బాగా జరిగింది. కాంగ్రెస్ లో
సిండికేటుగా పిలవబడే అగ్రనాయకులందరూ కలసి తనని వొంటరిదాన్ని చేసి బయటకు పంపారని
శ్రీమతి గాంధి చేసే వాదనను జనం నమ్మారు. అందరూ ఒక్కటై ఈమెను వేదిస్తున్నారన్న
నమ్మకం ప్రబలసాగింది. గెస్ట్ హౌస్ పక్కనే సభ జరగాల్సిన పెవిలియన్ మైదానం జనంతో
కిక్కిరిసిపోయింది. రాత్రి ఏడు గంటలకు రావాల్సిన శ్రీమతి గాంధి మరునాడు ఉదయం ఖమ్మం
వచ్చారు. అయినా సభకు వచ్చిన ఎవ్వరూ
అక్కడనుండి కదలలేదు. ఆవిడ ఖమ్మం సభలో ప్రసంగిస్తూ వున్నప్పుడే కాంగ్రెస్ (ఐ)
పార్టీకి ‘హస్తం గుర్తు’ కేటాయించినట్టు
కబురు వచ్చింది.
కొసమెరుపు ఏమిటంటే ఆరోజు
పెవిలియన్ మైదానంలో అమ్ముడు పోయిన మిర్చి బజ్జీలు అప్పటికీ ఇప్పటికీ ఒక రికార్డుగా
చెప్పుకుంటారు.(02-10-2013)
"... కాంగ్రెస్ లో సిండికేటుగా పిలవబడే అగ్రనాయకులందరూ కలసి తనని వొంటరిదాన్ని చేసి బయటకు పంపారని...."
రిప్లయితొలగించండిఈ సిండికేటు, పాత కాంగ్రెస్ హడావిడి 1969లో కాంగ్రెస్ చీలినప్పుడు కదా. మీరు చెప్పేది, 1978 అంటె, జనతా పార్టీ చేతిలో ఓడిన తరువాత, బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ గా మళ్ళి చీలిపొయ్యాయి, అప్పుడు ఇందిరా కాంగ్రెస్ చెయ్యి గుర్తుతో మొదలయ్యింది. ఎప్పుడు మానేశారో మరి, ప్రస్తుతం కాంగ్రెస్ గా చెలామణి అవుతున్న పార్టీ, కాంగ్రెస్ ఐ అనుకోవటంలేదు.
1969లో కాంగ్రె చీలినప్పుడు, ఇందిరా గాంధీ ఉన్న కాంగ్రెస్ ను కొత్త కాంగ్రెస్ అని, నిజలింగప్ప తదితరులు ఉన్న కాంగ్రెస్ ను పాత కాంగ్రెస్ అని వ్యవహరించేవాళ్ళు. కొత్త కాంగ్రెస్ కు గుర్తు, ఆవు దూడ. 1977 ఎన్నికల్లో ఈ ఆవు దూడ గుర్తు,ఇందిరా గాంధీ ఆమె కుమారుడు సంజయ్ గాంధీకి అన్వయించి మిగిలిన పార్టీలు ఆటపట్టించారు.