18, అక్టోబర్ 2013, శుక్రవారం

బాబోయ్! టీవీ!! (టాగ్ లైన్ : ఎవర్నీ ఉద్దేశించింది కాదు)



“ఈరోజు మీదే. కుమ్మేసుకోండి” అన్నాడు గుర్నాధం.
గుర్నాధం నాకు రెండేళ్ళ నుంచి పరిచయం. వాళ్ల టీవీ ప్రోగ్రాం కు వెళ్ళినప్పుడల్లా మంచిగా ఆప్యాయంగా పలకరిస్తాడు. అతని నోట ఎప్పుడూ ఇలాటి అపభ్రంశపు మాటలు వినలేదు. ఇవ్వాలేమిటి ఇలా!  అందుకే ఆ మాట వినబడనట్టు నటిస్తూ స్టుడియో లోపలకు నడిచాను. ఆ వాతావరణం నాకు కొత్త కాదు. లైట్లూ, మూవింగ్ కెమెరాలు, కెమెరామన్లు(టింగ్లీష్) ఏదీ, ఎవరూ కొత్త కాదు. కాకపొతే ఆరోజు నేను నిర్వహించే పాత్రే కొత్తది.
ఆరోజు జర్నలిష్టుల దినం అట. అందుకని కొత్తగా వుంటుందని, కాస్త కొత్తదనం చూపించాలని  నాకీ కొత్త అవతారం ఇచ్చి ఆరోజు వార్తా విశ్లేషణ కార్యక్రమం నిర్వహించమన్నారు. అంటే ‘యాంఖరయ్య’ పాత్ర అన్నమాట. రోజూ కూర్చుండే ప్రదేశమే అయినా కుర్చీ మారింది. చెవులకు ఏవో తగిలించి కూర్చోబెట్టారు. రేడియోలో నాలుగయిదు స్టేషన్లు కలిసినట్టు ఏవేవో నానారకాల ధ్వనులు కలగాపులగంగా వినీవినబడనట్టు వినబడుతున్నాయి. మైక్ టెస్టులు అయి, పత్రికావార్తల పఠనం పూర్తయి మొదటి ‘బ్రేకు’ పడినప్పుడు అతిధులు ఒక్కొక్కరుగా వచ్చి కూర్చున్నారు. నాలుగు పార్టీలకు చెందిన వాళ్లు వాళ్లు. కాకపోతే ఇటీవలి కాలంలో సంభవించిన రాజకీయ పరిణామాల కారణంగా వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఈ మధ్యనే పార్టీలు మారడమే కాకుండా ఇన్నాళ్ళుగా కత్తులు దూస్తూ వచ్చిన పార్తీల్లోకే స్వగృహ ప్రవేశం చేశారు. ఇన్నాళ్ళుగా విశ్లేషక పాత్ర కాబట్టి వాళ్లు ఎన్ని పార్టీలు ఎన్నిసార్లు మారినా నాకొచ్చిన ఇబ్బంది ఏమీలేదు. ఎవరి పద్యాలు (వాదాలు) వాళ్లు పాడేవారు. పార్టీ మారిన వాళ్లు కాస్త జాగ్రత్తగా వొళ్ళు దగ్గరపెట్టుకుని కొత్త పార్టీ వాళ్లు రాసిచ్చిన పాత పాటల్నే ఆలపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కొత్త వేషంలో వున్న నేను,  వాళ్లు ఇప్పుడు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ముందు అర్ధం చేసుకుని ఆపైన వాళ్ళను ప్రశ్నలు అడగాలి. పార్టీ మారిన వాళ్ళను సరిగా గుర్తుపట్టలేకపోతే వాళ్లకు వచ్చే కొత్త నష్టం ఏమీ లేకపోవచ్చుకానీ నన్ను నమ్ముకుని పెట్టుకున్న ప్రోగ్రాం అభాసు పాలు అయ్యే అవకాశం వుంటుంది. కాబట్టి వొళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన మహత్తర బాధ్యత నా మీదకే వచ్చిపడింది. అంచేత, ముందు  వొళ్ళూ, ఆ తరువాత  గొంతూ సర్దుకుని,  కుర్చీలో కాస్త వొంగి కూర్చుని (లేకపోతే యాంఖర్ అనుకోరేమో అని లోపల అనుమానం) నంగిగా పలకరింపుల చిరునవ్వులు రువ్వాను.
చెవులో జోరీగలాగా లోపలనుంచి ప్రోగ్రాం వాళ్లు రొదచేస్తున్నా పట్టించుకోకుండా ఫలానా వాళ్లు ఫలానా ఫలానా పార్టీలవాళ్ళు అంటూ పరిచయం చేయబోయి తొట్రుపడి ఒక పేరుకు మరో పార్టీ పేరు చెప్పి  మరో పేరుకు ఇంకో  పార్టీ పేరు చెప్పి ఆ తరువాత తీరిగ్గా  నాలిక్కరుచుకున్నాను. వాళ్లకు నేను చేసిన తప్పేమిటో తెలిసింది. కాని, కన్నంలో తేలు కుట్టిన దొంగలల్లే మిన్నకుండిపోయారు.
సరే! ప్రోగ్రాం మొదలయింది.
“మొన్న ఢిల్లీలో....” మొదలు పెట్టాను.
తెదేపా ప్రతినిధి అడ్డుకున్నాడు.
‘ఏం జరిగింది ఢిల్లీలో. మా నాయకుడు అంత పెద్ద వయస్సులో కూడా అంత పెద్ద వయస్సును కూడా లెక్క చేయకుండా అంతమంది తెలుగువారి....”
“తెలుగువారి ... అసలు తెలుగువారి గురించి మాట్లాడే నైతిక హక్కు ....” వైకాపా ప్రతినిధి అందుకున్నాడు.
“మీరు మాట్లాడుతుంటే నేను మారు మాట్లాడకుండా విన్నాను. అలాగే...”
“అసలు నేను మాట్లాడింది ఎక్కడ ? ...ముందు మీరే కదా మా నాయకుడు అంటూ మాలావు గింజుకున్నారు.”
“ఆ మాటకు వస్తే తెలుగువారి గురించి, ఆ మాటకు వస్తే యావత్ ప్రజలు గురించి, వారి కష్టాలు గురించి వారి నష్టాలు గురించి మాట్లాడే ఏకైక హక్కు శ్రేమతి ఇందిరారాగాంది కుటుంబానికి చెందిన వారి కోడలు శ్రీమతి సోనియా గాంధీ గారి మార్గ దర్శకత్వంలోనూ,  వారి కుమారుడు, భావిభారత ఆశాజ్యోతి, కాబోయే ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనూ  నిద్రాహారాలు లేకుండా, అహరహమూ  శ్రమిస్తున్న ఒక్క కాంగ్రెస్ పార్టీకే వున్నదని  నేను మనవిచేసుకుంటూ ఇంకా ఇంకా  చెప్పెదేమిటంటే ....” కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం  ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మహిళా నాయకురాలు నోరువిప్పి మళ్ళీ మూయడం మరిచిపోయి మాట్లాడడం మొదలెట్టారు.
“ఏమిటి మీకున్న హక్కు ?  ప్రజలపేరు చెబుతూ ఆ ప్రజాధనాన్ని కొల్లగొట్టడమా? స్కాముల్లో వరల్డ్ రికార్డ్ నెలకొల్పడమా ? ఏమిటి మీకున్న హక్కు ?”
“ఎవరో కొల్లగొట్టారని చెప్పే హక్కు మీకెక్కడిది? కొల్లగొట్టింది మీరందరూ. కొల్లగొట్టబడింది మేము. వుంటే గింటే, అయితే గియితే ఆ తరతరాల హక్కు,   ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక తరాలుగా పోరాటం చేస్తున్న మాది”  టీ ఆర్ఎస్ ఆయన అందుకున్నాడు.   
చెవిలో ఏదో చెబుతున్నారు. ఎవరో శ్రోత లైన్లో వున్నారని.
పరిస్తితిని కాపాడడానికి ఇదే అదను.
“ఒక్క నిమిషం  ఆగండి. కరీంనగర్ నుంచి వరహాలరావు గారు లైన్లో వున్నారు” అనేసి మానిటర్ వైపు చూసి అందులో నా మొహం కనబడడం లేదని నిర్ధారించుకుని ఎదురుగా పెట్టిన గ్లాసులోని నీళ్ళను చుక్క మిగలకుండా తాగేశాను.
ఇంతలో వరహాలరావు గారి కంఠం వినబడింది.
“ముందాయనకు చెప్పండి. నాపేరు వరహాలరావు కాదు. రత్నాకరరాజు. మా వూరు కరీం నగర్ కాదు కాశీబుగ్గ”
“ఓహో! అలాగా ! నాకు కొత్త కదండీ . అందుకని కొత్తగా చెప్పాలనుకుని కొత్త పేరు కొత్త వూరు చెప్పాను. ఇంతకీ రావుగారు... అదే అదే రాజు గారు మీరు ఎవర్ని యేమని అడగాలనుకుంటున్నారు?”
“నేను ఎవర్ని, యేమని అడగాలని అనుకుని లైన్లోకి రాలేదండి. అసలీ ప్రోగ్రాముల వల్ల ఏం సాధించాలని అనుకుంటున్నారో మీరు చెప్పండి.”
ఒక్క రోజు భాగోతానికి మూతి మీసాలు పోయాయన్నట్టు ఈఒక్క రోజు యాంఖర్ వేషం యెందుకు కట్టానురా అనుకుంటు నాలో నేనే మధన పడుతుంటే చెవుల్లో ‘బ్రేక్ చెప్పండి. ఆలస్యం అయితే ఎడ్వర్టైజ్ మెంటు వాళ్ళతో గోల” అని వినబడడంతో అమ్మయ్య అనుకుని “ఇప్పుడొక చిన్న విరామం’ అంటూ పెద్ద బ్రేక్ ఇచ్చేసాను.
ఆపేసిన తరువాత కూడా ఫ్యాన్ కాసేపు తిరిగినట్టు ఆ తరువాత కూడా వారి వాదప్రతివాదాలు కొనసాగుతూనే వున్నాయి.
ఈ మధ్యలో మా ఆవిడ గొంతు.
అదెలా. ఆవిడ ఎక్కడికయినా ఎప్పుడయినా రావచ్చుకాని చెప్పాపెట్టకుండా ఇలా వెంటపడి స్టుడియోలకి కూడా వస్తుంటే యెలా?
“ఏమండీ ఏమైంది ఎందుకలా చెమటలు పట్టాయి. లేచి నీళ్ళు తాగండి” అంటోంది.
అయ్యో ఇదంతా కలా!
అయ్యో ఏమిటి అపభ్రంశంగా! అమ్మయ్య అనుకోవాలి కాని.  

(18-10-2013)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి