4, అక్టోబర్ 2013, శుక్రవారం

నా గురించి నలుగురు -2

నా గురించి శ్రీ డి.వెంకట్రామయ్య గారు   
నా గురించి నేను నలుగురికీ చెప్పుకోవడం ఓ సంగతి. నలుగురూ  నా గురించి ఏం చెప్పుకుంటున్నారో అన్నది మరో సంగతి. ఆ చెప్పేవాళ్ళు పెద్దవాళ్లయితే ఇక ఆ విషయం చెప్పుకోవడానికి అడ్డం ఏముంటుంది. కేవలం ఈ వొకే ఒక్క కారణంతో,  ఆకాశవాణి న్యూస్ రీడర్ శ్రీ డి. వెంకట్రామయ్య గారు ‘రచన’ మాస పత్రిక తాజా సంచికలో తన రేడియో అనుభవాల్లో భాగంగా  నా గురించి చేసిన కొన్ని ప్రస్తావనలను పోస్ట్ చేస్తున్నాను. నిజానికి వీటిని నేను   చక్కని ప్రశంసాపత్రాలుగా భావిస్తాను.- భండారు శ్రీనివాసరావు


(శ్రీ డి. వెంకట్రామయ్య)

“ఆకాశవాణి న్యూస్ రూమ్ లో పనిచేసే పద్ధతిలో భండారు శ్రీనివాసరావుకీ నాకూ పరస్పరవిరుద్ధమైన అభిప్రాయాలు వుండేవి. కాస్త పట్టూ విడుపూ వుండాలనేవారాయన. పట్టుండాలి కాని విడుపెందుకు అనే వాడ్ని నేను. (ఆయన పొరసంబంధాలమనిషి. అనేకమందితో సంబంధాలు వుంటేనే వార్తలు సేకరించడం సులువు అనేది ఆయన పాలసీ. కానీ వార్తల ఎంపిక విషయంలో నా ధోరణి నాదే) నన్ను ఆయనా మార్చలేకపోయారు. ఆయన్ని నేనూ ప్రభావితుడ్ని చేయలేకపోయాను. చివరి దాకా అంతే!
“విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆఫీసు విషయాల్లో ఏమాత్రం ఏకాభిప్రాయం లేని నేనూ శ్రీనివాసరావు ఆఫీసు ఆవరణ దాటి బయటకు రాగానే ఒక్కటై పోయేవాళ్ళం. ఎన్నో ఏళ్ళపాటు ఎన్నో సాయంత్రాలు ..ఎన్నెన్నో రాత్రులు...గంటలకొద్దీ కబుర్లు..సినిమాలు...షికార్లు...అంతేనా అంతకుమించిన అన్ని కాలక్షేపాలు... చతుర్ముఖ పారాయణాలు...  దూమపానాలు.... మధుపానాలు... ఏదో ఒక బార్...లేదా ప్రెస్ క్లబ్...అన్నింటికీ మించి చిక్కడపల్లిలో శ్రీనివాసరావు ఇల్లు. ఇవే మా ‘అడ్డాలు’.
“ఆయనా నేనూ దగ్గర దగ్గర ఇళ్ళల్లో వుండేవాళ్ళం. ఆయన అక్కడ వున్నంత కాలం దాదాపు కొన్నేళ్లపాటు నేనూ, వనం జ్వాలా నరసింహారావు వంటి మరికొందరం మిత్రులం కనీసం వారానికి రెండు మూడు రోజులయినా వారింటికి చేరేవాళ్ళం. గంటలకొద్దీ గడిపేవాళ్ళం. ఆరోజుల్లో ఆయన ఇల్లు ఓ ధర్మసత్రంలా వుండేది. అసలే ఆయన బంధు వర్గమే పెద్దది. దానికి తోడు స్నేహితులు. అందరూ బంధువులే....అందరూ స్నేహితులే... ఎప్పుడు ఏ వేళ చూసినా ఎవరో ఒకరు వచ్చిపోతుండేవారు. ఎప్పుడు ఎవరు వచ్చినా వచ్చిన వాళ్ళందరికీ అతిధి మర్యాదలు చేసి, ఆదరించి అన్నమ్పెట్టికాని పంపేవారు కాదు ఆయన శ్రీమతి నిర్మలాదేవి. ఆరోజుల్లో ఆవిడను చూసినప్పుడల్లా ‘వండనలయదు వేవురు వచ్చిరేని...అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి...’ అని మనుచరిత్రలో ప్రవరాఖ్యుడి భార్య గురించి చదువుకున్న పద్యం గుర్తుకు వచ్చేది.”

(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు)  
(04-10-2013)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి