ఈమధ్య వివిధ టీవీ ఛానళ్లలో వస్తున్న కార్యక్రమాలపై
అనేక సోషల్ నెట్ వర్కుల్లో కానవస్తున్న వ్యాఖ్యానాలు గమనిస్తుంటే, పూర్వం దూరదర్శన్ కూడా ఇంతటి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోలేదేమో అని అనిపిస్తోంది. దూరదర్శన్ కార్యక్రమాలు గురించి
జంధ్యాల మార్కు సినిమాల్లో చక్కటి హాస్య స్పోరక సన్నివేశాలు అనేకం వచ్చాయి. కానీ, ప్రస్తుతం విస్తృతంగా వ్యాపించివున్న ప్రైవేటు
న్యూస్ ఛానళ్ళకు మాత్రం విమర్శకులు ఆమాత్రం మినహాయింపు (అంటే
హాస్య ధోరణిలో ఎండగట్టడం) కూడా ఇవ్వడం
లేదు, పైగా కడిగి గాలించేస్తున్నారు. వాటికి రాజకీయ
రంగులను పులుముతున్నారు. ఈ ఛానల్ ఇలాగే చెబుతుందిలే అన్న ధోరణిలో
మాట్లాడుతున్నారు. సుదీర్ఘ కాలం మీడియాలో పనిచేసిన మా బోంట్లకు ఇది మింగుడు పడడం
లేదు.
నేను ఖమ్మం కాలేజీలో చదివేటప్పుడు మాకు
ఇంగ్లీష్ గ్రామర్ లెక్చరర్ ఒకరు వుండేవారు. ఆయన రాగానే గోలగోలగా వున్న క్లాసును
అదుపుచేయడానికి డష్టర్ తో బల్ల మీద చప్పుడు చేస్తూ, ‘లెస్ నాయిస్
చిల్డ్రన్ లెస్ నాయిస్’ అని పదేపదే అనేవారు. ‘పిల్లలు ఎలాగూ గోల చెయ్యకమానరు, కాబట్టి ఆ చేసేదేదో కాస్త తక్కువ చేయండ’న్నది
దానికి టీకా తాత్పర్యం.
ఇప్పుడున్న పోటా పోటీ కాటా కుస్తీ
ప్రపంచంలో పూర్తిగా ‘మడి’ కట్టుకుని ఛానళ్ళు
నిర్వహించడం సాధ్యం కాని మాట నిజమే. కాకపోతే ‘రేటింగులను’
ఓపక్క కనిపెడుతూనే జనం నాడిని పట్టుకునే కార్యక్రమాలకు రూపకల్పన చేయడానికి కూడా అనేక వీలుసాళ్లు వున్నాయి. వాటిని గురించి ఛానళ్ళ యజమానులు ఆలోచిస్తే బాగుంటుంది. అదిగో, ఆ ఉద్దేశ్యంతోనే ఈ ‘నా గొడవ’
ఇంతకీ ఆ సలహాలు సూచనలు ఏవిటంటే:
‘వారేరీ! ఎక్కడ ఇప్పుడు?’
అనే పేరుతొ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. రాజకీయ రంగంలో,
సినిమారంగంలో కొన్నేళ్ళ పాటు ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు కనుమరుగయి అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్లు అనేకమంది
వున్నారు. అలాటి వాళ్ళను వెతికిపట్టుకుని ‘అప్పుడు – ఇప్పుడు’ వారి పరిస్తితి యెలా వుండేది ఎలావుంది అన్న విషయాలను చూపగలిగితే వీక్షకులు
ఆసక్తిగా చూసే అవకాశం వుంటుంది. ‘వీళ్ళ వారసులు ఎవరు
ఎక్కడ వున్నారు ఏం చేస్తున్నారు’ అనే
సంగతులు నిజానికి చాలా ఆసక్తిని రగిలించే అంశాలు.
కొన్ని ఉదాహరణలు కూడా వున్నాయి.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి
రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారి వారసులు ఏం చేస్తున్నారు.
అలాగే ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రానికి
ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి వారసులు ఎవరు, వారు ఇప్పుడేం చేస్తున్నారు?
ఈ వరసలోనే తెలుగు సినిమా రంగాన్ని కూడా ఒక
పట్టు పట్టవచ్చు. ఒకనాడు తమ కంటి చూపుతో సినిమా
రంగాన్ని శాసిస్తూ అంతులేని ఐశ్వర్యాలను, రాజభోగాలను అనుభవించి, చివరకు
అన్నీ పోగొట్టుకుని నేలకు రాలిన ‘తారల’ వారసుల పరిస్తితి ఏమిటి? ఇప్పుడెలావున్నారు?
వీరిలో కొందరి గురించి లోగడ పత్రికల్లో
కొన్ని వ్యాసాలు వచ్చిన మాట నిజమే అయినా టీవీ ఛానళ్ళ ద్వారా అయితే మరింత విస్తృతంగా ఆసక్తిని
రేకెత్తించే అవకాశం వుంటుంది.
అలాగే, భర్తలు మరణించిన కారణంగా అనుకోకుండా
రాజకీయ వారసత్వం దక్కించుకున్న కొందరు
మహిళలు వున్నారు. అయితే అలా దొరికిన అవకాశాన్ని సమర్ధంగా వాడుకుని ఆ పదవులను
హోదాలను పదిలం చేసుకున్నవారు బహు కొద్దిమందే.
అయాచితంగా లభించిన అవకాశాలను చేజేతులా
జారవిడుచుకున్నఅలాటి వారి కధనాలు కూడా వీక్షకుల్లో ఆసక్తి కలిగించేవే. (ఉదాహరణలు: బాలయోగి భార్య, కరణం
రామచంద్రరావు సతీమణి)
ఇప్పుడు ఎన్ని చెప్పినా, ఏవి చెప్పినా అవన్నీ రాజకీయం చుట్టూనే
పరిభ్రమిస్తుంటాయి. కాబట్టి ఆ రాజకీయాలనే ఒక అంశంగా తీసుకుని కొన్ని ఆసక్తి కరమైన
కార్యక్రమాలను రూపొందించడానికి వీలుంది.
ఉదాహరణకు రాష్ట్రంలో ప్రస్తుతం
నెలకొనివున్న రాజకీయ పరిస్తితి. ఇప్పుడు చాలా ఛానళ్ళలో - వున్న పరిస్తితికి మరింత ఆజ్యం పోసే
కార్యక్రమాలే ఎక్కువగా వుంటున్నాయి.
వీక్షకుల్లో చాలా మంది వీటిని విధిలేక చూస్తున్నారు కాని హృదయపూర్వకంగా
ఆస్వాదించలేకపోతున్నారు. పైకి అందరూ అంగీకరించలేకపోయినా లోలోపల అంతా వొప్పుకునే
వాస్తవం ఇది.
ఈ నేపధ్యంలో ఎలాటి కార్యక్రమాలకు రూపకల్పన
చేయొచ్చు అంటే –
రాష్ట్రంలో ప్రభుత్వం వుంది. మంత్రులు వున్నారు. అన్ని జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులు కూడా వున్నారు. గమ్మత్తేమిటంటే
రాష్ట్రంలో ప్రస్తుతం వున్న రాజకీయ గందరగోళానికి తగ్గట్టుగానే ఈ ఇంచార్జ్ మంత్రుల
ఏర్పాటు వుండడం ఒక విచిత్రమైన పరిస్తితి. తెలంగాణా మంత్రులెవ్వరూ సీమాంధ్ర
జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులుగా లేరు. అలాగే సీమాంధ్ర మంత్రులెవ్వరూ తెలంగాణా
జిల్లాలకు ఇంచార్జ్ గా లేరు. ఇది కాకతాళీయమా! కావాలని చేసిందా! ఇంతవరకూ దీనిమీద
దృష్టి పెట్టిన వాళ్లు ఎవ్వరూ లేరు.
క్యాబినెట్ సమావేశాలకే దిక్కులేకుండా పోయినప్పుడు
జిల్లా అభివృద్ధి మండళ్ళ సమావేశాలు జరుగుతున్నాయా లేదా అనేది పట్టించుకునే తీరిక
ఎవరికీ వున్నట్టు లేదు. ఇటువంటి అంశాలపై
దృష్టి పెడితే చక్కని ప్రయోజనకరమైన కార్యక్రమాలు రూపుదిద్దుకుంటాయి.
ఛానలూ పేపరూ చేతిలో వున్నవాళ్ళు కొద్దిగా
పరిశోధన ( దొంగ కెమెరాలు అవసరం లేదు) చేస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు
చూస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క మంత్రి కూడా, ప్రాంతాల గొడవ
పక్కనపెట్టండి, కనీసం తన సొంత జిల్లాను దాటి (పెళ్ళిళ్ళూ మొదలైన వాటిని
మినహాయిస్తే) వేరే జిల్లాలకు ఒక్కటంటే ఒక్కసారి అధికార కార్యక్రమాలపై వెళ్ళిన దాఖలాలు లేవు. ఇందులో నిజానిజాలను
నిర్ధారించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన
పని కూడా లేదు. మంత్రుల కార్యాలయాల్లో టూరు వివరాలు గురించి వారి వ్యక్తిగత
సిబ్బందిని వాకబు చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఓ ఉదాహరణ ఇస్తే బాగుంటుంది.
ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి గారు మాత్రం తన పొరుగున వున్న తూర్పు
గోదావరి జిల్లాకు వెళ్లివచ్చారు. అదీ ఎందుకటా! ఆయన గారికి పందెపుటెడ్లు అంటే
మక్కువ ఎక్కువ. వాటి కొనుగోలు కోసం, జిల్లాలు ఏమిటి మొత్తం దేశంలో ఎక్కడికయినా
వెళ్ళి వస్తారు. తూర్పు గోదావరి జిల్లాలో మంచి లక్షణాలు వున్న కపిల గోవుకు
పుట్టిన ఆవుదూడను కొనుక్కురావడానికి మాత్రమే ఆయన మొట్టమొదటిసారి ఆ జిల్లాలో
అడుగుపెట్టారట. ఒక మంత్రి అన్నవాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు బాధ్యత
వహించాల్సినవాడు. మరి దీన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి?
ఇక్కడ పేర్లు పెట్టి ప్రస్తావించాలంటే చాలా
పెద్ద జాబితా అవుతుంది. మంత్రుల జాబితా తీసుకుని వాళ్లు ఇటీవలి కాలంలో కానీ, వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత
కానీ, వాళ్లు తమ జిల్లాలు, ఆ మాటకు వస్తే తమ నియోజకవర్గాల పరిధులను దాటి
(రాజధాని హైదరాబాదును మినహాయిస్తే) ఏ జిల్లాకు అయినా వెళ్ళి వచ్చారేమో వాకబు
చేయండి అసలు నిజాలు బయట పడతాయి. మళ్ళీ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఆరోగ్యశాఖకు
సంబంధించి సీమాంధ్రకు చెందిన క్యాబినెట్ మంత్రి ఒకరు వున్నారు.
ఆదిలాబాదు జిల్లాలో అంటువ్యాధులు ప్రబలడం గురించి పత్రికల్లో అనేక
వార్తలు వచ్చాయి. కానీ అధికారులు తప్ప సంబంధిత మంత్రి ఒక్కనాడు కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదు. అలాగే,
తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు. తమ శాఖలకు చెందిన అనేక
సమస్యలు సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తినా కిక్కురుమనలేదు. అటు వైపు తొంగి చూడలేదు.
ఈ రకమైన అంశాలను తీసుకుని కార్యక్రమాలను
రూపొందిస్తే – వాటికి రాజకీయ పరమైన రంగూ రుచీ వాసనా వున్నప్పటికీ – ప్రజోపయోగంగా
కూడా వుంటాయి. మీడియా తన సామాజిక బాధ్యతను కూడా నిర్వహించినట్టు అవుతుంది.
ఏమంటారు?
(11-09-2013)
నేటి మీడియ పరిస్తితి
రిప్లయితొలగించండిhttp://updatedvideo.blogspot.com.au/2013/08/ghanta-chakrapani-fires-on-seemandra.html