నాకు ఓనమాలు దిద్దించిన అప్పయ్య మాస్టారు కన్నుమూశారు.
ఆయన్ని తలచుకుని, ఆయన్ని గురించి రాసి, వోనమాలు
దిద్దించిన ఆ గురుదేవుని గురించి ‘గురుపూర్ణిమ’
సందర్భంగా నాలుగు మంచి మాటలు చెప్పుకుని అయిదురోజులు కూడా గడవలేదు.
అప్పయ్య పంతులుగారు చనిపోయారని పదినిమిషాల క్రితం
ఖమ్మం నుంచి మా అన్నయ్య కొడుకు రమేష్ ఫోను.
వెంటనే వివరాలకోసం మా వూరు కంభంపాడులో వుంటున్న నా
చిన్ననాటి స్నేహితుడు పర్చా రామ్మూర్తికి ఫోను చేసాను. అప్పయ్యగారి ఇంటికి అతడిది
మూడో ఇల్లే.
(కీర్తిశేషులు శివరాజు అప్పారావు గారు)
అప్పయ్యగారి వియ్యంకుడు మొన్నీమధ్యనే చనిపోయాడట.
నిన్న ఖమ్మంలో పన్నెండోరోజు కర్మకాండకు
హాజరై రాత్రే తిరిగివచ్చారట. అదీ రానూ
పోనూ బస్సులో. ఆయనదేమీ చిన్నాచితకా వయస్సు కాదు. ఈ మధ్యనే ఎనభై తొమ్మిది నిండి తొంభయ్యో
పడిలో పడ్డారట. అయినా ఎలాటి అనారోగ్యం ఆయన
దరిదాపుల్లోకి రావడానికి సాహసించలేదు. నలుగురికి విద్యాదానం చేసిన పుణ్యం ఆయనకు
ఆవిధంగా అక్కరకు వచ్చింది. అంత వయస్సులో
ఎవరయినా వొంటరిగా బస్సు ప్రయాణం చేయగలగడం అనేది మాటలు కాదు. నిన్నటి ఖమ్మం ప్రయాణంతో అప్పయ్యగారి జీవనయానం
కూడా ముగిసింది. మాకు ఇంత అక్షర బిక్ష పెట్టిన మహానుభావుడు దాటిపోయాడు. నిజంగా
మహానుభావులకు మాత్రమే లభించే అనాయాస మరణం ఆయనకు దక్కింది.
మరో యాదృచ్చికం. అప్పయ్యగారి మరణ వార్త గురించిన
ఫోను వచ్చినప్పుడు నేను ‘రేడియో రోజులు’ మరో భాగం మొదలు పెడుతున్నాను. ఇందులో
కాకతాళీయం ఏమిటంటే అప్పయ్య గారు నాకు తెలిసిన మొట్టమొదటి న్యూస్ రీడర్. అదేమిటంటారా!
మాచిన్నప్పుడు గూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే
పంచాంగ రచయిత ఒక్కరే చందా కట్టి ఆంద్రపత్రిక దినపత్రికను పోస్టులో తెప్పించేవారు. ఆ పేపరు మరునాడు సాయంత్రానికి కాని మా వూరు చేరేది కాదు.
అప్పయ్య మాస్టారు వూరి నడిబొడ్డున నిలబడి ఆ పత్రికలోని వార్తలను అన్నింటినీ తన
కంచు కంఠంతో చదివి వినిపించేవారు. వినే మా బోంట్లకు అచ్చు రేడియోలో వార్తలు
విన్నట్టే వుండేది.
శివరాజు అప్పయ్య గారి
ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. (10-09-2013)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి