16, ఆగస్టు 2013, శుక్రవారం

ఎంతయినా మీరు దేవుడి కంటే గొప్పవారు కదా!



అందరి సంగతేమో కానీ దేవుడుతో నాకు కొన్ని పేచీలున్నాయి. నేను ఆయన్ని అడిగేవన్నీ చాలా అత్యల్ప స్వల్ప విషయాలని నా ధృఢనమ్మకం. ఆయన్నేమన్నా మణులడిగానా మాన్యాలడిగానా. పూర్వం కాలం రాక్షస భక్తుల మాదిరిగా కోరరాని వరాలేమన్నా  కోరానా!  లేదే!  ఏదో కొంచెం అహంకారం తగ్గించవయ్యా మగడా! అన్నాను.

పనిలో పనిగా, కాస్త  చేయి తీరిక చేసుకుని ఆ చేత్తోనే నా అజ్ఞానం కూడా కొంత తగ్గించమని మొక్కుకున్నాను. పట్టించుకున్న పాపాన పోతేగా! ఆయన లెక్కలు ఆయనకున్నట్టున్నాయి. దేవుడు కదా! కాళ్ళూ చేతుల మాదిరిగా తెలివితేటలు కూడా మనుషులకంటే  ఆయనగారికి ఎక్కువే కాబోలు.

అహంకారం తగ్గిస్తే తనకు ఇక బొత్తిగా పనివుండదన్న సందేహం వల్ల కావచ్చు. అజ్ఞానులు లేకపోతె తననిక నమ్మేవాళ్ళు కూడా వుండరన్న అనుమానం వల్ల కావచ్చు. మొత్తానికి ఏమయితేనేం దేవుడు నా గోడు పట్టించుకోలేదు. దానితో నా అహంకారం, అజ్ఞానం రెండూ ఒకటి నొకటి పెనవేసుకుని  - పాదు చేసి, నీరు పోసి పెంచిన పూలపొదలా నన్ను గట్టిగా అల్లుకుపోయాయి.

అలా అల్లుకుపోయిన ఆ రెండూ ఇప్పుడు  నా ఈ రాతల్లో  మఠం వేసుక్కూర్చున్నాయి. వెనక్కి తిరిగి చూసుకోకుండా  ఎడాపెడా రాసేస్తున్న ఈ  పోస్టింగుల్లో నక్కి నక్కి చూస్తున్నాయి. 

అందువల్ల మీ అందరికీ నా మనవేమిటంటే – 
అలాటి అజ్ఞానపు ఆలోచనలు, దురహంకార  ధోరణులూ ఈ రాతల్లో ఎక్కడయినా పంటికింద రాయిలా తగిలితే  పెద్దమనసు చేసుకుని 
 నా అజ్ఞానాన్ని మన్నించండి. నా అహంకారాన్ని క్షమించండి.
ఎంతయినా మీరు దేవుడి కంటే గొప్పవారు కదా!

5 కామెంట్‌లు:

  1. ఉండి ఉండి మీరిలా....:))

    రిప్లయితొలగించండి
  2. మనకు మనం మనము చేసే పనులు చాలా గొప్పవిగా, ఇతరుల కన్న వున్నతంగా వున్నాయి అని భావించినంత కాలమూ అహంకార భావన లోనే వుంటాము.. ఒకవేళ ఎవరైనా మనమీద విమర్శ చేసినా, ఇతరుల వద్ద మనల్ని కించపరుస్తున్నట్లు మాట్లాడినా పెద్దగా పట్టించుకోము.. అలా కాక ఇతరులు మన తప్పుల్ని ఎంచుతున్నప్పుడు, లేదా ఒక్కసారి వెనక్కి చూసుకుని ఆ రోజు మనం అలా ప్రవర్తించి వుండ రాదు అని మనలో మానసిక సంఘర్షణ మొదలై, మనం చేసిన తప్పుని మరల పునరావృత్తి కాకుండా వుంటే ఈ అహంకారం, దురభిమానము తగ్గిపోయి, ఇతరుల యెడల మనం ప్రవర్తించే విధానం మార్చుకుంటూ ముందుకు సాగిపోవాలి.. వయసులో పెద్దవారు, ఒక వున్నత స్థానాన్ని పొందిన మీకు ఒక లెవెల్ ఎక్కువ స్థాయిలో వుండడం సహజమే.. కాని అబ్దుల్ కలాం లాగో, మధర్ ధెరిస్సా లాగో ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి వుండే లక్షణాలు వుంటే అందరికీ మంచిది..

    రిప్లయితొలగించండి
  3. @Kashtephale- ఏమి చెయ్యమంటారు. ఎలా రాసినా, ఏ మిరాసినా రంద్రాన్వేషణ చేస్తూ రాసే కామెంట్లు భరించలేక రాసుకున్న సంగతులు ఇవి.

    రిప్లయితొలగించండి
  4. @విన్నకోట నరసింహారావు - కామెంట్ మోడరేషన్ అంటే ఏమిటి నరసింహారావు గారు. ఏళ్ళంటే దొర్లుకుంటూ 68 మీద పడ్డాయి కాని కంప్యూటర్ విషయానికి వస్తే ఇంకా 'అ ఆ ఇ ఈ' ల పరిజ్ఞానమే.

    రిప్లయితొలగించండి