28, ఆగస్టు 2013, బుధవారం

విభజనపై విచికిత్స

రాష్ట్ర విభజన అంశంపై  ఈరోజు (28-08-2013) ఆంధ్య జ్యోతి దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురించిన నా వ్యాసం. - భండారు శ్రీనివాసరావు 


విభజన – విచికిత్స (As published in today’s Andhra Jyothy, Edit Page)భండారు శ్రీనివాసరావు


రాష్ట్ర విభజన అనివార్యం. ఆ నిర్ణయంలో మార్పువుండదు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. అది మినహా వేరే ఏవైనా విషయాలుంటే చెప్పండి. అవి కూడా ఆంటోనీ కమిటీతోఅని కాంగ్రెస్ అధినాయకత్వం తమను కలుసుకుని తమ గోడు వెళ్ళబోసుకోవాలని వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో కుండ బద్దలు కొట్టినట్టు చెబుతోందని భోగట్టా.
ఈ నేపధ్యంలో అంశాలను సమీక్షించుకుంటే కొన్ని విషయాలు బోధపడతాయి. నిర్ణయం అమలుచేసే వ్యవధానం, ఎన్నికలు ముంగిట్లో వున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వుందా అన్న అనుమానాలు పక్కకి పెట్టిచూస్తే, కాసేపు ఆ పార్టీ చిత్తశుద్ధి పట్ల వున్న సందేహాలను కూడా పక్కకి నెట్టి  చూస్తే, కనబడే రాజకీయ చిత్రం అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి.
విభజన నిర్ణయం తిరుగులేనిదని అంటున్నారు. అటువంటప్పుడు మళ్ళీ కమిటీల మీద కమిటీలు వేస్తూ పోవడాన్ని యెలా అర్ధం చేసుకోవాలి. విభజన విషయంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పాతుకునిపోయివున్న భయ సందేహాలను ఈ కమిటీ తీర్చగలుగుతుందా. వినడం తప్ప వేరే నిర్ణయం తీసుకోలేని ఈ కమిటీ ఏర్పాటు కేవలం కాలయాపన కోసమే అని ఎవరైనా అంటే తప్పు పట్టాల్సింది ఏముంటుంది.
పార్టీ అధినేత్రి సోనియా గాంధి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపకల్పన చేసిన ఆహార భద్రత బిల్లు లోక్ సభ ఆమోదం పొందేలా చూడగలిగినప్పుడు, అదే వేగంతో నలుగురినీ సంప్రదించి ఒక ఆమోద యోగ్యమైన పరిష్కారంతో విభజన బిల్లు తయారు చేసి ఆమోదింప చేయడానికి వున్న అడ్డంకులు ఏమిటి?  మీనమేషాలు లెక్కిస్తూ రోజులు దొర్లించడం వల్ల ఇరు ప్రాంతాల ప్రజల్లో రాజుకుంటున్న విద్వేషాలు మరింత ప్రజ్వరిల్లడం మినహా సాధించేది ఏముంటుంది?
మాటల ఈటెలు విసురుకుంటున్న రాజకీయ నాయకులకు వచ్చేది పోయేది ఏమీ వుండదు. విద్వేషాలు మరింత ముదిరితే బాధ పడేది ఇరు ప్రాంతాల ప్రజలే. ఈరోజు ఒక పార్టీలో వున్న నాయకుడు పట్టుమని పదికాలాలపాటు అదే పార్టీలో వుంటాడన్న నమ్మకం   ఆ పార్టీలకే లేదు.  ఇక అలాటి  వాళ్లని నమ్ముకుని ఆవేశకావేశాలకు దిగడం అంత తెలివితక్కువతనం మరోటి వుండదు.
మరో విషయం. తెలంగాణాని కోరుకుంటున్న వాళ్ళపై ఇప్పుడు పెద్ద బాధ్యత వుంది. కోరుకుంటున్నకల సాకారమయ్యే  సంకేతాలు కనబడుతున్న దశలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం వున్నప్పటికీ, లక్ష్యానికి చేరువైన సమయంలో కటువైన వ్యాఖ్యలు చేయకుండా సంభాలించుకోవాల్సిన అవసరం తెలంగాణావాదులపై ఎక్కువగా వుంటుంది. పరిస్థితులు విషమంగా తయారవడం వల్ల ఆ సాకు చూపి తప్పించుకునే అవకాశం అధికార పార్టీకి ఇవ్వకూడదు. విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలకు వున్న సందేహాలను తేలిక పరచి మాట్లాడ్డం తగ్గించాలి. వాటిని నివృత్తి చేసే పనికి నడుం కట్టాలి. మీకేం భయం లేదు, మీ రక్షణకు మాదీ పూచీఅని టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్లు సయితం హామీలు గుప్పించడం విడ్డూరంగా వుంది. ఆ పని చేయాల్సింది, అలాటి హామీలు ఇవ్వాల్సింది అధికారంలో వున్నవాళ్ళు. ఆ హామీల అమలుకు సత్వరం ఒక నిర్దిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేసినప్పుడే వాటిపట్ల ప్రజలకు విశ్వసనీయత కలుగుతుంది.            
విభజన తప్పదు అని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు అది చేతల్లో కూడా కనబడాలి. కానీ ఆ దిక్కుగా అడుగులు పడుతున్న సూచనలు కానరావడంలేదు, కేవలం మొక్కుబడి ప్రకటనలు తప్ప.
కాంగ్రెస్ పార్టీ కానీ, మిగిలిన రాజకీయ పార్టీలు కానీ, తమ స్వప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజల ప్రయోజనాలను కాపాడుతాయా అన్నదే ఈ నాటి ప్రధాన  ప్రశ్న. ఈ ప్రశ్నకు సరైన జవాబు అన్వేషించడంలో పార్టీలు విఫలం అయితే భవిష్యత్ తరాలు మాత్రమే కాదు వర్తమానతరం వారు కూడా వాటిని క్షమించరు.
(27-08-2013)





3 కామెంట్‌లు:

  1. రక్షణ ఉండదనే ప్రచారమే అనవసరం. దానికి యంత్రాంగాలు దండగ. ఇదంతా ఎవరికోసం జరుగుందో తెలీని వారు అమాయకులు.

    గమ్యం చేరువలో ఉందనే అనవసరమయిన ఉత్సాహంతో కొందరు తెలంగాణా నాయకులు నష్టపూరితమయిన రాజీలు కుదుర్చుకోవాలని ఆలోచిస్తున్నట్టు ఉంది. ఇన్నేళ్ళు బ్రహ్మాండమయిన స్పూర్తితో ఉద్యమించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

    రిప్లయితొలగించండి
  2. Next entamma, dakshina telangana, vayuvya telangana laa 8 dikkula telangana kaa tarvaata udyamam?

    రిప్లయితొలగించండి
  3. avunu ilage dakshina telagnaa vadu vayuvaa telanagan vanni thegaa thini balstha appudu adhe portam cheya ka thappaddu

    రిప్లయితొలగించండి