మా రెండో తాతగారు సుబ్బారావు గారి గురించి కొన్ని
ఆసక్తికరమైన అంశాలను మా అన్నయ్య పర్వతాలరావు గారు తన రచనలో ప్రస్తావించారు. దానికి
సంబంధించిన ఒక అరుదయిన ఫోటో మా రెండో అన్నయ్య కొడుకు జవహర్లాల్ పంపాడు. అందువల్ల ఆ భాగాన్ని
ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను.
"పర్వతాలయ్య గారి
హయాములోనే ఒక సంఘటన జరిగింది. మా చిన తాత గారు భండారు సుబ్బారావు గారికి రైల్లో ఒక
యువ సాధువు కలిశాడు. ఆయన వర్చస్సు,
పాండిత్యం చూసి మా చిన తాతగారు ముగ్ధుడై ఆయనను కంభంపాడు తీసుకు వచ్చారు. ఆ సన్యాసి
పేరు శ్యాం ప్రకాష్ బ్రహ్మచారి. ఆయనను అంతా కాశీ స్వాములవారు
అనేవారు.
(కంభంపాడు స్వామీజీ శ్రీ శ్యాం ప్రకాష్ బ్రహ్మచారి)
ఆయన మా వూళ్ళో ఒక ఆశ్రమం స్థాపించారు.
స్వామి వారు హోమియో వైద్యం కూడా చేసేవారు.
ఆయన బోధనలు విని మా తాతగార్లు తలా కొంత పొలం ఆయన గారి ఆశ్రమానికి దానంగా ఇచ్చారు.
అందులో కొంత భాగంలో ఆయన తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే ఒక వేద పాఠశాలను కూడా నిర్వహించారు. అదంతా
బహుశా 1930-40 ప్రాంతాల్లో కావచ్చు. ఆ కార్యకలాపాలతో శ్రీ మండాలపాటి
నరసింహారావుగారికీ, విజయవాడ న్యాయవాది శ్రీ దంటు
శ్రీనివాస శర్మ గారికీ సంబంధం వుండేది. మా సుబ్బయ్య తాతగారు సతీ సమేతంగా
కొన్నాళ్ళు ఆశ్రమంలోనే కాపురం పెట్టారు.
ఆ స్వాములవారు కొన్నాళ్ళు
మండాలపేటలోను ఆ తరువాత కొవ్వూరులోను వున్నారు. పూరీ గోవర్ధన మఠం పీఠాధిపతి గా కూడా
వున్నారు. ఆయన నిర్మించిన శివాలయం ఇప్పుడు శిధిలావస్థలో వుంది. కాశీ నుంచి తెచ్చిన
శివ లింగాన్ని అక్కడ ప్రతిష్టించారు.(ఈ మధ్యనే మా రెండో తమ్ముడు భండారు
రామచంద్రరావు పూనిక వహించి ఆ గుడిని ఓ
మేరకు అభివృద్ధి చేసి ఒక పూజారిని
నియమించి ఆ ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా కొంత మొత్తం పంపుతున్నాడు) ఆశ్రమం మాత్రం
కాలగర్భంలో కలిసిపోయింది. ఆలయానికి ఇచ్చిన పొలం ప్రభుత్వం తీసుకుని ఆ ప్రదేశంలో షెడ్యూల్డ్ కులాలవారికోసం ఒక పెద్ద
కాలనీ నిర్మించింది. మొత్తానికి మా పూర్వీకులు దానం చేసిన స్థలం ఒక సత్కార్యానికి
ఉపయోగపడడం సంతోషదాయకం. పునరుద్ధరించిన ఆలయానికి మా తమ్ముడు రామచంద్ర రావు ట్రస్టీగా వున్నాడు.
(మరో భాగం మరో
సారి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి