5, జులై 2013, శుక్రవారం

అర్ధం – అపార్ధం


నిన్న ఉదయం మహా టీవీ చర్చలో పాల్గొంటూ వుంటే ఒక వీక్షకుడు ఫోన్ ఇన్ లోకి వచ్చి నేరుగా నేను చెప్పినదాన్ని ఖండిస్తున్నాను అని చెప్పాడు. తరువాత ప్రోగ్రాం ప్రెజెంటర్ శ్రీనివాస్,  అతడి అభిప్రాయంపై నా స్పందనకు అవకాశం ఇచ్చారు. ‘అభిప్రాయం వ్యక్తం చేసుకునే స్వేచ్చ అతడికి వుంది. ఇక్కడ కూర్చుని నేను వ్యక్తం చేసే అభిప్రాయాలతో టీవీ చూసేవాళ్ళందరూ ఏకీభవిస్తారనుకోవడం మంచిది కాదు.’ అని తిరస్కరించాను. ఇదేదో గొప్పకోసం చెప్పుకోవడం కాదు. సందర్భం వచ్చింది కనుక ప్రస్తావించాల్సివచ్చింది.
‘జర్నలిస్టులు, స్కూటర్ లోన్లు’ అని గతం తవ్వుకోబోతే అదికాస్తా ‘హెల్మెట్ల ఆందోళన – జర్నలిస్టులు’ కిందికి మారి కొందరు ఏకంగా రాజకీయ రంగునే పులిమారు. ఇలాటి వేదికలపై ఈ పరిణామాలు సహజం కూడా. కానీ, ఒక విషయం వివరించకుండా మహా టీవీలో మాదిరిగా వొదిలేస్తే వెలువడే వ్యాఖ్యాన బాణాలు మరింత అగ్గిని రాజేస్తాయనే భావనతో ఇది రాస్తున్నాను. నేను యనభయ్యవ దశకం చివరిలో, తొంభయ్యవ దశకం  మొదట్లో మాస్కో రేడియోలో పనిచేస్తున్నప్పుడు, డెబ్బయి దశాబ్దాలకు పైగా ఆధిపత్యపు పోరులో అమెరికాకు సవాలుగా నిలిచిన  సోవియట్ యూనియన్, ఒక్కసారిగా  కుప్పకూలి అంగ వంగ కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమైపోయింది. అలాటి సందర్భాలలో అక్కడి విషయాలను గ్రంధస్తం చేస్తే నాటి పాలకులను విమర్సించినట్టు భావిస్తే ఏం చెప్పుకోగలం? అలాగే, ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రజల్లో అలజడి కలిగించిన ఓ అంశాన్ని ప్రస్తావిస్తే దాన్ని ఆయన పాలనపై విమర్శగా పరిగణించి వ్యాఖ్యానిస్తుంటే కూడా ఏం చెయ్యగలం? నిజానికి  ఎన్టీయార్ కానీ, లేదా పోలీసు అధికారులు కానీ యెంత హుందాగా ప్రవర్తించారు అన్న సంగతులకే ప్రాధాన్యం ఇచ్చి రాసినా కూడా  దాన్ని పట్టించుకోకుండా, దీన్నేదో టీడీపీ – కాంగ్రెస్ నడుమ రాజకీయ అంశంగా రంగు పులిమి వ్యాఖ్యానాలు చేస్తుంటే ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు. గతంలోని స్వీయ  అనుభవాలను ఒక డైరీ మాదిరిగా రాయాలన్న,  లేదా ఆ నాటి సంఘటనలను ఒక ఫోటో మాదిరిగా చూపించాలన్న ఆసక్తి తప్ప నాకు ఏవిధమయిన రాజకీయ ఉద్దేశ్యాలు లేవని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అర్ధం చేసుకోకపోతే పర్వాలేదు, అపార్ధం చేసుకోకండి. – భండారు శ్రీనివాసరావు (05-07-2013) 

3 కామెంట్‌లు: