పర్వతాలయ్య గారికి
చిన్నతనంలోనే పెండ్లయింది కదా. పెండ్లిలో కూడా మా బామ్మ ఆయనపై పడుకుని నిద్రపోయిందట.
పొలిమేర మీద ఊళ్ళు కావడం వల్ల బాగా రాకపోకలు ఉండేవి. ఇద్దరూ కలసి ఆడుకునేవారట. మా
బామ్మగారు సమర్త కాకపూర్వమే గర్భం ధరించిందట. మా నాన్నగారు పోయినప్పుడు చెల్లమ్మమ్మ
ఎంతో దుఃఖపడింది. ఆ ఏడుపులో ఇదిగో ఈకధ ఆమె
నోట మొదటిసారి బయటకు వచ్చింది. అలా పిల్లలు పుట్టడం దోషం అని, పుట్టగానే, రోజుల బిడ్డగా వున్న మా నాన్నగారిని ఎరుకల బూశామ
(బూశమ్మ)కు దానం ఇచ్చారట. ఆమె పిల్లవాడిని తన గుడిసెకు తీసుకుపోయింది. తరువాత ఆ
పసివాడిని గంపలో పెట్టుకుని ‘పండ్లోయమ్మ పండ్లు’ అంటూ భూశమ్మ వూళ్ళో తిరుగుతుంటే, చెల్లమ్మగారు వెళ్లి, ‘మాకు ఓ పండు కావాలి అమ్ముతావా’ అని అడిగి, సోలెడు సజ్జలు భూశామకు ఇచ్చి పిల్లవాడిని కొనుక్కుని
ఇంటికి తీసుకు వచ్చిందట. అలా, ఆ దోష పరిహారం జరిగిందన్నమాట. మా నాన్నగారు తన 53వ ఏటనే చనిపోయారు. మా తాతగారు, ముత్తాత గారు
సుమారుగా అదే వయస్సులో పోయారు. మొదటి పర్వతాలయ్య గారిని కూడా ఆ వయస్సులోనే హత్య చేసారు. అప్పయ్య గారి సంగతి తెలియదు.
బహుశా షష్టిపూర్తి చేసుకున్నారేమో. అలా జరిగివుంటే, ఆయన తరువాత, నా వూహ ప్రకారం,
మొదటి వరుస సంతానంలో షష్టిపూర్తి చేసుకున్నది నేనేనేమో.నందిగామలో జనన మరణ
రిజిష్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తేదీలు పట్టుకుంటే కాని ఈ విషయం గట్టిగా చెప్పలేము.
(భండారు వారి ఆడపడుచులు - మధ్యలో మా అమ్మగారు)
చెల్లమ్మగారికి
పుట్టిన ఒకే ఒక కూతురు రుక్మిణమ్మ గారి ద్వారా యెంత సంతతి, ఎన్ని కుటుంబాలు తామర
తంపరగా వర్దిల్లాయో తలచుకుంటే అబ్బురమనిపిస్తుంది. మా నాన్నగారికి ఏడుగురు
ఆడపిల్లలు. నలుగురు మొగపిల్లలు.
(మళ్ళీ వాళ్ల పిల్లలకు పిల్లలు)
(సంతానం లేనివాళ్ళు
మా ఇంట్లో పందిరి గుంజను ముట్టుకుంటే పిల్లలు పుడతారని హాస్యంగా చెప్పుకునేవారు)
(మరో భాగం మరో
సారి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి