20, జులై 2013, శనివారం

వృత్తి రహస్యం


పర్వీందర్, హబీబ్ ఇద్దరు వృత్తి రీత్యా స్నేహితులు. ఆ ఇద్దరిదీ ఒకటే వృత్తి. లండన్ వీధుల్లో అడుక్కోవడం. ఇందుకోసం ఇద్దరూ చెరో వీధి ఎంపిక చేసున్నారు. పొద్దున్నే బయలుదేరడం, ఓ చౌరస్తా చూసుకుని చతికిలపడడం, ఎవరయినా జాలితలచి ఇచ్చే డబ్బులు పోగుచేసుకోవడం- ఇదీ వారి దిన చర్య.
హబీబ్ జాతకం ఏవిటో కాని ఏరోజూ అతడి జోలిలో పడే డబ్బు రెండు మూడు పౌండ్లు దాటేది కాదు. పర్వీందర్ విషయం అలా కాదు. ప్రతిరోజూ డబ్బుల పంటే. ఎవ్వరు కూడా పది  పౌండ్ల నోటుకు తక్కువ వేసేవాళ్ళు కాదు.
సాయంత్రం అయ్యేసరికి ఎన్నో  నోట్లు అతడికి ధర్మం కింద వచ్చేవి.
ఇద్దరూ బిచ్చగాళ్ళే. కానీ ఈ తేడా ఎందుకో, అడుక్కునే బొచ్చె నెత్తినేసి కొట్టుకున్నా హబీబ్ కి  అర్ధం అయ్యేది కాదు. చివరికి పర్వీందర్ నే అడిగాడు. అతడు బదులుగా మరో ప్రశ్న వేసాడు.
“బిక్షం అడిగేటప్పుడు నువ్వేమని అడుగుతావ్?”
“యేమని అడుగుతాను.పెళ్ళాం రోగిష్టిది. పిల్లలు చిన్నవాళ్ళు. నాకు ఉద్యోగం లేదు. దయచేసి ధర్మం చేయండి అని అడుగుతాను. వాళ్ళు ఒకటో రెండో నోట్లు విదిలించి  వెడతారు.”

“మరి నేనేమి అడుగుతానో తెలుసా? అయ్యా నేను పాకిస్తాన్ తిరిగివెళ్ళాలి.ఒక్క  పది పౌండ్లు మాత్రమె  తక్కువ పడ్డాయి అంటాను. అంతే!”


(20-07-2013)
Image Courtesy Owner

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి