జర్నలిస్టు
వృత్తి జీవితం తొలినాళ్ళలో నేను కలిసి తిరిగిన అనేకమంది మిత్రులు-తదనంతర కాలంలో
స్వయంకృషితో ఎదిగి వాళ్ళు పనిచేస్తున్న పత్రికలకే ఎడిటర్లుగా పనిచేసి రిటైర్
అయ్యారు. ఉచ్చస్తితిలో వున్నప్పుడు వాళ్ళని కలుసుకోవాలంటే మహామహులకే దుర్లభంగా
వుండేది. విజిటింగ్ కార్డు పంపి అనేకమంది వెయిట్ చేస్తున్న సమయాల్లో కూడా వాళ్ళు- నాతో గతకాలంలో గడిపిన రోజులు
మరచిపోకుండా -నన్ను
తమ సన్నిహిత వర్గంలోని వాడిగానే పరిగణించి ఆదరించేవారు. అది వారి గొప్పతనంగా నేను
భావిస్తాను.
విలేకరిగా వృత్తి జీవితం ప్రారంభించి
విలేకరిగానే పదవీ విరమణ చేసినవాడిని నేను. నా బోటి వాళ్ళే ఈ వృత్తిలో ఎక్కువగా వుంటారు. అతికొద్దిమంది
మాత్రమె తమ ప్రతిభతో పైమెట్లు ఎక్కగలుగుతారు. నాది ఒక రకంగా సర్కారు ఉద్యోగం
కనుక ఎక్కవలసిన మెట్లు తక్కువే. ఎక్కగలిగిందీ తక్కువే. గోదావరిలో ఎన్ని నీళ్ళున్నా
– మనం
బిందె తీసుకువెడితే బిందెడు నీళ్ళు, చెంబు తీసుకువెడితే చెంబెడు నీళ్ళు – మన
ప్రాప్తాన్నిబట్టి తెచ్చుకోగలుగుతామని మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు
చెప్పిన విషయం గుర్తుంచుకోవడం వల్ల ఈ మెట్లెక్కే గొడవ నా మనసుకు ఎక్కలేదు. అయినా
ఈనాటి లోకం పోకడ ఇందుకు విరుద్దం. పొజిషన్ ను బట్టి పలకరింపులు, స్తాయిని బట్టి
సాన్నిహిత్యాలు, హోదాని బట్టి ఆహావోహోలు. కానీ నా అదృష్టం – నా
మిత్రులెవ్వరు ఈ కోవలోకి రారు. అందుకే ఇన్నేళ్ళ తరవాత కూడా వారు నాతో ప్రవర్తించే తీరులో ఇసుమంత తేడా లేదు.
కీర్తి శేషులు, శ్రీయుతులు జి కృష్ణ, నండూరి
రామమోహన రావు, పీటీఐ కృష్ణ, హిందూ రాజేంద్రప్రసాద్, ఆంధ్రపత్రిక ముక్కు శర్మ, ఈనాడు శాస్త్రి, యుఎన్ఐ
డి సీతారాం, పార్ధసారధి, ఎక్స్ ప్రెస్ సుందరం, నీలంరాజు మురళీధర్, శ్రీకాంత్ విఠల్,
ఆలిండియా రేడియో పన్యాల రంగనాధ రావు, నర్రావుల సుబ్బారావు, గోవాడ సత్యారావు,
తిరుమలసెట్టి శ్రీరాములు, జ్యోతి దామోదరస్వామి, ప్రభ నంద్యాల గోపాల్, పీటీఐ జమాల్ వంటివారితో
కలిసిమెలిసి తిరగగలిగే అదృష్టం నాకు
దక్కింది. అలాగే, శ్రీయుతులు – ఆంద్ర
జ్యోతి ఆదిరాజు వెంకటేశ్వర రావు, ఈనాడు ఏబీకే ప్రసాద్, ఆంద్రజ్యోతి తుర్లపాటి
కుటుంబరావు, ఐ. వెంకట్రావు, ఎన్.ఇన్నయ్య, వేమూరి రాధాకృష్ణ, హిందూ కేశవరావు,
ఎస్.నగేష్ కుమార్, కె. శ్రీనివాస రెడ్డి, ప్రభ
పొత్తూరి వెంకటేశ్వరరావు, దేవులపల్లి అమర్, నందిరాజు రాధాకృష్ణ, జ్యోతి
రామచంద్రమూర్తి, ఆంధ్రభూమి ఎంవీఆర్ శాస్త్రి, క్రానికల్ రబీంద్రనాధ్, పెద్ద బాబాయి
కృష్ణారావు, విశాలాంధ్ర శ్రీనివాసరెడ్డి, ఆంధ్రపత్రిక శాస్త్రి, విద్యారణ్య, ప్రజాశక్తి
వినయకుమార్, ఎన్ఎస్ఎస్ కొండా లక్ష్మారెడ్డి, ఈనాడు యాదగిరి, వేణుగోపాల్, నందిరాజు రాధాకృష్ణ,
ఇండియన్ ఎక్స్ ప్రెస్ నందిరాజు రాధాకృష్ణ, ఆలిండియా రేడియో ఎంఎస్ఆర్ కృష్ణారావు, ఆకిరి రామకృష్ణారావు, ఆర్వీవీ కృష్ణారావు, డి.వెంకట్రామయ్య,
మాడపాటి సత్యవతి – ఒకరా
ఇద్దరా జర్నలిజంలో కాకలు తీరిన అనేకమందితో చనువుగా మసలగలిగే అవకాశాన్ని నా రేడియో
విలేకరిత్వం నాకు అందించింది. నిజానికి వీరిలో చాలామందితో నా సాన్నిహిత్యం – ‘గారు’ వంటి గౌరవ
పద ప్రయోగాలతో ముడిపడివుండలేదు. చాలా చనువుగా పలకరించుకోగల సంబంధ బాంధవ్యాలు
వుండేవి. దాదాపు ప్రతి రోజు సెక్రెటేరియేట్ లోని ప్రెస్ రూం లో కలుసుకునేవాళ్ళం. పత్రికా
సమావేశాలు లేనప్పుడు కొన్ని గంటలపాటు మా నడుమ ముచ్చట్లు సాగేవి. పెద్దా చిన్నా
తేడా లేకుండా ఒక కుటుంబంలోని సభ్యులమాదిరిగా గడిపేవాళ్ళం. ఇండియన్ ఎక్స్ ప్రెస్
రెసిడెంట్ ఎడిటర్ సుందరం కనపడగానే ‘సుందరం
మనమందరం’ అని
ఏదో కవిత్వ ధోరణిలో పలకరించినా ఆయన ఏమీ
అనుకునేవాడుకాదు. పైగా నవ్వి వూరుకునేవాడు. మా ఇద్దరి నడుమా మరో బాదరాయణ సంబంధం
వుండేది. గుజరాత్ గవర్నమెంటు వారి ‘గిర్నార్’
స్కూటర్ ను మేమిద్దరం ఒకేరోజు, ఒకే డీలర్ దగ్గర కొన్నాము. హైదరాబాదులో అమ్ముడుపోయిన గిర్నార్ స్కూటర్లే
బహు తక్కువ. వాటిల్లో రెండింటికి మేమిద్దరమే ఓనర్లం. ఆ రోజుల్లో వెస్పా స్కూట ర్లకు పెద్ద
గిరాకీ వుండేది. కొనుక్కోవాలంటే ఎన్నో సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిన
పరిస్థితులు వుండేవి. అందుకే మరో మాట లేకుండా మేమిద్దరం గిర్నార్ స్కూటర్లు
కొనుక్కున్నాము. అదీ ఏదో బ్యాంకు అధికారి జర్నలిష్టులమని అప్పివ్వబట్టి.
‘ఐ నో
సీఎం. ఐ నో పీఎం’ అనుకునే జర్నలిస్టుల
జీవితాలు పైకి కనిపించినంత గొప్ప కరెన్సీ కాగితాలేమీ కావు. వారికి వృత్తి రీత్యా సమాజంలో ఎంతోమంది తెలుస్తుంటారు. కానీ తోటి
జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో పరిచయాలకు
ఆస్కారం చాలా తక్కువ. అందుకే, కొందరు సాటి జర్నలిస్టులు చనిపోయినప్పుడు విషయం తెలిసికూడా వాళ్ళ ఇళ్ళకు వెళ్లి పరామర్శించలేకపోవడానికి
ఇదే కారణం. చనిపోయిన వ్యక్తీ తప్ప వేరే ఎవ్వరు తెలవదు. తెలిసిన ‘ఒక్కరికి’ మనం వచ్చిన విషయం తెలియదు. ఇది పైకి చెప్పుకోలేని ఓ పెను విషాదం.
జర్నలిజంలో గ్లామర్ ఉంది కాని ధనం లేదు అయితే yello జర్నలిజంలో అది ఉంది!
రిప్లయితొలగించండి