ప్రధమ కబళే మక్షికాపాతః
అంటే మొదటి ముద్దలోనే ఈగ పడింది అని అర్ధం.
ముందు అంటే పైన అనికాదు, ఈ వ్యాసం శీర్షికలో
ముందు బ్రాకెట్లో రాసిన పదం ‘చెప్పిన’ అని లేదు. రాసిన తరువాత చూసుకుంటే, చూడ్డం
మంచిదయింది లేకపోతే పుట్టి పూర్తిగా మునిగేది అన్న జ్ఞానోదయం అయింది. దాంతో తెలివినపడి అర్జంటుగా ముందో బ్రాకెట్టు పెట్టి అందులో ‘చెప్పిన’ అనే పదాన్ని
కూరిపెట్టి, ‘భార్య రహస్యం’ ఏవిటి అనే దిక్కుమాలిన అనుమానాలు తలెత్తి సంసారపు
పుట్టి నిండా మునగకుండా నిండుదా జాగ్రత్త
పడ్డాను.
ఇంతకీ అసలు విషయం ఏవిటంటే, మా ఆవిడ నిన్న
సాయంత్రం బయట వర్షం పడుతుండగా లోపల కరెంటులేని కారణంగా టీవీ సీరియల్ చూసే అవకాశం బొత్తిగా లేక నాతో మాటవరసకు మాటలు కలిపి వాటి మధ్యలో ఒక తూటా
పెట్టి పేల్చింది. ఆ మాట అన్నది మా ఆవిడ కాబట్టి, ఆ సమయంలో ఎవరు లేరు
కాబట్టి సరిపోయింది. అదేవిటో ఈ భార్యామణులు ఉన్నట్టుండి తమ తమ మొగుళ్ళను ఎవరితోనో ఒకరితో
పోల్చి తమ ఈగోను చల్లార్చుకుంటూ ఉంటారని ఆడవాళ్ళంటే వోర్చుకోలేని ఒకాయన చెప్పాడు
కూడా. సాధారణంగా, పక్కింటాయనతోనో,
ఎదురింటాయనతోనో పోల్చి ‘మీరూ వున్నారు ఎందుకూ...’ అని సన్నాయినొక్కులు నొక్కడం
పరిపాటి. కానీ ఈసారి మా ఆవిడంబాళ్ళు నన్ను పోల్చి చెప్పింది అట్లాంటిట్లాంటి అల్లాటప్పా
వాళ్ళతో కాదు. సాక్షాత్తు ‘ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగారికీ మీకూ తేడా ఏమీ కనబడడం లేదండీ’ అనేసింది. అమ్మ భడవఖానా. నన్నంటే
ఏదో మొగుడుముండావాడ్ని సరిపుచ్చుకుంటాను కాని నన్ను ముఖ్యమంత్రితో పోల్చడం, కాదు
కాదు ముఖ్యమంత్రిని నాతొ పోల్చడం ఏవిటి
అసాధ్యం కూలా అనుకున్నాను.
ఏవిటో అనుకున్నాకాని ఆమె లాజిక్కు ఆమెకు వుంది.
“కిరణ్ కుమార్ రెడ్డి గారి లాగే నేను మొండివాడ్ని. కాదు నాలాగే ఆయన మొండివాడు. ఎవరి
మాటా వినడు.
“ఎవరు ఏమైనా పరవాలేదు తన మాటే నెగ్గాలి అనే తరహా.
“అన్ని ధరలు పెరిగాయి కాస్త నెల బడ్జెట్
పెంచవయ్యా మగడా అంటే కుదరదంటే కుదరదని తెగేసి చెప్పేరకం.
“మీరు బయట టీవీల్లో మాట్లాడ్డం తప్పిస్తే ఇంట్లో వాళ్ళతో
ఓ మాటా వుండదు ఓ ముచ్చటా వుండదు. ఆయన్ని గురించి వాళ్ళ పార్టీ వాళ్ళదీ అదే గోల”
“అందుకే మీకూ ఆయనకూ తేడాలేదనేది” అనేసింది పేపరు
మడిచి పక్కనపడేస్తూ.
ఇంకేం అనను? అనాల్సింది
అంతా తానేఅనేసిన తరువాత.
(18-07-2013)
లేదు లేదు, నిజానికి మీరిద్దరూ సీతయ్య టైపు కావచ్చు. ఎవ్వరి మాటా వినరు కదా!
రిప్లయితొలగించండి