15, జూన్ 2013, శనివారం

అమెరికాలో వ్యవసాయం చేయాలని వుంది


ఇదేమిటి అలాటి దేశం వెళ్ళి ఏదో లక్షల్లో డాలర్ల పంట పండించే పెద్ద పెద్ద  ఉద్యోగాలు చేయాలని అనుకుంటారు కాని అంత దూరం పోయీ, అంతంత చదువులు చదివి కూడా  గిట్టుబాటుకాని దిక్కుమాలిన  పొలం దున్నుకోవాలేమిటి ఇదేం పోయేకాలం అని కొందరికయినా  అనుమానం రావచ్చు. అయితే,  మన దేశానికి చెందిన, ఆ మాటకు వస్తే మన రాష్ట్రానికే చెందిన ఒక  పెద్దమనిషికి, - శ్రీ కొప్పరపు ప్రకాష్ - నిజానికి వయస్సు రీత్యా చాలా చిన్నవాడు -   ఆ దేశం వెళ్ళిన తరువాత ఈ కోరిక పుట్టిన మాట నిజం. ఆయన చెప్పేదేమిటో ఆయన మాటల్లోనే విందాం.


డాక్టర్ ఎం.ఎస్.స్వామినాధన్ తో ప్రకాష్ కొప్పరపు 

“అమెరికాలో అయోవా (Iowa) అనే రాష్ట్రం వుంది.  డె మొయిన్  (Des Moines, IA) అనే పెద్ద నగరం ఈ రాష్ట్రానికి రాజధాని. అక్కడికి వెళ్ళి చూసేవరకు నేనూ అందరి మాదిరిగానే అమెరికాలో కుదురుగా ఉద్యోగం చేసుకోవాలని అనుకున్నవాడినే. కానీ ఆ ప్రాంతం  నా వూహల్ని, అభిప్రాయాల్ని పూర్తిగా మార్చేసింది.  ఒకప్పుడు కృష్ణా డెల్టాను మన రాష్ట్రానికి ధాన్యాగారం అనేవారు. అలాగే అయోవా రాష్ట్రంలోని డె మొయిన్.  యావత్ అమెరికా ప్రజలకు కావాల్సిన మొత్తం తిండి గింజల అవసరాల్లో అత్యధికభాగం  డె మొయిన్  అనే ఈ ప్రాంతంలోనే ఉత్పత్తి అవుతోంది.  కాకపొతే  ముందు  పేర్కొన్న మన కృష్ణా డెల్టాకు, అమెరికాలోని ఈ ప్రాంతానికి నడుమ  వ్యవసాయ  విధానాల విషయంలో   ఎంతో వ్యత్యాసం వున్న మాట కూడా నిజం. ఇక్కడి రైతులు వ్యవసాయాన్ని ఒక వ్యాపకంగా చూడరు. అది కూడా ఒక వ్యాపారం అనే అనుకుంటారు. సమర్ధవంతంగా సాగుచేసి లాభాలు గడించాలని భావిస్తారు. అందుకే అమెరికాలో వ్యవసాయం కూడా కార్పొరేట్ రూపాన్ని సంతరించుకుంది. పెద్ద పెద్ద కంపెనీలు వేలాది ఎకరాలను కొనుగోలు చేసి పెద్దయెత్తున ఆహార ధాన్యాలు పండిస్తుంటాయి. వీటికి తోడు సాంప్రదాయిక కుటుంబ సేద్యాలు సైతం ఆ దేశంలో ఇప్పటికీ మనుగడలో వున్నాయి. ఈ మధ్య ఆ ప్రాంతానికి  టూరిస్టుగా వెళ్ళినప్పుడు అక్కడి వ్యవసాయ రంగాన్ని దగ్గరనుంచి పరిశీలించిన తరువాత నాకు కలిగిన భావాలను అందరితో పంచుకోవడానికే ఈ ప్రయత్నం.
“ఆ ప్రాంతంలో వ్యవసాయం చేయాలని అనుకునేవారికి అవసరమైన సమాచారం మొత్తం  నెట్లో అందుబాటులో వుంది. భూముల అమ్మకాలు, కౌళ్ళకు సంబంధించి సమస్త వివరాలు అందులో లభిస్తాయి. వ్యవసాయాన్ని ఒక వ్యాపారం మాదిరిగా నిర్వహించడానికి వీలైన మెళకువలు నేర్పుతారు. ప్రభుత్వం పాత్ర పరిమితం. రైతులకు యేది లాభసాటో అర్ధం చేసుకుని ఆ విధానాలను మాత్రమే  అమలుచేయడానికి  ప్రభుత్వ విభాగాలు చివర్లో రంగ ప్రవేశం చేస్తాయి. అమెరికా సెనేట్లో ఒక బిల్లు పరిశీలనలో వుంది. వ్యవసాయాన్ని ఒక వృత్తిగా స్వీకరించడానికి ముందుకువచ్చే   యువజనులకు అవసరమైన రుణసదుపాయం, పన్ను రాయితీలు కల్పించడానికి ఈ బిల్లు మరిన్ని వెసులుబాట్లు  కల్పిస్తుంది.
“అక్కడి పరిస్తితులను అధ్యయనం చేసిన తరువాత నాకు అక్కడే వుండిపోయి వ్యవసాయం చేయాలనే తలంపు కలిగింది. నిజానికి మా పూర్వీకులు కూడా వ్యవసాయం చేసేవారు. కాకపోతే మన వ్యవసాయానికి, అక్కడి వ్యవసాయానికీ నడుమ వ్యత్యాసాలను గమనించిన తరువాత ఎంతో నిర్వేదం కలిగింది. మన దేశం ప్రాధమికంగా వ్యవసాయిక దేశం. దేశ ప్రణాళికలు రూపొందించేవారు మాత్రం పదేపదే వ్యవసాయానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి నొక్కి చెబుతుంటారు కాని  ఆచరణలో మాత్రం అది కనబడదు.              
 “రెండు దేశాల్లో వ్యవసాయం తీరుతెన్నులను చూసిన తరువాత నాకు మరో మారు మన రైతులు ఎంతగా దోపిడీకి గురవుతున్నారో అన్న సంగతి బోధపడింది. మన దగ్గర ప్రతి రాజకీయ నాయకుడు తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకుంటూ వుంటారు కాని సేద్యపు రంగం పట్ల వారికి  ఏపాటి శ్రద్ధ వుందన్నది అందరికీ తెలిసిన విషయమే.  
“వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అనే సంస్థ వుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగం అభివృద్ధికి దోహద పడ్డ శాస్త్రవేత్తలను గుర్తించి వారికి  పురస్కారాలు ప్రకటిస్తుంది. ఈ సంస్థ ఇచ్చే బహుమతిని వ్యవసాయంలో నోబుల్ పురస్కారంతో సమానంగా పరిగణిస్తారు. ఈ బహుమతికి ఎంపికయిన శాస్త్రవేత్తను  రెండులక్షల యాభయ్ వేల డాలర్ల నగదు బహుమతితో సత్కరిస్తారు. వీసా లేకుండా ఏ దేశానికయినా వెళ్ళగలిగే  దౌత్య హోదా కల్పిస్తారు.
“ఈ సంస్థ బృందంలో ఒకడిగా వున్న నేను అయోవా  వెళ్లాను. మరో విషయం తెలుసా? ఈ బహుమతి గెలుచుకున్న ఒక శాస్త్రవేత్త హైదరాబాదులోనే వున్నారు. ఆయన పేరు డాక్టర్ మొదడుగు విజయ్ గుప్తా. చేపల పెంపకంలో విప్లవాత్మక మెళకువలు ప్రవేశపెట్టి బంగ్లాదేశ్, థాయ్ లాండ్ దేశాల జీడీపీని అమాంతం పెంచేసిన ఘనత ఆయనకు వుంది. బేగంపేటలో వుండే ఈ శాస్త్రవేత్త గురించి చాలామందికి తెలియదు. మనదేశానికే చెందిన డాక్టర్ ఎం ఎస్ స్వామినాధన్, డాక్టర్ కురియన్ లకు కూడా ఈ పురస్కారం లభించింది. వీళ్ళందరినీ నేను ప్రతియేటా డె మొయిన్ లో కలుస్తుండేవాడిని.  డాక్టర్ కురియన్ ఇప్పుడు లేరు.
“ఈ ఏడాది యువ వ్యవసాయ శాస్త్రవేత్త కోసం మరో కొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో పనిచేస్తున్న డాక్టర్ (శ్రీమతి) ముఖర్జీకి ఇది  లభించింది. వర్షాల మీద ఆధార పడకుండా భూగర్భ జలాలను సమర్ధవంతంగా ఉపయోగించుకునే నూతన విధానాలను ముఖర్జీ ఆవిష్కరించారు. ఈ యువ మహిళా శాస్త్రవేత్త రూపొందించిన ఈ విధానాలను ఒక్క భారత దేశంలో మినహా ప్రపంచంలో అనేకచోట్ల విరివిగా ఉపయోగిస్తున్నారు.        
“మన దేశంలో ఇలాటి అద్భుత మేధస్సులకు కొదవ లేదు. అయినా వారి సేవలను సరిగా ఉపయోగించుకోలేకపోవడమే మన దురదృష్టం. గిట్టుబాటు ధరలు దొరక్క  రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు దొరక్క మధ్య, దిగువ తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదే కాబోలు.
“అందుకే నాకు  అనిపిస్తోంది, ఇక్కడే (అయోవా) వుండిపోయి వ్యవసాయం చేయాలని.
(రచయిత కొప్పరపు ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు – ఆయన ఇంగ్లీష్ లో రాసిన వ్యాసానికి ఇది స్వేచ్చానువాదం)    

(15-06-2013)

1 కామెంట్‌:

  1. Namaskamandi,

    Nenu vinodini. Naku kuda IOWA ante chala istamu,Naa alochana kooda ade.
    Kopparapu Prakash gari contact information evvagalara?

    Naa mail-id:
    vinodini24@gmail.com.

    Dhanyavalu,
    Vinodini

    రిప్లయితొలగించండి