చక్కటి హాస్యం
ఉద్రిక్తతలను తగ్గిసుంది. వాతావరణాన్ని తేలికచేస్తుంది. అహంకారాన్ని
తగ్గించుకోవడానికి చక్కని మార్గం కూడా. మనమీద మనం జోకులు వేసుకుంటూ మనసు చల్లబరచుకుంటే
అహం ఉపశమిస్తుంది. హాస్యం, ఆధ్యాత్మికత ఒకదానికొకటి పొసగవని భావించే వారున్నారు
కాని ఈ అభిప్రాయం తప్పని చెప్పిన మహర్షులు, మహానుభావులు కూడా వున్నారు. చాలామంది మహనీయులు
తాము బోధించేది సామాన్య జనాలకు సులభంగా అర్ధం కావడానికి హాస్యం రంగరించి మరీ
చెప్పేవారు. కంచి పరమాచార్య, రమణ మహర్షి, స్వామి చిన్మయానంద, దయానంద సరస్వతి
మొదలయిన సద్గురువుల సంభాషణల్లో, అనుగ్రహభాషణల్లో హాస్యం చిప్పిల్లుతూ వుండేది.
ఓసారి చెన్నైలో గీతాజ్ఞాన యజ్ఞం నిర్వహించడానికి
సరయిన ప్రదేశాన్ని ఎంపికచేసే ప్రయత్నంలో వున్నారు స్వామి చిన్మయానంద. ఆ నగరంలో అనేక దేవాలయాలు వున్నా, ఎక్కడా కూడా
గీతాజ్ఞానయజ్ఞం నిర్వహణకు వీలుపడలేదు. ఆ సమయంలో ఈ యజ్ఞం నిర్వహణకోసం ఖాళీగా పడివున్న తన బంగళాను ఇవ్వడానికి ఒకరు సిద్ధపడ్డారు.
కాకపొతే అతడు మహమ్మదీయుడు. ఆ బంగళాను చాలాకాలం ఖాళీగా వుంచడానికి కారణాన్ని కూడా అతడు ముందే చెప్పేసాడు. ‘దెయ్యాలు కాపురం వుండడం
వల్లె దాన్ని పాడుపెట్టడం జరిగింద’న్నాడు. దానికి స్వామి ఇలా అన్నారు. “అలాగా!
నేను ఇన్నాళ్లబట్టి దెయ్యాలను గురించి వినడమే కాని ఎన్నడూ చూడలేదు. ఇన్నాల్టికి
వాటిని చూసే అవకాశం లభించింది. పదండి పోదాం”
రమణ మహర్షి ప్రతిరోజూ ఉదయం వేళల్లో అరుణాచలం
కొండవరకు నడిచివెళ్ళేవారు. ఒకరోజు అలా వొంటరిగా నడిచివెడుతున్న మహర్షిని
దారినవెడుతున్న ఒక వ్యక్తి గమనించాడు. అతడు ఎన్నాళ్ళనుంచో మహర్షి దర్శనం కోసం
తహతహలాడిపోతున్నాడు. అందుకని వేగంగా నడిచి మహర్షిని దాటుకుని వెళ్ళి ఆయన
మార్గానికి అడ్డంగా నిలబడి “ ఈరోజు యెంత పుణ్యం చేసుకున్నానో నాకు మీరు దర్శనం
అనుగ్రహించారు. జన్మ ధన్యం అయింది స్వామీ” అని ఏదేదో చెబుతుండగా రమణ మహర్షి అతడ్ని వారించి ఇలా అన్నారుట, “ నేను నీకు
దర్శనం ఇవ్వడం ఏమిటి? నువ్వే నా ఎదుట నిలబడి నాకు నీ దర్శనం అనుగ్రహించావు”
స్వామి దయానంద సరస్వతి మాటల్లో కూడా చక్కని
హాస్యం ఉట్టిపడుతుండేది. ఆయన ఒకరోజు తన శిష్యులకు ఓ కధ చెప్పారు. “ ఓ డాక్టరు గారు
తన పేషెంట్లలో ముగ్గురి పరిస్తితి
బాగాలేదని, వారికి రోజులు దగ్గర పడ్డాయని గ్రహించి వారితో వున్న విషయం చెప్పి ఆఖరి
కోరికలు ఏమన్నా వుంటే చెప్పమని అడిగాడు. మొదటివాడు చనిపోయేలోగా దైవ దర్శనం
చేసుకోవాలని కోరాడు. రెండో వాడు తన కుటుంబ సభ్యులను చూడాలనివుందన్నాడు. వారికి సరే
అని చెప్పి డాక్టర్ మూడో అతడ్ని వాకబు చేసాడు.
“వేరే డాక్టర్ కి నన్ను చూపించండి” అన్నది అతగాడి సమాధానం.
కంచి పరమాచార్య వద్దకు ఒక పండితుడు వచ్చి తనను
తాను పరిచయం చేసుకున్నాడు. భగవద్గీత ప్రవచనంలో తనకు అద్భుతమైన అనుభవం వుందనీ, పది రోజులపాటు గీతను బోధించడానికి ఏదైనా స్థానిక
దేవాలయంలో వసతి కలిపిస్తే తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తానని చెప్పాడు. స్వామి అలాగే అన్నారు. మొదటి రోజు సుమారు యాభై
మంది దాకా ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చారు.
మరునాడు సగం తగ్గిపోయారు. మూడో నాడు వచ్చిన జనం వేళ్ళమీద లెక్కబెట్టే
విధంగా అతితక్కువగా వున్నారు. ఆ పండితుడు
పరమాచార్యను కలిసి చెప్పాడు. “ఏమి కాంచీపురం అండీ ఇది. ఇంతకష్టపడి భగవద్గీతను
చెబుదామని వస్తే మొదటి రోజు పట్టుమని యాభై
మంది కూడా రాలేదు. మర్నాడు ఇంకా పలచపడ్డారు. వరస చూస్తుంటే రేపు ముగ్గురు కూడా వచ్చేట్టు లేరు.”
స్వామి
మందహాసం చేసి ఇలా అన్నారు. “నువ్వు అదృష్టవంతుడవే! కృష్ణ పరమాత్మ భగవద్గీత
బోధించినప్పుడు వినడానికి వున్నది వొకే వొక్కడు. అందుకు సంతోషించు” (07-06-2013)
Very interesting posts. చాలా తెలియని విషయాలను మీ బ్లాగు ద్వారా తెలుసుకున్నాను.
రిప్లయితొలగించండి