తెలుగు సాహిత్యంలో నాకు నచ్చిన ప్రక్రియల్లో ఆత్మకధలు లేదా జీవితచరిత్రలు ప్రధానమయినవి. వీటిని చదువుతుంటే మనకు చెందని కాలానికి చెందిన అనేక విషయాలను అవగాహన చేసుకోగలుగుతాము. మనం ఈనాడు చూస్తున్న ప్రదేశాలు, ఆచారవ్యవహారాలు వాటికి పూర్వ రూపం ఎలావుండేదో తెలుసుకోవడానికి వీటిని చదవడం ఒక్కటే సరయిన మార్గం. ఏనుగుల వీరాస్వామి గారు రాసిన ‘నా కాశీ యాత్ర’ పుస్తకం చదువుతుంటే ఆనాటి హైదరాబాదు నగరం ఎలావుండేదన్నది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అప్పటి ధరవరలు, వేషధారణలు, ఆహారవ్యవహారాలు అర్ధం చేసుకోవడానికి ఈరకమయిన పుస్తకపఠనం ఉపయోగపడుతుంది. అయితే ఇవి రాసిన వారు యెంత ఘటనాఘటన సమర్దులయినా కించిత్తు స్వోత్కర్ష దొర్లడం కద్దు. కొన్నింట ఏకంగా ‘పర దూషణ’ ఏరులై పారుతుంది. ఇక ఆ పెద్దమనిషి యెంతటి మేఘనగధీరుడయినా ఆ రచనని ఆస్వాదించడం పంటికింద రాయి చందమే. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు రాసిన తమ జీవిత చరిత్రల్లో ఈ రకమయిన ‘ఆత్మ స్తుతి-పరనింద’ తొణికిసలాడుతుంటాయి. వీటివల్ల అసలు వాస్తవాలు మరుగున పడిపోతుంటాయి. గాంధీ గారు రాసుకున్న ‘మై ఎక్స్ పెరిమెంట్ విత్ ట్రూత్’ అనేది దీనికి పూర్తి మినహాయింపు. తనలోని బలహీనతలను ఒప్పుకోవడానికి ఆయన ఎంతమాత్రం సంశయించకపోవడం ఆ పుస్తకంలోని గొప్పతనం. అలాగే సందర్భాన్నిబట్టి, లేదా వాస్తవాలనుబట్టి తనలోని గొప్పతనాన్ని కానీ, ఇతరులలో తనకు నచ్చని విషయాలను కానీ చెప్పాల్సివచ్చినప్పుడు ఆ విషయాలను సుతిమెత్తగా చెప్పడం మళ్ళీ ముళ్లపూడి వెంకటరమణ గారికే సాధ్యమయింది.
నాందీప్రస్తావన ఇంత విస్తారం కావడానికి నన్ను ప్రేరేపించిన అంశం ఒకటుంది. దామోదర ప్రసాద్ పటకమూరు / బొద్దులూరి శ్రీనివాసరావు అనే వారి నుంచి నాకు ఈ మధ్య ఒక ఈ మెయిల్ అందింది. అది వారిద్వారా వచ్చిందో, లేక ఎవరయినా పంపితే దాన్ని నాకు పంపారో తెలియదు. ఏమయినా వారికి కృతజ్ఞుడిని. మూడు తరాలకు చెందిన ఒక పేద దళిత కుటుంబం సాగించిన జీవన యానంలోని ఒడిదుడుకులను, కష్ట నష్టాలను తేటతెల్లం చేస్తూ డాక్టర్ వై.వి.సత్యనారాయణ రాసిన ‘మై ఫాదర్ బాలయ్య’ అనే జీవిత చరిత్రను ‘హార్పర్ కాలిన్స్ ఇండియా’ వారు ప్రచురించారు. తెలంగాణా ప్రాంతంలో తండ్రిని బాబు అని పిలుస్తారు కాబట్టి దాన్ని తెలుగులోకి అనువదించేటప్పుడు బాలయ్య బాబు అని పేరు పెట్టాను. ప్రముఖ పత్రికా రచయిత మల్లేపల్లి లక్ష్మయ్య, హెచ్.ఎం.టీ.వీ. కి చెందిన ఆంగ్ల దినపత్రిక ‘హాన్స్ ఇండియా’ లో ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు.
డాక్టర్ సత్యనారాయణ ఈ పుస్తకం రాయడంలో ఎలాటి భేషజాలకు లోనుకాలేదన్న వాస్తవం మనకు ఇట్టే బోధపడుతుంది. తాను, తన కుటుంబం సాంఘికంగా, ఆర్ధికంగా అనుభవించిన మానసిక క్లేశాలను ఆయన చాలా చక్కగా మనసుకు హత్తుకునేలా అక్షరబద్ధం చేసారని మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. తన కుటుంబం అనుభవించిన కడగండ్లను కళ్ళకు కట్టినట్టు చూపడంలో ఆయన ఎంతమాత్రం పర నిందా సూత్రాన్ని ఉపయోగించుకోలేదు.
రెండు శతాబ్దాలకు విస్తరించిన ఈ మూడు తరాల కధ కరీంనగర్ జిల్లా వంగపల్లి గ్రామం నుంచి డాక్టర్ సత్యనారాయణ ముత్తాత నరసయ్యతో మొదలవుతుంది. ఈనాటికీ అవశేషాలు మిగిలిన దళితుల తాడన పీడనలు, అవమానాలు, ఆక్రోశాలు చదువుతుంటే మనిషి జీవితం ఇంత పర పీడనమా అన్న ఆలోచన కలుగుతుంది. దీనిలో సానుకూల అంశం ఏమిటంటే మనిషి తలచుకుంటే ఈ కష్టాలొక లెక్కకాదన్న వాస్తవం. దేన్నీ లెక్కపెట్టని గుండె ధైర్యం, పైకి రావాలనే చెక్కుచెదరని తపన వుండాలే కాని మనిషి సాధించలేనిది ఏమీ లేదన్న నిజం డాక్టర్ సత్యనారాయణ రాసిన ఈ పుస్తకం చదివినవారికి బోధపడడం తధ్యం.
ఈ మధ్య విడుదలయిన ఒక తెలుగు సినిమాలో అలనాటి తెలంగాణలో బీదాబిక్కీ ఎదుర్కున్న అవమానాలను చూసిన ఈ నాటి తరం పిల్లలు – మనుషులు సాటి మనుషులపట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అన్న సంశయాన్ని వెలిబుచ్చడం నాకు తెలుసు. అవన్నీ నిజంగా నిజం అని తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.
మనసుల్ని కదిలించే ఓ సంఘటనను డాక్టర్ సత్యనారాయణ ఉదహరించారు.
మాదిగ కుటుంబంలో జన్మించిన నరసయ్య ఓ లేగదూడ చర్మంతో చెప్పుల జతను తయారు చేసి నిజాం నవాబుకు బహుకరిస్తాడు. ఆ కాలిజోళ్ల పనితనం గమనించి ముగ్ధుడైన నిజాం నవాబు అతడికి యాభై ఎకరాలు దానంగా ఇస్తాడు. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా వూళ్ళోని దొర, నరసయ్యకు నవాబు ఇచ్చిన యాభయ్ ఎకరాల్లో నలభై ఎనిమిది ఎకరాలను బలవంతంగా స్వాధీనం చేసుకుంటాడు.
ఆ నరసయ్యకు ఒక కొడుకు. అతడి పేరూ నరసయ్యే. ఆ జూనియర్ నరసయ్యకు పదునాలుగో ఏట అబ్బమ్మ అనే యువతితో పెళ్లి చేస్తారు. అస్పృశ్యులయిన వాళ్ళిళ్లలొ జరిగే శుభకార్యాల్లో ప్రతి చిన్న విషయాన్ని రచయిత తనదయిన శైలిలో హృద్యంగా వర్ణించారు. వారికి పుట్టిన బిడ్డే రామసామి అలియాస్ బాలయ్య.
కలరా వ్యాధి సోకి భార్య మరణించిన తరువాత ఆమె శవాన్ని భుజానికి ఎత్తుకుని జూనియర్ నరసయ్య, కొడుకు బాలయ్యను వెంట తీసుకుని, వూరుబయట ఓ వాగు చెంత గొయ్యి తవ్వి భార్య శవాన్ని పూడ్చిపెట్టి, వున్న వూరు విడిచిపెట్టి బాలయ్య మేనమామల పంచన చేరతాడు. వారి సాయంతో నిజాం రైల్వేలో చిన్న కొలువు సంపాదిస్తాడు. బంధువుల బలవంతం మీద మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అయినా తల్లి లేని రామసామి అలియాస్ బాలయ్యను ప్రాణప్రదంగా చూసుకుంటాడు. అలా పెరిగిన బాలయ్యకు ధ్యేయం ఒక్కటే. చదువు. అది తనకు ఎలాగో అబ్బలేదు. తనకు దక్కని చదువు తన సంతానానికయినా దక్కేలా చేయాలి. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురయినా అతడా లక్ష్యానికి దూరం జరగలేదు. పిల్లలు కూడా అతడి కలను నిజం చేస్తూ పెద్దవారవుతారు. స్కూళ్ళు, కాలేజీలు దాటి విశ్వవిద్యాలయాలలో చేరి ప్రొఫెసర్ల స్తాయికి చేరుకుంటారు. వారిలో ఒకడే ఈ గ్రంధకర్త డాక్టర్ సత్యనారాయణ. ‘కృషి వుంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు’ అన్న కవి వాక్యం నిజం చేసిన ‘మట్టిలో మాణిక్యం’.
అవకాశాలు వుండాలే కాని మనిషి పెరుగుదలకు ఆకాశమే హద్దు అని నిరూపించిన సత్యనారాయణ గారికి, ఆయన తండ్రి ‘బాలయ్య బాబు’కు నమోవాకాలు. (28-01-2012)
ఇంకా నేను ఈ పుస్తకం చదవలేదు కానీ, చాలా మంది మిత్రులు బాగుందని చెప్పారు..సత్యనారాయణ,జీ టీవీ
రిప్లయితొలగించండిఇంకా నేను ఈ పుస్తకం చదవలేదు కానీ, చాలా మంది మిత్రులు బాగుందని చెప్పారు..సత్యనారాయణ,జీ టీవీ
రిప్లయితొలగించండిఇంకా నేను ఈ పుస్తకం చదవలేదు కానీ, చాలా మంది మిత్రులు బాగుందని చెప్పారు..సత్యనారాయణ,జీ టీవీ
రిప్లయితొలగించండి