13, జూన్ 2013, గురువారం

అసెంబ్లీ అప్పుడు – ఇప్పుడు
1976
ఉదయం ఎనిమిదిన్నర.
‘ఆనరబుల్ స్పీకర్’ అనే ప్రకటనతో పాటు స్పీకర్ ఆసనం వెనుక తలుపు తెరుచుకునేది. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడితో సహా నిండు సభలో వున్నవారందరూ గౌరవపురస్సరంగా లేచి నిలబడి అభివాదం చేస్తుండగా, స్పీకర్ ప్రవేశించి సభకు నమస్కారం చేసి  తన స్థానంలో ఆసీనులయ్యేవారు.


అసెంబ్లీ పాత సభామందిరం 

వెనువెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలయ్యేది. సుమారు గంట సేపు సాగాల్సిన ఈ కార్యక్రమం కొండొకచో కాస్త ఆలశ్యం అయ్యేది. ఆ మాత్రానికే స్పీకర్ అసహనం తెలియచేస్తూ నిర్దేశిత ఎజెండా ప్రకారం కార్యక్రమం జరిగేలా చూడడానికి తాపత్రయపడేవారు. ఆ తరువాత జీరో అవర్. ఈ సమయంలో సభ్యులు ఎవరయినా సరే,  ముందుగా సభాపతికి తెలియచేయకుండానే తాము అత్యవసరం అనుకున్న  అంశాలను సభ దృష్టికి తేవడానికి అవకాశం వుంటుంది. సంబంధిత మంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం వుండదు. అయినా కాని, కొందరు మంత్రులు అప్పటికప్పుడే జవాబులు చెప్పే ప్రయత్నం చేస్తుండేవారు. ఆ తరువాత కొన్ని నిబంధలకింద సభ్యులు ఇచ్చిన నోటీసులపై చర్చ, వాటికి సంబంధిత మంత్రుల సమాధానాలు, అప్పుడప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మంత్రులకు మద్దతుగా ఇచ్చే మరికొన్ని వివరణలు – ఇలా సాగిపోయేది. మధ్యలో టీ విరామసమయం. మళ్ళీ సభ సమావేశమై ఎజెండాలోని ఇతర కార్యక్రమాలను చేపట్టడం, మధ్యాహ్నం ఒకటిన్నర కాగానే సభను మరునాటికి వాయిదా వేయడం అంతా నియమానుసారంగా జరిగిపోయేది. సభాకార్యక్రమాలను కవర్ చేయడానికి ఆయా పత్రికల వాళ్లు తమ విలేఖరులకు తగిన సమయాలను కేటాయించడానికి కూడా వీలుండేది. అంటే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ఒకరికి, మిగిలిన కార్యక్రమాలు వేరే విలేఖరులకు అప్పగించేవారు. వీరుకాకుండా లాబీల్లో జరిగే వ్యవహారాలను ఓ కంట గమనించడానికి విడిగా బ్యూరో చీఫ్ లు వచ్చేవాళ్ళు. అప్పట్లో టీవీ ఛానళ్ళు లేకపోవడం వల్ల మీడియా పాయింటు అంటూ వుండేది కాదు. పత్రికలకు అన్ని అంశాలు వివరంగా ఇవ్వాల్సిన అవసరం వుండడం వల్ల ఇద్దరు ముగ్గురు ఒక్కో పత్రిక నుంచి వచ్చేవాళ్ళు. రేడియోకి అంత సమాచారం అవసరం లేదు కాని ఇచ్చిన సమాచారంలో ఏమాత్రం తభావతు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఎక్కువ. ఏమాత్రం తేడా పాళా వచ్చినా పరిణామాలు చాలా తీవ్రంగా వుండేవి.
ఇక ఇప్పుడో – అంతా ఇళ్ళల్లో కూర్చుని చూస్తూనే వున్నారు.


అసెంబ్లీ నూతన సభామందిరం 

స్పీకర్ గంట  కొట్టినట్టు సమయానికి సభలో ప్రవేశిస్తారు. ముందు వాక్యంలో రాసినట్టే అంతా యధావిధిగా జరుగుతుంది, ఒక్క సభలో హాజరు మినహా. తరువాత స్పీకర్ వివిధ పార్టీల వాళ్లు ఇచ్చిన వాయిదా తీర్మానాలను వరసపెట్టి చదువుతారు. ఒక్కో పార్టీ ఒక్కో అంశంపై తీర్మానం నోటీసు ఇస్తుంది. అవన్నీ చదివి, వాటిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటిస్తారు. అంతే!  అన్ని పార్టీల వాళ్లు ఈ ఒక్క విషయంలో ఏకమవుతారు. పోడియం చుట్టుముట్టి నినాదాలు మొదలు పెడతారు. సభలో అంతంత మాత్రంగా వున్న మంత్రులు, ఇతర సభ్యులు చోద్యం చూస్తుంటారు. సభ్యులను తమ స్థానాలకు వెళ్ళాల్సిందని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేస్తారు. ఎవ్వరూ పట్టించుకున్న దాఖలా కనబడదు. దాంతో స్పీకర్ విధి లేక ఓ పదినిమిషాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి తన చాంబర్ కు వెళ్ళిపోతారు. పేరుకు పదినిమిషాలే అయినా, ఓ గంటకో, మరో గంటకో సభ మళ్ళీ సమావేశం అవుతుంది. సీన్ రిపీట్.
ఈ లోగా సభ వెలుపల వున్న మీడియా పాయింటు వద్ద వివిధ పార్టీల నాయకులు వరసలు కట్టి వరస వెంబడి తమ వాదనలు వినిపిస్తారు. అన్ని చానళ్ళు తమ వీలునుబట్టి వాటిని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటాయి.
ఇదే  వరస, ఇదే కధ మరునాడు, ఆ మర్నాడు.
అడిగేవాడు లేకపోవడం అంటే ఇదేనేమో!


మహాత్మా గాంధి సాక్షిగా అసెంబ్లీ 

(13-06-2013)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి