20, ఫిబ్రవరి 2013, బుధవారం

డబ్బును లెక్కచేయని డబ్బున్న మనిషి




లక్షా యాభయ్ వేల కోట్ల డాలర్లు. ఈ మొత్తాన్ని రూపాయల్లోకి మార్చి చెప్పాలంటే  పదిహేను పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో.


భార్యతో కలసి ఇంగ్వార్ కంప్రాడ్


అదొక సమావేశ మందిరం.
ప్రపంచంలో అత్యుత్తమ వ్యాపార ప్రముఖుడికి ఇచ్చే అవార్డ్ ప్రదానో త్సవం అక్కడ జరగబోతోంది. అంతా అతడి రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో అక్కడ ఓ సిటీ బస్సు ఆగింది. అందులోనుంచి దళసరి కళ్ళద్దాలు, ముతక కోటు, మోటు బూట్లు ధరించిన ఓ వ్యక్తి కిందికి దిగి లోపలకు రాబోయాడు. అతడి వాలకం చూసి అక్కడి సెక్యూరిటీ గార్డులు ఆపే ప్రయత్నం చేశారు. వారికి తెలియదు, ఆ సాయంత్రం ఆ సభాభవనంలో జరిగే కార్యక్రమంలో అవార్డును స్వీకరించే ముఖ్య అతిధి అతడేనని.
ఇంగ్వార్ కంప్రాడ్ అతి సాధారణంగా కానవచ్చే అసాధారణ వ్యక్తి. కొన్ని వేల మిలియన్ల డాలర్లు విలువచేసే ‘ఐకియా’ సంస్థ సంస్థాపకుడు. ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల జాబితాలో ఏడో స్థానంలో వున్న వ్యక్తి. అయినా పైకి చూడడానికి డబ్బు ఇబ్బందుల్లో వున్న పింఛనుదారు మాదిరిగా కానవస్తాడు. అతడి మనస్తత్వాన్ని తెలిపే ఉదంతం ఒకటి ప్రచారంలో వుంది. అనేక  సంవత్సరాలుగా అలవాటయిన  క్షురకుడిని ఈ మధ్య మార్చారట. ఎందుకంటే అతడికంటే తక్కువ డబ్బులకు  క్షౌరం చేసే మరో క్షురకుడు దొరికాడట.
స్వీడిష్ జాతీయుడయిన కంప్రాడ్, ‘ఐకియా’ అనే పేరుతొ  గృహనిర్మాణ సామాగ్రి సంస్థను స్థాపించి, అనతికాలంలోనే  అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు, కోట్లల్లో డబ్బూ పోగేసుకున్నాడు. అంత కీర్తి గడించిన కంప్రాడ్ కాంస్య విగ్రహాన్ని అతడి సొంత పట్టణంలో  ఏర్పాటు చేసి కంప్రాడ్ ని ఆ కార్యక్రమానికి ఆహ్వానించారుట. ఆవిష్కరణ సూచకంగా రిబ్బన్ కత్తిరించడానికి బదులు కంప్రాడ్ ఆ రిబ్బన్ ను మడిచి నిర్వాహకుల  చేతిలో పెట్టి, బంగారంలాటి రిబ్బన్ ముక్కను ముక్కలుగా  కత్తిరించి వృధా చేయవద్దని ఓ ఉచిత సలహా ఇచ్చాడట.
భార్యతో కలసి లోకల్ రైళ్ళలో ప్రయాణిస్తూ, చిన్న చిన్న రెస్టారెంట్లలో భోజనం చేస్తుండడం ఆయనకు  అలవాటు. ‘ఎందుకిలా?’ అనే ప్రశ్నకు ఆయన వద్ద రెడీమేడ్ సమాధానం సిద్ధంగా వుంటుంది.
‘నేను పుటకతో సంపన్నుడిని కాను. నా పదిహేడో ఏట ఈ కంపెనీ స్థాపించినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. అయినా కష్టపడడంలో వున్న సుఖం ఏమిటో కష్టపడేవాడికే తెలుస్తుంది. డబ్బు ఖర్చు పెట్టడం, ఆడంబరంగా జీవించడం నాకు చేతకాకకాదు. నన్ను చూసి మరొకరు అనుకరించి కష్టాల పాలు కాకూడదనే నేనిలా చేస్తున్నాను. ఆదర్శాలు చెప్పడం కాదు ఆచరించడం అవసరం.’
అంటారాయన.
ఇక ఏమంటాం! 
NOTE: Courtesy image owner (20-02-2013)         
            

1 కామెంట్‌: