3, అక్టోబర్ 2012, బుధవారం

ఆంధ్ర ప్రదేశ్ జాగీర్దారు కధ



ఆంధ్ర ప్రదేశ్ జాగీర్దారు కధ
(తెలుగునాట హ్యూమరసానికి కొదవలేదని నిరూపిస్తూ  నెట్లో సంచారం చేస్తున్న రచన)


“ముందుగా దేవుడికి నమస్కారం చేసుకోండి.  అయ్యా! ఆ పూలు మీ ఆవిడ నెత్తిన చల్లండి. అమ్మా! ఆ కొబ్బరి కాయ కొట్టండి ......... అయ్యో అయ్యో మీ ఆయన నెత్తిన కాదమ్మా, ఈ రాయి మీద..........
.
.
.
.
.

....
ఆ. అలా ...  కొబ్బరి కాయ కొట్టి మరోమారు  దండం పెట్టుకుని ఈ కధ భక్తి శ్రద్ధలతో విని తరించండి.

“ఒక రోజు ఆంధ్ర ప్రదేశ్ లో తీసేసిన తాసిల్దారుకి , పాత తాసిల్దారు కొడుకుకి ఆంధ్ర ప్రదేశ్ జాగీర్దారు పదవి కోసం పోటీ జరిగింది. ఎలెక్షన్ కమిషనరు ఇద్దరికీ ఓ షరతు  పెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న గ్రామాలన్నీ  ఎవరు ముందు కాలినడకన  తిరిగి వస్తే వాళ్ళకే జాగీర్దారు పదవి అని.

“వెంటనే తీసేసిన తాసిల్దారు (తీ. తా) సఫారి కారు ఎక్కి " వస్తున్నా.........మీ కోసం" అని హిందూపురం వెళ్లి పోతాడు. అక్కడి నుంచి జనాలకు వొంగి వొంగి  నమస్కారాలు చేస్తూ,  పాదయాత్ర కొనసాగిస్తూ  'అలా ముందుకు' పోతుంటాడు.

“పాత తాసిల్దారు కొడుకు ( పా. తా.కొ.) ఎలెక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్లి, 'అయ్యా నేను జైలులో ఉన్నాను. మరి పాద యాత్ర ఎలా చెయ్యగలను? ఇది తెలిసి కూడా ఇలా ఆనతీయతగునా!   ఇది అన్యాయం కదా.  నన్ను కూడా వదిలి పెట్టండి , నేను కూడా పాదయాత్ర తో పాటు, అంతకు ముందు ఆపిన  ఓదార్పు యాత్రను కూడా  జనాల బుగ్గలు పిసుకుతూ పూర్తిచేసుకువస్తాను’ అని వేడుకున్నాడు.

“అప్పుడు ఎలెక్షన్ కమిషనరు  పాత సినిమాలో గుమ్మడిలా తల పంకించి, కాసేపు  అలోచించి, 'తండ్రి చుట్టూ తిరిగితే అన్ని గ్రామాలు తిరిగినట్టే' అనే తరుణోపాయం సూచిస్తాడు.  దరిమిలా,  పాత తాసిల్దారు కొడుకు ( పా. తా.కొ.) తండ్రి ఫోటో పెట్టుకుని దాని చుట్టూ  తిరుగుతాడు.

“పాదయాత్ర చేసుకుంటూ వెళుతున్న తీసేసిన తాసిల్దారు (తీ. తా) కి , యే వూరు వెళ్ళినా, పాత తాసిల్దారు కొడుకు  (పా.తా.కొ.) అంతకు ముందే వచ్చి వెళ్లాడు అని చెబుతూ ఉంటారు.

“అలా వూర్లు, టూర్లు  అన్ని ముగించుకుని తీసేసిన తాసిల్దారు (తీ. తా) వచ్చేసరికి, పాత తాసిల్దారు కొడుకు ( పా. తా.కొ.) జాగీర్దారు అయి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తుంటాడు.

“ఇంతే సంగతులు చిత్తగించవలెను............అక్షింతలు తలమీద వేసుకుని నమస్కారము చేసుకోవలెను. 
(03-10-2012)

4 కామెంట్‌లు: