28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

తిలాపాపం తలా పిడికెడు – భండారు శ్రీనివాసరావు



తిలాపాపం తలా పిడికెడు

(29-09-2012 తేదీ 'సూర్య' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

అన్ని పార్టీలనూ ప్రభావితం చేసిన తెలంగాణ
నిట్టనిలువుగా చీలిన రాజకీయ పార్టీలు 
ఆచి తూచి రాసినప్పటికీ,  
కొత్త ఇక్కట్లు తెచ్చిన చంద్రబాబు  లేఖ
భవిష్యత్తుపై  భరోసా లేని కాంగ్రెస్‌
ఆట ముగించడం తెలియని టీఆర్‌ఎస్‌



సూర్యుని కాంతి చంద్రుడిపై పడి ప్రతిఫలించినట్టు ఈనాడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఎంతో కొంత తెలంగాణా అంశంతో ప్రభావితమవుతున్నాయి. పుష్కర కాలం పైచిలుకు  ప్రత్యేక రాష్ట్రం పేరుతొ మడమ తిప్పని పోరాటం చేస్తున్న తెలంగాణా రాష్ట్ర సమితి, టీ.ఆర్.ఎస్.,  తన ప్రధాన లక్ష్య సాధనలో కొంత వెనుకబడ్డప్పటికీ, రాష్ట్రంలోని అన్ని పార్టీల మెడలు వంచి తెలంగాణా పట్ల దృష్టి  సారించేలా చేయడంలో ఒక మేరకు విజయం సాధించిందనే చెప్పాలి. రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలన్న టీ.ఆర్.ఎస్. ధ్యేయం ఎప్పుడు నెరవేరుతుందో కాని, తెలంగాణాకు అనుకూలంగానో, ప్రతికూలంగానో - అన్ని రాజకీయ పార్టీలు నిట్టనిలువుగా చీలిపోవడానికి మాత్రం ఆ పార్టీ ఎత్తుగడలు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ‘తెలుగుదేశం’లో  తాజాగా మొదలయిన ‘ప్రాంతీయ కలకలం’ ఇందుకు ఉదాహరణ.
తనపై పడ్డ ‘రెండు కళ్ళ సిద్ధాంతం’ అపవాదును చెరిపేసుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నానా హైరానా పడాల్సివస్తోంది.. ఒకప్పుడు తెలంగాణా ప్రాంతంలో గట్టి క్యాడర్ పట్టున్న పార్టీగా పేరున్న టీడీపీ, జారిన కాలును  మళ్ళీ కూడగట్టుకోవడానికి ప్రారంభించిన ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు ప్రధాన మంత్రికి తాజాగా రాసిన లేఖ సానుకూల ఫలితాలు ఇస్తున్న  దాఖలా కానరావడం లేదు. నిజానికి చంద్రబాబు ఆ లేఖను ఎంతో జాగ్రత్తగా ఆలోచించి మరీ రాసినట్టు చదవగానే ఎవరికయినా బోధపడుతుంది.  తెలంగాణాను కోరుకునేవారు, వేర్పాటును వ్యతిరేకించేవారు ఎవరికివారు సంతృప్తి పడేలా ఆ లేఖలోని అంశాలను  ఆచితూచి కూర్చి పేర్చారు. అయినా కానీ, కొండ నాలుకకు మందేస్తే వున్న నాలుక వూడిందన్న చందంగా తెలంగాణాపై చంద్రబాబు లేఖ పార్టీకి కొత్త ఇక్కట్లను తెచ్చిపెట్టింది. తెలంగాణాపై తమ నాయకుడు త్వరలో  స్పష్టత ఇస్తారంటూ  కొద్దిరోజులుగా చెబుతూవచ్చిన ఆ ప్రాంతపు  టీడీపీ నాయకులకు,  చంద్రబాబు నాయుడు   ప్రధానమంత్రికి రాసిన లేఖలో కొత్తగా ఇచ్చిన ‘అస్పష్టతతో కూడిన స్పష్టత’ కొరుకుడు పడడం లేదు. పైగా, సీమాంధ్రకు చెందిన కొందరు టీడీపీ నాయకులకు ఆ లేఖలోని అంశాలు అసలు మింగుడు  పడడం లేదు. ‘వ్యక్తులకంటే పార్టీ  ముఖ్యం’ అని తరచూ నీతి వాక్యాలు వల్లె వేసేవారు   వున్నట్టుండి బాణీ మార్చి ‘పార్టీ కంటే  రాష్ట్ర ప్రయోజనాలు  ప్రధానం’ అంటూ రాత్రికి రాత్రే  సరికొత్త పల్లవి ఎత్తుకోవడం ఆ పార్టీలోని అగ్రనాయకులను నివ్వెరపరుస్తోంది.
 ‘వస్తున్నా, మీకోసం’ అంటూ గాంధీ  జయంతి నుంచి తెలుగుదేశం అధినేత మొదలుపెట్టే రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు తెలంగాణా ప్రాంతంలో అవాంతరాలు ఎదురుకాకుండా చూసే లక్ష్యంతో రాసిన లేఖ, మరోపక్క  సీమాంధ్ర పార్టీ నాయకులలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘రాష్ట్ర  విభజనకు టీడీపీ  అనుకూలం’ అని ఆ లేఖలో ఎక్కడా స్పష్టంగా పేర్కొనకపోయినా కొందరు సీమాంధ్ర పార్టీ  నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటే, దానికి కారణం వారి సొంత ప్రయోజనాలే అయి  వుండవచ్చని పార్టీలో కొందరు గుసగుసలాడుతున్నారు. ఏదో ఒక సాకు  చూపి పార్టీ నుంచి  బయటపడాలని చూసేవారు  ఈ లేఖను ఒక అవకాశంగా వాడుకోవడంలో వింతేమీ లేదన్నది వారి వాదన.
ఇంతాచేసి,   ఈ లేఖ వల్ల తెలంగాణాలో అన్నా కొంత పార్టీకి మేలు జరుగుతుందా అన్నది అనుమానమే. చంద్రబాబు లేఖ ఇస్తే తెలంగాణాకు వున్న ప్రధాన అడ్డంకి తొలగిపోగలదని ఇన్నాళ్లబట్టీ వాదిస్తూ వస్తున్న టీ.ఆర్. ఎస్.  కూడా ఈ లేఖను స్వాగతించలేదు. పైగా,   ‘టీడీపీ మొదలుపెట్టిన మరో నాటకం’ అంటూ ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు ఘాటుగా విమర్శించారు. దానికితోడు, రెంటికీ చెడ్డ రేవడి చందంగా ఈ తలనొప్పిని యెందుకు కోరి తెచ్చుకున్నట్టని పార్టీ వర్గాల్లో కొందరు ప్రశ్నిస్తున్నారు.      
నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో అత్యంత క్లిష్టమయిన పరిస్తితి ఎదుర్కుంటున్న పార్టీ ఏదయినా వుందంటే ముందు చెప్పుకోవాల్సింది టీడీపీ పేరే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా వుంటూ వరసగా మూడో పర్యాయం కూడా అధికారపీఠానికి దూరంగా వుండడం అన్నది ఆత్మహత్యాసదృశ్యం. అందువల్ల ఆ పార్టీ నాయకుడుగా, సారధిగా చంద్రబాబుకు వున్న వొత్తిళ్లు అనేకం. ఏంచేసయినా సరే రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో పార్టీ నావని విజయ తీరానికి చేర్చాల్సిన బాధ్యత ఆయన భుజస్కంధాలపై వుంది.  కాబట్టే ఆయన వరస  ‘డిక్లరేషన్ల’కు  తెర తీసారు. అరవై ఏళ్ళ వయస్సులో కష్టసాధ్యమయిన పాదయాత్రకు నడుంకట్టారు. తెలంగాణా విషయంలో స్పష్టతతోనో, అస్పష్టతతోనో – అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ  ప్రధానికి ఒక లేఖ రాశారు. ఇన్ని చేసినా ఇన్ని  తలనొప్పులేమిటన్నది ఆయన అభిమానుల బాధ. అందుకే అంటారు, కాలం కలసిరానప్పుడు తాడే పామై కరుస్తుందని.
పోతే, రాష్ట్రంలో అత్యంత క్లిష్టమయిన రాజకీయ  భవితవ్యాన్ని ఎదుర్కుంటున్న పార్టీల్లో కాంగ్రెస్  రెండో స్థానంలో వుంది. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో మరో రెండేళ్లు అధికారంలో వుంటామన్న  ధీమా తప్ప భవిష్యత్తు గురించిన భరోసా ఏమాత్రం లేని పార్టీగా అనేక సర్వేల్లో ఇప్పటికే వెల్లడయింది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ బలహీనతే ఈ పార్టీకి ప్రస్తుతం వున్న బలం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి పూర్తిగా అగమ్య గోచరం. ఎంతో అద్భుతం జరిగితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసాధ్యం అన్నది ఆ పార్టీ నాయకులే అంగీకరించే వాస్తవం. ఏదయినా అద్భుతం  జరిగినా మూడోమాటు ప్రజలు అధికారం కట్టబెట్టడం కల్ల అనే నిజం జీర్ణించుకున్నవాళ్లు కాబట్టి,  అధికారానికి కొన్నాళ్ళు దూరంగా వున్నా జాతీయ పార్టీగా తమ మనుగడకు ఎలాటి ధోకా వుండదన్న నమ్మకం వున్నవాళ్ళు కనుక కాంగ్రెస్ వారికి పార్టీ జయాపజయాలతో నిమిత్తం వుండదు. ‘వూహించనిదేదో జరిగి అధికారంలోకి వస్తే సంతోషం, రాకపోతే పోయేదేమీ లేదు పదవి తప్ప’ అనే సిద్ధాంతం వారిది. అందుకే, రాష్ట్ర ప్రజానీకం ఎదుర్కుంటున్న  సమస్యలని పేరబెట్టి, తెలంగాణా వంటి కీలక అంశాల  పరిష్కారాన్ని నానబెట్టి ప్రజలిచ్చిన అధికారంతో కాలక్షేపం చేస్తున్నారు.
ఇక టీ.ఆర్.ఎస్. విషయం తీసుకుంటే,  ఆట మొదలు పెట్టడం తప్ప  ముగించడం ఎలాగో తెలియని పరిస్తితి ఈ పార్టీది. తెలంగాణా పట్ల చులకన భావంతో ఒకప్పుడు మొరాయించిన పార్టీలను సైతం  ముగ్గులోకి లాగేలా వాటిపై  వొత్తిడి పెంచడం మినహా ఈ పార్టీ తన ప్రాధమిక లక్ష్యం దిశగా సాధించింది పూజ్యం. పైగా వేర్పాటువాదాన్ని బలంగా కోరుకునే వారినందరినీ ఒక్క తాటిపైకి  చేర్చడంలో పూర్తిగా విఫలం అయిందనే చెప్పాలి.
వై.ఎస్.ఆర్. పార్టీ కూడా తెలంగాణా విషయంలో ఒక స్పష్టమయిన వైఖరితో ముందుకు వచ్చిన దాఖలా లేదు. అందుకే, వై ఎస్ ఆర్ సంక్షేమ పధకాల స్పూర్తితో ముందుకు పోతున్నామని చెప్పుకునే ఈ పార్టీ, అ ప్రాతిపదికపై తెలంగాణలో కుదురుకునే ప్రయత్నాలు చేయడం లేదు. పరకాల ఎన్నిక తరువాత మరింత ఉత్సాహంతో సాగాల్సిన ఈ పార్టీ మందకొడిగా వ్యవహరిస్తోందనే చెప్పాలి. రెండు కళ్ళు అని పైకి చెప్పకపోయినా, ఒక ప్రాంతానికి, ఒక సామాజిక వర్గానికి ప్రధానంగా ప్రాతినిధ్యం వహిస్తున్నదన్న పేరు పడడం వల్ల తెలంగాణా పట్ల ఒక నిశ్చితమయిన వైఖరిని తొందరపడి  వెల్లడించాల్సిన అగత్యం  లేదన్నది ఆ పార్టీ అభిప్రాయంగా తోస్తోంది.
ఇక మిగిలిన పార్టీలన్నీ తెలంగాణాపై ఆటో ఇటో చెప్పగలిగినా వాటి  ప్రభావం శూన్యం.
అయితే, ఒక్కటి మాత్రం స్పష్టం.
తెలంగాణా పట్ల విస్పష్టమయిన  వైఖరి వెల్లడించడం వల్ల రానున్న సార్వత్రిక  ఎన్నికల్లో తమకు ఏమేరకు రాజకీయ లబ్ది చేకూరుతుంది అనే  లెక్కల విషయంలో ఆయా పార్టీలకు ఇంకా స్పష్టత రాకపోవడంవల్లనే ఆ పార్టీలకు తెలంగాణా అంశం  ఒక క్రీడామైదానంగా తయారవుతోంది. (28-09-2012)   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి