5, జులై 2012, గురువారం

నీళ్ళ యుద్ధాలు – ఫలించని జోస్యాలు – భండారు శ్రీనివాసరావు


నీళ్ళ యుద్ధాలు – ఫలించని జోస్యాలు – భండారు శ్రీనివాసరావు

“ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచంలో జరిగే యుద్ధాలు దేశాలను  ఆక్రమించుకోవడం కోసమో,ముడి చమురు  వనరులకోసమో జరగవు. ముందు ముందు దేశాల నడుమ జరగబోయే యుద్ధాలకన్నింటికీ  ఒకే ఒక కారణం ‘నీళ్ళు’.  నీటి కోసం జరిగే యుద్ధాలనే భవిష్యత్తులో జనం చూడబోతారు.”
దాదాపు పదిహేనేళ్ళ క్రితం ఇస్మాయిల్ సెరగెల్దిన్ అనే ఈజిప్టు దేశస్తుడు ఈ జోస్యం చెప్పారు. ఆయన వరల్డ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంటుగా వున్నప్పుడు భవిష్యత్తు గురించి చేసిన ఈ అంచనా అప్పట్లో ప్రపంచ రాజకీయ నాయకులను ఎంతగానో కలవర పరచింది. అదృష్టవశాత్తు ఇస్మాయిల్ గారి జోస్యం నిజమవలేదు కాని సాగు నీరు, తాగు నీరు అవసరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దృష్ట్యా తలెత్తుతూ వచ్చిన నీటి  తగాదాలు మాత్రం  అనేక దేశాల నడుమ ఉద్రిక్తతల పెరుగుదలకు దోహదం చేసిన మాట వాస్తవం.
ఆసియా ఖండంలో ఇరిగేషన్ డాముల కింద నీరు పంచుకునే విషయంలో బోలెడు,బొచ్చెడు  తగాదాలు. భారత దేశం పాకిస్తాన్ నడుమ జలవిద్యుచ్చక్తి పంపిణీ విషయంలో ముదిరి పాకాన పడుతున్న వివాదాలు, మరోపక్క  చైనా, నేపాల్, బంగ్లాదేశ్ ల నడుమ నదీ జలాల వివాదాలు. జీవ నదులన్నా ఎండిపోతాయేమో కాని ఈ తగాదాలకు మాత్రం ముగింపు  అంటూ వున్నట్టులేదు.
పోతే, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, కీర్గిజిస్తాన్ ల వ్యవహారం కూడా విభిన్నంగా లేదు. అము దారియా, సర్ దారియా నదులు, అలాగే నీటిమట్టం స్తాయి బాగా పడిపోతున్న అరల్ సీ విషయంలో ఈ దేశాల నడుమ సాగుతున్న నీటి పంచాయతీలు రోజు రోజుకూ ముదిరిపోతున్నాయి.
ఇక, అర్జెంటీనా, ఉరుగ్వేలు - ప్లేట్ నదీ జలాలను పంచుకునే విషయంలో తలెత్తిన వివాదాన్ని హేగ్ లోని అంతర్జాతీయ న్యాయ స్తానం వరకూ తీసుకువెళ్ళాయి. రియో గ్రాండే, కొలరాడో నదీ జలాలు గురించి అమెరికా, మెక్సికో లు జుట్లు పట్టుకుంటున్నాయి.           

తిగ్రిస్ నదిలో తన వాటా నీళ్ళను ఇక ముందు వాడుకోవడానికి వీల్లేదని ఇరాక్ సిరియాను డిమాండ్ చేసి ఎంతో కాలం కాలేదు. మధ్యప్రాత్యంలో పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాలు, ఇరాన్, ఇరాక్ దేశాలు టర్కీ డాం లనుంచి వచ్చే నీటి సరపరాల విషయంలో అవగాహన కుదరక తలలు పట్టుకుంటున్నాయి.
ఆఫ్రికాలో జమ్బెజీ నది ఉపనది అయిన చోబే నది, బోత్స్వానా, మొజాంబిక్ దేశాల నడుమ చిచ్చు రేపింది.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం వివిధ దేశాల నడుమ జలాల పంపిణీ జరిగే నదులు దాదాపు రెండు వందల యాభయ్ కి పైగా వున్నాయి. ఈ నదుల పరీవాహక ప్రాంతాన్ని లెక్క వేస్తే, అది ఈ భూగోళం ఉపరితలంలో సగానికి పైగా  వుంటుంది. అంతర్జాతీయంగా నదీ జలాల వివాదాలు వున్న దేశాలు మూడు వందలకు పైగా వున్నాయి కాని, వీటిల్లో సాయుధ సంఘర్షణలకు దారితీసే వివాదాలు చాలా తక్కువనే చెప్పాలి. గత శతాబ్ద కాలంలో నీళ్ళ కోసం జరిగిన యుద్ధాలు కేవలం ఏడు మాత్రమే లెక్క తేలాయి.
నీరే ప్రాణాధారమన్నారు శతకకారులు. సేద్యానికయినా, పరిశ్రమలకయినా, తాగ డానికయినా నీళ్ళు అవసరం. నానాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని 2025 నాటికి  మానవాళి అవసరాలు తీర్చడానికి  ప్రపంచ వ్యాప్తంగా వున్న నదుల్లో పారే నీటిపై అపరితమయిన వొత్తిడి ఏర్పడగలదని ఐక్యరాజ్య సమితి (ఐ.ఎన్.డి.పి.) అంచనా. ఈ నేపధ్యంలో నీళ్లపై హక్కులు, నీటి  కేటాయింపులు గురించిన ఉద్రిక్తతలు బాగా పెరిగే అవకాశం వుందని వరల్డ్ వాటర్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న కాలంలో ప్రపంచ రాజకీయాల్లో నీటి  తగాదాలు ప్రధానాంశంగా మారే వీలుందని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. దేశాల నడుమ సరిహద్దు వివాదాల్లో నదీ జలాల పంపిణీ అంశం కీలకం కాగలదని పేర్కొన్నది. చాద్, సోమాలియా, యెమెన్ దేశాల మధ్య సంఘర్షణలకు నీటి తగాదాలకు సంబంధం వుందన్నది పెంటగాన్ అభిప్రాయం.                  
ఈ పంచాయతీలు కేవలం దేశాలకే పరిమితం కాలేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని నీటి వినియోగదారులు కూడా వీటికి అతీతం కాదన్నది జగమెరిగిన సత్యం.
మన దేశంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య రగిలిన చిచ్చుకు కావేరి నదీ జలాలు కారణం. అలాగే, ఆంధ్ర, ఒడిశాల నడుమ వంశధార నదీ జలాల  వివాదం.
పోతే, పొలాల్లో నీరు కావిడి తగాదాలు, వీధి కొళాయిల వద్ద ఆడంగుల  కొట్లాటలు పాత సినిమాలు చూసేవారందరికీ  అనుభవైకవేద్యం.
ఇదంతా ఇప్పుడెందుకంటారా! కృష్ణాజిల్లాలో ఎండిపోతున్న నారుమళ్లకు నీరిస్తే తెలంగాణా వాదులకు కోపం. శ్రీశైలం నుంచి నీరు వొదిలితే సీమ నాయకులకు ఆగ్రహం.
పారే నీటికి ప్రాంతం లేదు. ఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో ప్రవహించి సముద్రంలో కలిసే నదులకు ఒక రాష్ట్రం అంటూ లేదు. చిక్కల్లా నీటితోనే. ఆ నీటిని తమ స్వార్ధానికి వాడుకునే మనుషులతోనే. (05-07-2012)   

1 కామెంట్‌:

  1. "కృష్ణాజిల్లాలో ఎండిపోతున్న నారుమళ్లకు నీరిస్తే తెలంగాణా వాదులకు కోపం"

    మీరు పొరబాటు పడుతున్నారు. నల్లగొండ జిల్లా దాహం తీరాక నీళ్ళు ఇస్తే ఎవరికీ అభ్యంతరం లేదు.

    ఏలిన వారికి & వారి వంధిమాగధులకు కృష్ణా జిల్లాలో ఎండుతున్న పంటలే కానీ నల్లగొండ తడి ఆరిన నోళ్ళు కనిపించవా?

    రిప్లయితొలగించండి