1, జులై 2012, ఆదివారం

డాక్టర్స్ డే


డాక్టర్స్ డే
అయిదేళ్లక్రితం డిసెంబర్ నెలలో ఓ మంగళవారం.
వైద్యుడనేవాడు ఎలావుండాలో అలాగే యెలా వుండకూడదో ఆనాడు  హైదరాబాదులోని నిలోఫర్ ఆసుపత్రిలో జరిగిన రెండు సంఘటనలు అద్దం పట్టి చూపించాయి.
ఆ ఆసుపత్రికి చెందిన జూనియర్ డాక్టర్లు (జూడాలు అని సంక్షిప్త నామం – ఎవరు పెట్టారో కాని బాగా ఆలోచించి పెట్టినట్టున్నారు) ‘హమ్ ఏక్ హై’  అంటూ ఆస్పత్రి వెలుపల చేరి నినాదాలు చేస్తున్న సమయంలో –
‘నిలో ఫర్ లో  మరో పసి కందు మృతి – వైద్య సాయం అందక  మరణించిన శిశువుల సంఖ్య పదికి పెరిగింది, పదిహేనుకు  పెరిగిందంటూ క్రికెట్ స్కోరు మాదిరిగా టీవీ ఛానళ్లలో అదేపనిగా స్క్రోలింగులు వస్తున్న సమయంలో-
ఒక మృత శిశువును  వొడిలో పెట్టుకుని ‘తల్లి తెలంగాణా’ అధినేత్రి ‘రాములమ్మ’ అదే ఆసుపత్రి ఆవరణలో టీవీ కెమెరాల ముందు వీరంగం వేస్తున్న సమయంలో-
అదే  ఆసుపత్రిలో అదే ఆసుపత్రికి చెందిన కొందరు సీనియర్ డాక్టర్లు  మూడు కాళ్లు, నాలుగు పాదాలు కలిగిన ఆరేళ్ళ అనాకారి బాలుడికి తొలి దశ శస్త్రచికిత్సను  విజయవంతంగా  పూర్తిచేసి, ‘వైద్యో నారాయణో హరి’ అనే సూక్తిని నిజం చేశారు.
అంతకుముందు ఆదివారం రాత్రి అదే  ఆసుపత్రిలో ఒక మజ్లిస్ శాసన  సభ్యుడికీ, జూడాలకూ నడుమ మొదలయిన  సంవాదం సాగి, సాగి, చిలికి చికి  గాలివానగా మారింది. ఆ శాసన సభ్యుడు  తమపై దాడికి దిగారని ఆరోపిస్తూ, అతడిని అరెస్టు చేయాలనీ, అతడి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలనీ డిమాండు చేస్తూ జూడాలు ఆకస్మికంగా మెరుపు సమ్మెకు దిగి విధులను బహిష్కరించారు. విధి నిర్వహణలో  వున్న వైద్యులపై దాడులను ఎవ్వరూ సమర్ధించరు. కానీ, వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన పసిప్రాణాలతో చెలగాటమాడే వైఖరిని కూడా ఎవరూ హర్షించరు. సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న అవాంచనీయ ధోరణులు, అసహన వైఖరులు పవిత్రమయిన వైద్య వృత్తిని కూడా వొదిలిపెట్టకపోవడమే ఆందోళన కలిగించే విషయం. ఆలోచించాల్సిన విషయం.
ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి ఆందోళనలూ, సమ్మెలూ అవసరమని అందరూ ముక్త కంఠంతో చెబుతుంటారు. కానీ అవే ఆందోళనలు ప్రజలకు మరికొన్ని కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయన్న  వాస్తవాన్ని మరచిపోతుంటారు. నిజమే, ఆనాటి సంఘటనవల్ల  జూడాలలో ఒకరిద్దరి ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని వారు  సమ్మెకు దిగారు సరే, కానీ వారి ఆందోళలన వల్ల వైద్యం సమయానికి అందక  అనేక నిండు ప్రాణాలే పోయాయి. వాటి సంగతేమిటి?  ఇలాటి వాస్తవాలను గుర్తించనంతవరకూ, అలా ఆందోళనలకు దిగే వారికి ప్రజల మద్దతు లభించదు. సరిగ్గా అదే జరిగింది కూడా.

మొత్తమ్మీద జూడాల సమ్మె ముగిసింది. అన్ని సమ్మెలు యెలా ముగుస్తాయో దీనికీ అలాటి ముగింపే లభించింది.
కానీ, వైద్యుల ప్రవర్తనపై మీడియాలో మాత్రం విస్తృత చర్చే జరిగింది.
వాస్తవానికి సమాజంలో వైద్యులది విశిష్టమయిన స్తానం. అందుకే డాక్టరును ‘డాక్టరు గారు’ అని గౌరవంగా
సంబోధిస్తారు. నలుగురిలో వారికి పెద్దపీటవేసి మన్నన చేస్తారు. రోగాలబారి నుంచి కాపాడే అపర ధన్వంతరులుగా, ప్రాణబిక్ష పెట్టే కలియుగ దైవాలుగా కొలుస్తారు. నాకిప్పటికీ గుర్తు. మా చిన్నతనంలో మా వూరికి వారానికోసారి ఓ డాక్టరుగారు సైకిలు మీద వచ్చేవారు. చిన్న చితకా జ్వరాలకు తనతో  తెచ్చుకున్న తోలుపటకా సంచీనుంచి మందు  గోలీలు ఇచ్చి వైద్యం చేసేవారు. పంటలు  చేతికందినప్పుడు వూళ్ళోని పెద్ద పెద్ద ఆసాములు ఏడాదికోసారి కొలిచి ఇచ్చే ధాన్యం మినహా ఆ డాక్టరు గారు ఏనాడూ రోగులనుంచి  ఫీజు వసూలు చేసిన దాఖలా లేదు. ఆయన వూరికి వస్తే చాలు దేవుడే నడిచివస్తున్నట్టుగా జనం భక్తి ప్రపత్తులు ప్రదర్శించేవారు. ‘సైకిల్ డాక్టరుగార’ని పిలవడం మినహా ఆయన అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. నాడి  పట్టుకుని చూసి ‘ఇప్పుడెలావుందయ్యా రాముడూ’ అని ఆప్యాయంగా అడగగానే సగం రోగం చేతులతో తీసివేసినట్టు వుండేది. చుట్టుపక్కల అయిదారు వూళ్ళకు ఆయనే దిక్కు. సైకిల్ తొక్కుకుంటూ రోజుకో వూరు చుట్టబెట్టేవారు. ఆ రోజుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. కరెంటు వుండేది కాదు. ఉక్కపోస్తున్నా, నులక మంచంమీద కూర్చుని తన మానాన తాను రోగులకు వైద్యం చేస్తుండేవారు. కళ్ళల్లో కారుణ్యం. మోహంలో చెదరని చిరునవ్వు. ఆయన హస్తవాసిపట్ల అందరికీ అపరితమయిన గురి. జనాలకు కొండంత ధైర్యంగా వుండేది.
మరి ఇప్పుడో. ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది.
రోగులు పెరిగారు. రోగాలు పెరిగాయి. వైద్యులూ పెరిగారు. ఇచ్చే మందులూ  పెరిగాయి. వాటి ఖరీదులూ పెరిగాయి.  పెరగనిదల్లా వైద్యులపట్ల రోగులకు వుండే భరోసా! వుండాల్సిన దిలాసా!!
మా చిన్న తనం రోజులు కానీ, అయిదేళ్ళ క్రితం సంఘటన కానీ గుర్తుచేసుకున్నప్పుడు, మార్పేమయినా కానవస్తున్నదంటారా!
కనీసం ఈనాడు ‘డాక్టర్స్ డే’ జరుపుకుంటున్న సమయంలోనయినా మంచి మార్పు వస్తుందని ఆశించవచ్చంటారా!!  (01-07-2012)

4 కామెంట్‌లు:

  1. వైద్యం వ్యాపారమయినపుడు మార్పెలా వస్తుందండీ?

    రిప్లయితొలగించండి
  2. నా చిన్నతనం లో మా వైజాగ్ లో వున్న కె.జి.హెచ్ ఓ దేవాలయం.. వైద్యులందరూ దేవుళ్ళే.. ఎవరైనా పెద్ద డాక్టరు గారు వస్తుంటే అందరూ పక్కకి తప్పుకుని ఎంతో వినయం గా గౌరవంగా, అభిమానంగా చూసేవారు.. దైవాంశ సంభూతుడు వైద్యుడు అని భావించే వాళ్ళూ.. వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే వుండేది.. కాని నేటి స్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..

    రిప్లయితొలగించండి
  3. @ Kastephale and @ Voleti - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  4. గతంలో డాక్టర్లు (యంబిబియస్ వారు కూడా) కేవలం నాడి చూసి రోగ నిర్ధారణ చేశే వారు. మరి ఇప్పుడు జలుబు దగ్గుకు కూడా వేలల్లో ఖర్చు చేసి పరీక్షలు చేయించుకున్న రిపోర్టులు చూసి కూడా సరైన మందులు ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజులలో సమాజంలో స్వార్ధం అంతగా ప్రబల లేదు. ఆఅ కాలంలో అన్ని సామాజిక వర్గాల వారికి వైద్య విద్య అందుబాటులో వుండేది. ఆ రోజుల్లో ప్రముఖులైన వైద్యుల సామాజిక వర్గాలవారికి ఇప్పుడు వైద్య విద్య ఎండ మావి. బాగా బలమైన సామాజిక వర్గాల వారు వైద్య విద్యను కొనుక్కుని పెద్ద పెద్ద ఆసుపత్రులు నడుపుతున్నారు. గవర్నమెంటులో ఈ సామాజిక వర్గాల వారెవ్వరు పని చేయరు. అన్ని రంగాల్లో విలువలు పడిపోయినట్లే ఎంతో ప్రాధాన్యం ఇవ్వవలసిన ప్రజారోగ్యం విషయంలో కూడా ఈ కార్పోరేటీకరణ ప్రవేశించడం మన దౌర్భాగ్యం.


    ప్రసాద్, హైదరబాదు

    రిప్లయితొలగించండి