16, జూన్ 2012, శనివారం

మంచి మనుషులు – మంచి మనసులు



మంచి మనుషులు – మంచి మనసులు

మంచి మనుషుల్ని కలుసుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్ళాలి. మంచి మనసుల్ని తలచుకోవడానికి ఎంత గతంలోకి అయినా వెళ్ళాలి. అందుకే ఓ ఎనభయ్ ఏళ్ళు వెనక్కు పోదాం.

కలకత్తా మునిసిపల్ కార్పొరేషనుకు ‘ఆయన’ మొట్టమొదటి మేయర్ గా ఎన్నికయ్యారు. తన వద్ద పనిచేసేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారిని కాదని, నిండా పాతికేళ్ళు కూడా నిండని ఓ భారతీయుడిని కార్పొరేషన్ సీ. ఈ. వో. గా ఎంచుకున్నారు. మేయర్ నిర్ణయాన్ని అప్పటి ప్రభుత్వం సయితం వ్యతిరేకించలేదు. సరికదా, ప్రజలచేత ఎన్నికయిన మేయర్ నిర్ణయాన్ని ఔదలదాల్చింది. ఈ నాటి స్వతంత్ర భారతంలో ఇలాటి దృష్ట్యాంతం ఒక్కటి చూపగలమా. సందేహం అక్కరలేదు. లేదుఅని బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు.

సరే, ఆ కుర్రాడు కొన్నాళ్ళు పని చేసాక  బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే రిపోర్టులు రావడంతో అతగాడిని ఉద్యోగం నుంచి అర్ధాంతరంగా  తొలగించారు. అంతటితో ఆగలేదు, అతడిని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. కానీ మన మేయర్ గారున్నారే,  ఆయన అలాటిలాటి అల్లాటప్పా  రాజకీయ నాయకుడు కాదు. కనుకనే, ఆ నాటి ప్రభుత్వంతో పోరాడి అతడిని జైలు నుంచి  విడిపించారు. ఆయన గొప్పతనం కొలిచేందుకు కొలమానాలు లేవు సరే. మరి అంతటి ఉదాత్త వైఖరి ప్రదర్శించిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని పొగిడేందుకు వేయి నాలుకలు సరిపోతాయా. అంటే ఏమిటి? స్తానిక సంస్తలకు అలనాటి  బ్రిటిష్ పాలకులు ఇచ్చిన ప్రాధాన్యత అలాటిదన్నమాట. అలాటి విశాల తత్వాన్ని ఈనాటి స్వతంత్ర భారతంలో మన  పాలకులనుంచి ఆశించగలమా?

ఆ మేయర్ మహాశయుల పేరు స్మరించుకుందాం.  దేశబంధు బిరుదు పొందిన స్వాతంత్య్ర సమర యోధుడు  చిత్తరంజన్ దాస్. ఆ కుర్ర అధికారి ఎవరో వూహించగలరా. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో హింసా మార్గం అవలంబించినా  తప్పులేదని భావించి అజాద్ హింద్ ఫౌజ్ స్తాపించిన అమరవీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. (షుబాషు చంద్రబోషూ అని ఉచ్చరించాలని గూగుల్ సెర్చ్ ఉద్ఘాటిస్తోంది.)
(ఈనెల పదహారో తేదీ చిత్తరంజన్ దాస్ వర్ధంతి)

2 కామెంట్‌లు:

  1. 80ఏళ్ళక్రితం లోకం అలా వుండింది, అది బ్రిటిషర్ల గొప్పదనం అని భావిస్తే పొరపాటు.
    వుత్తిపుణ్యాన, జనహనన ఆయుధాలు వున్నాయని రిపోర్త్ ఇప్పించుకుని దాడి చేసి సద్దాం్‌ను వురి తీసి కసి తీర్చుకున్న గ్యాంగ్లోని ముఖ్య సభ్యులు ఆ బ్రిటీషు ముష్కరుడే(టోనీ బ్లైర్). ఇప్పుడు బ్రిటీషర్ల ఔదార్యముంటే చెప్పండి.

    రిప్లయితొలగించండి
  2. @SNKR- పోనీ మీరన్నట్టు ఆ గొప్పదనం కాలానిదే అనుకుందాం. పోయిందేమీలేదు.

    రిప్లయితొలగించండి