26, ఏప్రిల్ 2012, గురువారం

కష్టాల కడలిలో కాంగ్రెస్‌


కష్టాల కడలిలో కాంగ్రెస్‌  (SURYA DAILY- Dated. 26-04-2012)

రోగనిర్ధారణలో కేంద్ర ఆరోగ్యమంత్రి వైఫల్యం?
కేరళ మూలికా వైద్యుని ప్రవేశం!
ఇంతకీ రోగ నిర్ధారణ జరిగినట్టేనా?
వయలార్‌ రాకతో అనుమానాలు
ఇంతలోనే ముంచుకొచ్చిన ఉప ఎన్నికలు
కాంగ్రెస్‌ ఆశలపై ఎన్నికల నియమావళి నీళ్ళు
తోడైన అంతర్గత కుమ్ములాటలు
పుణ్యకాలం రెండేళ్ళే! 





రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికి తీసికట్టు చందంగా ఉందన్న సంగతి అధిష్ఠానానికి ఇన్నాళ్లకు తెలిసివచ్చినట్టుంది. కేంద్రంలో స్వయంగా ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న గులాం నబీ ఆజాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీని పట్టి పీడిస్తున్న జబ్బేమిటో ఆనవాలు పట్టలేక పోయారు. ఇక ఇంగ్లీష్‌ వైద్యంతో పని కాదనుకున్నారో యేమో కానీ హఠాత్తుగా ఢిల్లీ నుంచి కేరళ మూలికా వైద్యుడు వయలార్‌ రవిని రోగనిర్ధారణ కోసం పంపారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలో అదే ఢిల్లీ నుంచి వయలార్‌ మహాశయులు హైదరాబాదు రావడం లేనిపోని అనుమానాలకు బీజం వేసింది. నేడో రేపో ముఖ్యమంత్రి మార్పు తథ్యం అన్నంతవరకు ఊహాగానాలు గుప్పుమన్నాయి.

అయితే, వీటితో సంతోషపడ్డవారూ కాంగ్రెస్‌లో ఉన్నారు. అయ్యో యెట్లా అనుకున్న వారూ అదే కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న బలం, బలహీనత ఇదే సుమా అని విశ్లేషించిన వాళ్ళూ లేకపోలేదు.వచ్చారు, చూశారు, వెళ్లారు అన్న తరహాలో వయలార్‌ వారి రాష్ట్ర పర్యటన ముగిసింది. పోతూ పోతూ షరా మామూలు తరహాలోనే, ముఖ్యమంత్రికీ, పీసీసీ అధ్యక్షుడికీ నడుమ ఎలాటి విభేదాలు లేవని మీడియాకు నొక్కి వక్కాణించి మరీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి అధినాయకురాలికి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలపై ప్రత్యక్ష సాక్షి కథనాన్ని నివేదిక రూపంలో అందచేశారని భోగట్టా. ఇంతకీ ఆయన అయినా రోగనిర్ధారణ చేశారా అన్నది సమాధానం దొరకని ప్రశ్నే.ఈలోగా పులిమీది పుట్రలా పద్ధెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి ఉపఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు ఎంతో కొంత వ్యవధానం ఉంది, ఏదో ఒక మేరకు సర్డుకోలేకపోతామా అని కాంగ్రెస్‌ పెట్టుకున్న ఆశలపై, ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్న ప్రకటన బిందెడు నీళ్ళు గుమ్మరించింది.

ప్రజాపథం పేరుతొ, లేదా నియోజకవర్గాల అభివృద్ధి నిధుల పేరుతో సర్కారు డబ్బులు వెదజల్లకుండా ఈ నియమావళి మోకాలొడ్డింది. నిజానికి ఈ ఎన్నికల్లో మిగిలిన పార్టీల మీద కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న వెసులుబాటు ఇదొక్కటే. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఆ పార్టీయే అధికారంలో ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ వ్యవధానం ఉంది. క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులను ఆకట్టుకోవడానికి, చోటా మోటా నాయకులను చేరదీసి పోలింగు బూత్‌ల పరిధుల్లో కోరుకున్న విధంగా ఓటింగు జరిగేలా చూసుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న వీలు, సాళ్ళు ఇతర పార్టీలకు లేవు. కానీ, ఎన్నికల నియమావళి పుణ్యమా అని ఇప్పుడా వెసులుబాటు లేకుండా పోయింది. రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదేవిధమయిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

అనుకున్న వ్యవధిలో జరుగుతాయనుకున్న అసెంబ్లీ ఎన్నికలు బాగా వాయిదా పడిపోవడంతో ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నెలల తరబడి కొనసాగాల్సి వచ్చింది. పేరుకు ముఖ్యమంత్రి అయినా ఏమిచేయాలనుకున్నా చేయలేని పరిస్థితి. అన్నింటికీ ఎన్నికల కమిషన్‌ లక్ష్మణ రేఖలు. మండే ఎండా కాలం. చిన్నా చితకా పనులు చేయాలన్నా అడ్డుకొంటున్న ఆంక్షలు. జనాలకు అవసరమయిన పనులు చేసిపెట్టలేని అశక్తత. ఫలితం ఏమిటన్నది అందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడు అదే వాతావరణం పునరావృతమవుతోంది. ఎండలు మం డుతున్నాయి. దాహార్తితితో జనం ఎండుతున్నారు. అభివృద్ధి కార్యక్ర మాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాల్సిన పరిస్థితి. ఆనవాయితీకి భిన్నంగా ఉప ఎన్నికల షెడ్యూల్‌కు, ఎన్నికల నోటిఫికేషన్‌కు నడుమ వ్యవధి కాస్తా ఇరవై అయిదు రోజులకు పెరిగింది. సాధారణంగా ఇది వారం, పది రోజులకు మించి ఉండదు.

ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం సుమారు వంద కోట్ల రూపాయల పైచిలుకు అభివృద్ధి పనులు మంజూరు చేసిన విషయం ఫిర్యాదుల రూపంలో ఎన్నికల కమిషన్‌కు చేరడమే ఇంత ముందుగా షెడ్యూల్‌ ప్రకటించడానికి కారణంగా చెప్పుకుంటున్నారు.
ఉప ఎన్నికలు జరిగి తీరుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా అసలు జరుగుతాయా లేదా అన్న విషయంపై చాలా రోజులుగా సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. రాష్టప్రతి ఎన్నిక జరిగే లోగా ఆయా రాష్ట్రాల శాసన సభల్లో ఏమైనా ఖాళీలు ఉంటే, వాటిని భర్తీ చేయడం అన్నది సంప్రదాయమే కాని నిబంధన కాదని, ఎన్నికలకు వెనుకంజ వేసే ప్రభుత్వం ఏదో ఒక కారణం చూపి వాటిని వాయిదా వేయించడానికే ప్రయత్నిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రతిపాదన ఇందులో భాగమేనని కూడా వార్తలు వెలువడ్డాయి. కాని ఈ వదంతులను పటాపంచలు చేస్తూ అనుకున్న దానికంటే కొంత ముందుగానే ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించడం ఆయా పార్టీల వారిని నివ్వెర పరచింది. ఉప ఎన్నికలు ముందు నుంచి ఊహించినవే కాబట్టి, అందరూ వాటికి సంసిద్ధంగానే ఉన్నారనుకోవడం పొరబాటు. వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న పార్టీలు, ముఖ్యంగా పాలక పక్షం, ఏదో ఒక కారణంతో పోలింగ్‌ వాయిదా పడాలనే కోరుకోవడం సహజం. కానీ, ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్నిఅన్నట్టుగా ఎన్నికల తరుణం ముందుకు తోసుకు వచ్చింది.

అసలే ప్రతికూల వాతావరణం. పైపెచ్చు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు. వాటికి తోడు, ఈ సారి కాంగ్రెస్‌ పని అయిపోయినట్టే అని వెలువడుతున్న ఎన్నికల సర్వేలు. ఇవన్నీ కాకుండా, పోటీ చేసే అభ్యర్ధులను కూడా సకాలంలో ప్రకటించలేని దుస్థితి, వెరసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారయింది.ఈ నేపథ్యం ఇట్లా ఉంటే, ఇవన్నీ సరిపోలేదన్నట్టు- రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడు, సాక్షాత్తూ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజయనగరంలో ధర్నా చేయడం, మరో వైపు పార్లమెంటులో అధికార పక్షానికే చెందిన సభ్యులు తెలంగాణ కోసం సభా కార్యక్రమాలకు అడ్డు తగిలి, నాలుగు రోజుల పాటు సస్పెన్షన్‌కు గురికావడం- ఇవన్నీ కాంగ్రెస్‌ పార్టీని, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మరింత ఇరకాటంలో పడేసాయి.

రామాయణంలో పిడకల వేటలా ఉప ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టుకోవాలో లేదో అని పార్టీలో చెలరేగిన మీమాంస పార్టీని అతలాకుతలం చేసింది. ఒక రోగం అయితే ఏదో వైద్యం చేసి సరిదిద్దవచ్చు. అనేక రోగాలాయే. ఒకదానికి చేసే చికిత్స మరో దానికి వికటిస్తుంది. క్షయ, షుగర్‌ వ్యాధులతో సతమతమయ్యే రోగికి ఒక రోగ నిదానానికి చేసే చికిత్స మరో వ్యాధికి పొసగదు. క్షయ రోగానికి పుష్టీ బ్రాండ్‌ ఆహారం తీసుకోవాలి. కానీ, షుగర్‌ వ్యాధి కూడా ఉన్నప్పుడు అలాటి ఆహారం తీసుకోవడం కుదరని పని.రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్తితి ప్రస్తుతం ఈ రెండు వ్యాధులు సోకిన రోగి మాదిరిగా ఉంది. వైఎస్సార్‌ అభివృద్ధిని ఖాతాలో వేసుకోవాలంటే, మరో వైపు ఆయన హయాంలో జరిగినదంటున్న అవినీతి మరక అంటుకుంటుందని భయం. వైఎస్‌ చేసిన అభివృద్ధిని వదలుకుంటే ప్రజలు కాదంటారని సంకోచం. ఇన్ని సంకటాల నడుమ కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాలన సాగుతోంది.

పాలన సాగుతోందని అంటే దానికి కూడా అభ్యంతర పెట్టేవాళ్ళు ఆ పార్టీలోనే చాలామంది ఉన్నారు. కొంతమందికి వైయస్సార్‌ పనికిరాడు. ఆ మేరకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి అవసరం వారికి ఉంది. అదీ ఎంతవరకు? మరొకరికి అధిష్ఠానం అవకాశం ఇచ్చేవరకు. ఇస్తే, మరుక్షణం నుంచి వారి విధేయతలు మారిపోతాయి. ఎందుకంటే నేటి రాజకీయాల్లో విధేయతలు, విశ్వాసాలు అన్నీ కుర్చీలకే పరిమితం. అవకాశం రావాలే కానీ, ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతున్న అధినాయకులతోనే- ముఖ్యమంత్రి పదవి కోసం బరిలోకి దిగడానికి అలాటివాళ్ళు ఎప్పుడూ సిద్ధమే. ఇందుకు కారణం ఉంది.

మంత్రి అనిపించుకోవాలన్నా, ముఖ్యమంత్రి అనిపించుకోవాలన్నా ఇక మిగిలిన పుణ్య కాలం రెండేళ్ళే! ఆ తరువాత ఏదో మహాద్భుతం జరిగితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్‌ వరసగా మూడో పర్యాయం అధికారంలోకి రావడం కల్ల. అందువల్ల, ముఖ్యమంత్రి కావాలనే కల నెరవేరాలన్నా, ఆ దరిమిలా పది కాలాలపాటు మాజీ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోవాలన్నా ఉన్న వ్యవధి ఈ రెండేళ్ళే అన్న వాస్తవం మూడు రంగుల కండువా కప్పుకున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటారు. మరి కుర్చీ ఖాళీ లేకపోతే ఏం చేస్తారు? ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది అదేనేమో!


(25-04-2012)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి