7, ఏప్రిల్ 2012, శనివారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మాస్కోలో మా అనుభవాలు)


మార్పు చూసిన కళ్ళు 
(అలనాటి మాస్కోలో మా అనుభవాలు)
ప్రధాని గారూ! మీరు బూట్లెక్కడ కొన్నారు?  
ఓ రోజు ఆఫీసులో పనిచేసే రష్యన్ సహోద్యోగి, పత్రికలో పడిన ఓ జోక్ ను  రష్యన్ యాసలో తెలుగులో చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజానికి అది జోకేమీ కాదు. అది ఆ దేశ ప్రధానమంత్రి  కోసిగిన్ గురించిన వార్త. ఆయన ఏదో కార్యక్రమంలో పాల్గొన్న ఫోటో ఓ పత్రికలో వేసారు. బూట్లు సాక్సు వేసుకుని ఫోటోలో కానవస్తున్న ప్రధాన మంత్రికి ఆ పత్రిక పాఠకుడు రాసిన బహిరంగ లేఖను  నా రష్యన్ మిత్రుడు  జోకుగా చదివి  వినిపించాడు.
‘అయ్యా! ప్రధాని గారు. బూట్లు, సాక్సు కోసం గత ఆరు మాసాలుగా నేను తిరగని దుకాణం లేదు. మీరు ఎక్కడ కొన్నారో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి.’ ఇదీ ఆ ఉత్తరం సారాంశం.
నేను మాస్కో వెళ్ళిన  కొత్తల్లో ఆఫీసులో ఎవ్వరూ, జోకుల సంగతి అటుంచి అసలు  అవసరం అయినదానికంటే ఎక్కువ తక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. అలాటిది ఏకంగా దేశ ప్రధాని గురించీ, ఆయన వేసుకున్న బూట్లూ సాక్సూ గురించీ అలా బహిరంగ లేఖ రాయడం, దాన్ని గురించి ఆఫీసుల్లోనే బహిరంగంగా చర్చించుకోవడం – ఇదంతా  చూస్తుంటే  నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సోవియట్ రష్యాలో నిత్యావసర వస్తువుల కొరత గురించి ఒక సాధారణ పౌరుడు ఏకంగా ప్రధానమంత్రిని ఉటంకిస్తూ వ్యంగ్యంగా నేరుగా  పత్రికకు ఉత్తరం రాయడం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం నుంచి వెళ్ళిన నాకే అబ్బురం అనిపించింది. అందులో అది షరా మామూలు దేశమేమీ కాదు. ఇనుపతెర దేశంగా ప్రసిద్ధి చెందిన దేశం.
మంచిదే! గోర్భచెవ్ ఏమిచ్చినా ఏమివ్వకపోయినా ప్రజలు  గాఢంగా కోరుకుంటున్న వాక్స్వాతంత్రం పూర్తిగా ఇచ్చేసినట్టే లెక్క. నిజానికి అక్కడివారికి జీవించడానికి ఏమేమి కావాలో అక్కడ అన్నీ వున్నాయి. పైగా అవన్నీ కారు చౌకగా. లేనిదల్లా మనసులో మాట బయట పెట్టగలిగిన స్వేచ్చ ఒక్కటే. అదొక్కటీ దొరకడమే వారికి అబ్బురంగా అనిపించి వుంటుంది.
ఇలా మొదలయిన మార్పు ‘మార్పు’ అన్న పదానికంటే గొప్పగా మార్పు చెందడమే నేను చూసిన మార్పు.
మార్పు అన్నది తెలవకుండా డెబ్భయ్ ఏళ్ళపాటు అవిచ్చిన్నంగా సాగిన సోవియట్ వ్యవస్థలో కనబడని మార్పులు కనీ కనబడకుండా  చోటు చేసుకుంటున్నాయన్న మాట. (07-04-2012)
      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి