26, జనవరి 2012, గురువారం

అలనాటి బెజవాడ


అలనాటి బెజవాడ
బెజవాడ గురించి చెప్పుకునే ముందు ముందుగా ప్రస్తావించుకోవాల్సింది బెజవాడ రైల్వే స్టేషన్ గురించి. ఎందుకంటె అనేక విషయాల్లో దీనికదే సాటి. దక్షిణ భారతానికి ముఖద్వారం లాటి బెజవాడ రైల్వే స్టేషన్ లో కాలి వంతెన మీద నిలబడి అప్పుడే స్టేషను లోకి ప్రవేశించే  గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ రైలును చూడడం అదో అనుభూతి.



జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజను ఆవిర్లు చిమ్ముతూ, బిగ్గరగా  కూతపెడుతూ ప్లాటుఫారం మీదకు వేగంగా వస్తుంటే ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడడానికి వందలమంది  స్టేషను ఫుట్ బ్రిడ్జ్  మీద గుమికూడేవారని చెబితే ఈనాటి వారు నమ్మడం కష్టమే. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ పేరుకు తగ్గట్టే దాని కూత కూడా ప్రత్యేకంగా వుండేది. దూరం నుంచి కూడా కూత విని ఆ రైలును గుర్తుపట్టేవారు.
ఇక స్టేషను విషయానికి వస్తే అది యెంత పెద్దదంటే బెర్లిన్ గోడ మాదిరిగా బెజవాడ పట్టణాన్ని తూర్పు, పడమర దిక్కులుగా విభజిస్తూ వుంటుంది. రెండు పక్కలా రెండు విభిన్న సంస్కృతులు పరిఢవిల్లుతుండేవి. 1941 లో కాబోలు గానన్  డంకర్లీ అండ్ కంపెనీ,  రైలు పట్టాల కిందుగా అండర్ పాస్ వంతెన నిర్మించేంతవరకు బెజవాడ రెండు  భాగాలుగా వుండేది. ఇక ఆ స్టేషనులో రద్దీ గురించి చెప్పాల్సిన పని లేదు.  ఆ రోజుల్లోనే పది నిమిషాలకు ఒక రైలు రావడమో, పోవడమో జరిగేది. రైలు గేటు  వేసినప్పుడల్లా అటునుంచి ఇటు రాకపోకలు సాగించేందుకు జనం నానా ఇబ్బందులు పడేవాళ్ళు. అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో ఈ చిక్కులు తొలగిపోయాయి.
  
ఆ రోజుల్లో  నిజాం పాలనలో వున్న హైదరాబాదు స్టేట్ నుంచి రైళ్ళు బెజవాడ వచ్చేవి. నిజాం రైళ్ళను గురించి జనం గొప్పగా చెప్పుకునే వారు. సమయపాలనకు అవి పెట్టింది పేరు. అలాగే శుభ్రత. మూడో తరగతి బోగీల్లో కూడా పంకాలు, స్టెయిన్ లెస్ స్టీల్ టాయిలెట్లు వుండేవి.
బెజవాడ రైల్వే స్టేషన్ చూస్తే ఏకత్వంలో భిన్నత్వం అంటే ఏమిటో బోధ పడుతుంది. దేశం నలుమూలలకు  చెందిన  విభిన్న భాషలవాళ్ళు బెజవాడ ప్లాటుఫారం పై కానవస్తారు. కొత్తవాళ్ళకు కృష్ణా పుష్కరం మాదిరిగా గుంపులు గుంపులుగా వున్న ఆ జనసందోహం కనబడేది.



దుర్గ గుడిలో ఈ రోజుల్లో కనబడుతున్న భక్తుల రద్దీ అప్పట్లో లేదు. నలభయ్యవ  దశకంలో ఎప్పుడు చూసినా, ఒక్క నవరాత్రులను మినహాయిస్తే, గుళ్ళో  పది పన్నెండు మంది కంటే ఎక్కువ కానవచ్చేవారు కారు. బెజవాడకు లాండ్ మార్క్ లాటి దుర్గ గుడి వల్లే విజయవాడ అనే పేరు వచ్చిందని చెబుతారు. కాళి మాత  రాక్షసుల మీద సాగించిన పోరులో విజయం సాధించిన కారణంగా ఆ విజయానికి సంకేతంగా విజయవాడ అన్న పేరు వచ్చిందని స్తల పురాణం  చెబుతుంది.  అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసింది  దుర్గ గుడి  కొలువైవున్న ఇంద్రకీలాద్రి అనే పర్వతంపైనే అనే మరో ఐతిహాసం వుంది. బంగాళాఖాతంలో సంగమించడానికి ఉరుకులు పరుగులు పెడుతూ కృష్ణమ్మ ఈ కొండ పక్కగా  బిరా బిరా పారుతూ వుంటుంది.
వేసవి కాలంలో బందరు కాలువ, రైవస్ కాలువ, ఏలూరు కాలువల లాకులు కట్టేసేవారు. నీళ్ళు లేకపోవడంతో ఆ కాలువలన్నీ ఇసుక మేటలుగా కానవచ్చేవి. మళ్ళీ సీజనులో కాలువలకు నీళ్ళు  వొదిలేటప్పుడు చూడాలి, వందలాదిమంది ఆ కాలువల  వంతెనల మీద చేరేవారు. సుళ్ళు తిరుగుతూ కృష్ణ నీళ్ళు కాలువల్లోకి ఒక్కమారుగా నురుగులు కక్కుతూ  జారిపోయే దృశ్యం చూస్తూ పరవశించి పోయేవారు. ఇలాటివి మరపురాని దృశ్యాలయితే,  మరచిపోవాలనుకునేవి  మరికొన్ని లేకపోలేదు. ఆ రోజుల్లో చాలామంది కాలవ గట్లనే కాలకృత్యాలకు వాడేవారు. పరిస్తితి  ఇప్పుడెలావుందో తెలవదు.

గవర్నర్ పేటలో వున్నప్పుడు ఇంద్రకీలాద్రి ఎక్కే ప్రయత్నం చేయలేదు కాని, ఏడెనిమిదేళ్ళ వయస్సులో వర్జిన్ మేరీ హిల్ అనే కొండ ఎక్కుతూ వుండేవాళ్ళం. అలా ఎక్కేటప్పుడు కాలు జారితే ఇంతే సంగతులు. పడిపోకుండా పట్టుకోవడానికి చిన్న చిన్న పొదలు తప్ప వేరే ఏ ఆధారం వుండేది కాదు.

ఒక జీవ నది, మూడు కాలువలు, అనేక కొండలు ఇవన్నీ బెజవాడకు సహజ సిద్ధంగా వున్న అలంకారాలు. సక్రమంగా అభివృద్ధి చేసివుంటే,  జార్జియాలోని అందమయిన  తిబ్లిసీ నగరానికి ఏమాత్రం తీసిపోయేది కాదన్నది వాస్తవం.   

బెజవాడ అంటేనే బ్లేజ్ వాడ. అంటే మండే నగరం. ఇక్కడ ఎండలు అలా మండిపోతుంటాయి. ఎండల్ని గురించి చెప్పాల్సి వస్తే ఇప్పటికీ బెజవాడ ఎండలతో పోల్చి చెప్పడం కద్దు. ఎండల కారణంగా బెజవాడకు రావాల్సిన  ఆంధ్ర విశ్వ విద్యాలయం రాకుండా పోయిందనే ఒక వాదన ప్రచారంలో వుంది. కట్టమంచి రామలింగారెడ్డి గారు బెజవాడ ఎండలకు భయపడే వాల్తేర్ ను ప్రత్యామ్నాయంగా సూచించారని అంటారు. ఈ ఒక్క కారణంగా బెజవాడ వాసులు ఇప్పటికీ ఆయన్ని క్షమించరని అనే వాళ్లు కూడా వున్నారు.

నిద్రపోని నగరంగా బెజవాడ గురించి చెప్పుకుంటారు. ఉత్తర దక్షిణ భారతాలను కలిపే రైళ్ళు అన్నిటికీ కూడలి కావడం వల్ల అర్ధరాత్రీ  అపరాత్రీ అని లేకుండా ప్రయాణీకుల రాకపోకలు నిరంతరం సాగుతూనే వుంటాయి. అలాగే అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు. సినిమాలకు వెళ్ళే జనం కూడా ఎక్కువే. వీటికి తోడు ప్రధానమయిన తెలుగు దినపత్రికలన్నింటికీ బెజవాడే ప్రచురణ కేంద్రం. పత్రికల్లో పనిచేసి అర్ధరాత్రో, తెల్లవారుఝామునో ఇళ్లకు చేరుకునే మా బోంట్లకు హోటళ్ళలో తాజాగా వేడి వేడిగా దొరికే కాఫీ పలహారాలే దిక్కు. ఈ విషయంలో  ప్రధానంగా చెప్పుకోవాల్సింది గాంధీ నగరంలోని బాబాయి హోటలు. సినిమా తారలతో సహా పెద్ద పెద్ద  వాళ్లు అనేకమంది ఈ హోటలుకు  వస్తుంటారు. అలాగే కౌతా సెంటరులో వున్న రాములు కిల్లీ కొట్టు కూడా అంతే  ప్రసిద్ధం. అక్కడ దొరికే కిళ్ళీల కోసం జనం బారులు తీరేవారు. ( అమెరికాలో వుంటున్న శ్రీ దాసు కృష్ణ మూర్తిగారి ఇంగ్లీష్ జ్ఞాపకాలకు తెలుగు అక్షర రూపం)  

12 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది సార్‌ .. చాలా చాలా బాగుంది.
    ఈ బుక్‌ కి ఆన్‌ లైన్‌ వెర్షన్‌ ఉందా? ఉంటే కొంచెం బ్లాగులో పెట్టేస్తారా? మళ్ళీ ఎపిసోడ్‌ వచ్చే వరకూ ఆగలేకపోతునాం

    రిప్లయితొలగించండి
  2. నాది బెజవాడ కాకపోయినా మీ టపా చాలా బావుంది. నైజం నవాబు రైళ్ళు అంత గొప్పగా ఉండేవా? దుర్గా గుడికి అప్పట్లో పది-పదిహేను మంది కంటే ఎక్కువమంది ఉండేవారు కారని చదువుతూంటే ఆశ్చర్యం కలిగింది

    రిప్లయితొలగించండి
  3. Advt:

    Nifty option tips

    First time in India we are providing sure nifty option tips with contract note proof.
    Plz visit www.niftysiri.in
    100% genuine performance with researched calls.

    రిప్లయితొలగించండి
  4. @అజ్ఞాత - మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ సందేహం తీర్చగలిగే సాంకేతిక నైపుణ్యం లేదు. ఈ విషయంలో సలహా చెప్పగలిగితే చాలా సంతోషిస్తాను.ఆన్ లైన్ వెర్షన్ అనే మాట నేను మొదటిసారి వింటున్నాను.అరవై అయిదేళ్ళ వయస్సులో బ్లాగు రాయడం నేర్చుకున్నాను.మీ లాంటి వాళ్లు సహకరిస్తే ఆ వెర్షన్ సంగతి కూడా చూడాలని వుంది.-భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  5. @బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ - నిజానికి నాదీ బెజావాడ కాదు. కొన్నాళ్ళు అక్కడ స్కూల్లో,కాలేజీలో చదువుకున్నాను. ఆ అభిమానం, అప్పటి జ్ఞాపకాలు దీనికి ప్రేరేపణ.-భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  6. మీరు రాసింది చదువుతుంటే ఆ జీటీ ఎక్స్ ప్రెస్ వచ్చే దృశ్యాన్ని ఊహించుకోవాలనిపిస్తోంది. ఘండికోట బ్రహ్మాజీ రావు గారు విజయవాడ జంక్షన్ అని ఒక సీరియల్ నవలే రాశారు ఆంధ్ర జ్యోతిలో!

    విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పుడూ లైవ్లీ గా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  7. జిటి ఎక్స్‌ప్రెస్ అంటేనే గుర్తొస్తోంది. 1964కి ముందు మన దేశంలో ఎక్కువగా బొగ్గు ఇంజిన్‌లతోనే ట్రైన్‌లు నడిచేవి. అప్పట్లో విదేశాల నుంచి దిగుమతైన డీజిల్ ఇంజిన్‌లు కొన్ని చోట్ల ఉపయోగించేవాళ్ళు. 1964లో మన దేశంలో స్వదేశంలో నిర్మించబడిన డీజిల్ ఇంజిన్‌లు ఉపయోగించడం మొదలుపెట్టారు. 1966లో హౌరా-మద్రాస్ మెయిల్‌ని డీజిల్ ఇంజిన్‌తో నడపడం మొదలుపెట్టారు. మన రాష్ట్రంలో నడిచిన మొట్టమొదటి డీజిల్ ట్రైన్ అదే. కానీ జిటి ఎక్స్‌ప్రెస్‌ని మాత్రం 1970 వరకు బొగ్గు ఇంజిన్‌తోనే లాగేవాళ్ళు.

    రిప్లయితొలగించండి
  8. @ప్రవీణ్ శర్మ- జీ.టీ.ఎక్స్ ప్రెస్ గురించి అదనపు సమాచారం పంచుకున్నందుకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  9. ఒక వెబ్‌సైట్‌లో కాజీపేట స్టేషన్ దగ్గర ఆగి ఉన్న జిటి ఎక్స్‌ప్రెస్ ఫొటో చూశాను. అది 1970లో తీసిన ఫొటోయే. ట్రైన్‌ని బొగ్గు ఇంజిన్ నుంచి డీజిల్ ఇంజిన్‌కి మార్చడానికి కొన్ని రోజుల ముందు తీసిన ఫొటో అది. ఆగ్నేయ రైల్వేలో 1966 నుంచి డీజిల్ ఇంజిన్‌లు ఉన్నాయి. అప్పట్లో విశాఖపట్నం ఆగ్నేయ రైల్వేలో ఉండేది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కోసం అల్లర్లు చేస్తోన్న ఆందోళనకారులు కొత్తవలస స్టేషన్ దగ్గర ఆగి ఉన్న డీజిల్ ఇంజిన్‌ని తగలబెట్టారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. దక్షిణ మధ్య రైల్వేకి 1970లో డీజిల్ ఇంజిన్‌లు వచ్చాయి.

    రిప్లయితొలగించండి
  10. అప్పట్లో బెజవాడ స్టేషన్ నుంచి పది నిముషాలకొక ట్రైన్ ఉండేదనేది నమ్మశక్యంగా లేదు. అప్పట్లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ బెజవాడలోనే ఆగిపోయేది. గోదావరి ఎక్స్‌ప్రెస్ లేనేలేదు. గుంటూరు జిల్లా నడికూడి నుంచి నల్లగొండ జిల్లా బీబీనగర్‌కి రైలు మార్గం లేదు. విజయవాడ నుంచి గుంటూరు, గుంతకల్లు మీదుగా హుబ్లీ వరకు ఉన్న రైలు మార్గం మీటర్ గేజ్ మార్గం. అలాగే గుడివాడ-భీమవరంల మధ్య కూడా అప్పట్లో రైలు మార్గం లేదు. ఈ గేజ్ అడ్డంకులు, రైల్వే లైన్‌ల కొరత ఉండగా ఒక స్టేషన్ నుంచి పది నిముషాలకొక ట్రైన్ ఉండడం విచిత్రమే.

    రిప్లయితొలగించండి
  11. praveensharmagaru,

    You are mistaken. There was a railway line existing between Vijayawada and Narsapur via Gudivada and Bhimavaram during the British rule itself. However, my Grandfather used to tell me that they had to changeover in Gudiwada.

    రిప్లయితొలగించండి
  12. Sir,
    Can anybody have the photograph of the old Vijayawada railway station? I am a doctor and am editing Platinum Jubilee Souvenir Vijayawada branch of Indian Medical Association.
    Thank you in advance
    You can send the photo or link to drbmallik@gmail.com

    రిప్లయితొలగించండి