18, అక్టోబర్ 2011, మంగళవారం

ఫీకా టు బై న్ వ – భండారు శ్రీనివాసరావు

ఫీకా టు బై న్ వ – భండారు శ్రీనివాసరావు

ఇంతకు ముందు రాసిన ‘వన్ బై టు కాఫీ’ కి ఇది అచ్చంగా అద్దంలో అక్షరం లాటిది. అంటే పూర్తిగా వ్యతిరేకం అన్నమాట. అందుకే - ‘ఫీకా టు బై న్ వ’ అని శీర్షికాసనం వేయాల్సి వచ్చింది.

అదేమో నలభైఏళ్ల కిందటి ముచ్చట. ఇదేమో ఈనాటి తాజా కధ.

రామానికి చదువంటే ఇష్టమే కానీ ఇంజినీరింగ్ అస్సలు ఇష్టం లేదు. తలిదండ్రుల ముచ్చట తీర్చడానికి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయ్యాడు. అమెరికాలో ఉద్యోగం వచ్చింది. అమెరికా అంటే మాటలా. అవకాశాలకు పుట్టినిల్లు. వాటిని వెదుక్కుంటూ వెళ్ళే ధీశాలులకు అదొక పోతుగడ్డ. ఆ దేశపు గడ్డ మీద కాలుమోపగానే రామానికి జీవిత ధ్యేయం నెరవేరిన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటె అమెరికా ఉద్యోగం అన్నది తన ఒక్కడి కల కాదు. కుటుంబం యావత్తు కలసి కన్న స్వప్నం.

రామం ఏమీ కలిగిన కుటుంబం నుంచి రాలేదు. అతడి తండ్రి చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.అప్పటికి వాళ్లకు మిగిలిన స్తిరాస్తి ఒక బెడ్ రూమ్ ఫ్లాట్.


అమెరికా రావడంలో అతగాడి లక్ష్యం ఒక్కటే. కనీసం ఇక్కడ అయిదేళ్ళు వుండాలి. వున్నన్ని రోజులు బాగా సంపాదించాలి. సంపాదించిన దానిలో చేతనయినంత కూడబెట్టాలి. కూడబెట్టిన డబ్బుతో ఇండియాకు తిరిగెళ్లి అమ్మానాన్నను బాగా సుఖపెట్టాలి.

ఆలోచన బాగానే వుంది కానీ, ఆచరణ అంత సులభం అనిపించలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఇంటి మీద ధ్యాస మళ్ళింది. ప్రతి క్షణం అమ్మా నాన్నా గుర్తొచ్చేవాళ్ళు.

వారం వారం ఫోను చేసి వారితో గంటలు గంటలు మాట్లాడేవాడు.ఇందుకోసం చౌకగా దొరికే ఇంటర్నేషనల్ టెలిఫోన్ కార్డులు వాడేవాడు.

రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్లు మెక్ డొనాల్డ్ బర్గర్స్, డిస్కోలలో సాయం కాలక్షేపాలు.

అంతేనా అంటే అంతే కాదు. డాలరు విలువతో పోల్చి రూపాయి బలహీనపడుతుంటే ఎంతో సంతోషం వేసేది. మామూలుగా పంపే డాలర్లతోనే ఇంటికి ఇంకా ఎక్కువ డబ్బు పంపొచ్చుకదా అన్న అల్పానందం.



చేతినిండా డబ్బులు. పర్సు నిండా క్రెడిట్ కార్డులు. మనసు నిండా సంతృప్తి. ఏ మనిషికయినా ఇంతకంటే ఏం కావాలి?

అటు ఇండియాలో అతడి అమ్మానాన్నా పెళ్ళికి తొందర పెడుతున్నారు. వాళ్ల కోరిక తీర్చాలనిపించింది. ఇంటికి ఫోను చేసి చెప్పాడు వీలుచేసుకుని వస్తానని. ఈలోగా అమ్మాయిని చూడమని. వున్న సెలవులు తక్కువ. అంతా పది రోజుల్లో అయిపోవాలన్నాడు. నెట్లో వెతికి ఇండియా వెళ్లి రావడానికి అతి చౌకలో టిక్కెట్లు కొనేశాడు. పనిలో పనిగా మార్కెట్లన్నీ గాలించి చుట్టపక్కాలందరికీ చిన్న చిన్న గిఫ్ట్ వస్తువులు కొన్నాడు. లేకపోతే మాట దక్కదు మరి. పొరబాటున ఎవరినయినా మర్చిపోతే ఇక అంతే సంగతులు. మాటలు కటీఫ్.


ఇంటికి రాగానే వారం రోజులు ఇంట్లోనే మఠం వేసుకు కూర్చున్నాడు. ఉదయం లేచిన దగ్గరనుంచి ఒకటే పని. అమ్మానాన్నా ఎంపికచేసిన అమ్మాయిల ఫోటోలు చూడడం. నచ్చలేదని టిక్కుబెట్టడం. చూస్తుండగానే తిరుగు ప్రయాణం తేదీ దగ్గరపడింది. దాంతో హడావిడిగా ఒక పెళ్లికూతురును సెలక్ట్ చేసుకోవాల్సి వచ్చింది.

రెండంటే రెండురోజుల్లో పెళ్లి జరిగిపోయింది. వచ్చిన వాళ్లు వచ్చారు. రానివాళ్ళు రాలేకపోయినందుకు విచారిస్తూ గ్రీటింగులు పంపారు. వాటిల్లో కొన్ని అందాయి. మరికొన్ని అతడు ఇండియా వొదిలివెళ్ళిన తరువాత చేరాయి. ‘ఇదా తను కోరుకున్న పెళ్లి. ఇదా ఇన్నాళ్ళుగా కలలు కన్న పెళ్లి.

అమెరికా జీవితాలు అంతే. నచ్చిన పిల్ల దొరకకపోతే వచ్చిన పిల్ల నచ్చిందని సరిపుచ్చుకోవాలి’


అమ్మా నాన్న చేతిలో కొంత డబ్బు పెట్టి, భార్యను తీసుకుని అమెరికా విమానమెక్కాడు.


అందరిలాగే రామం భార్య కూడా అమెరికా వైభోగం చూసి చాలా సంతోషపడింది. ప్రతి వీకెండ్ పనికట్టుకుని ఒక కొత్త ప్రదేశం చూపించాడు. కొత్త కాపురమాయే. వున్న ఇల్లు మార్చి పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.

ఆదాయంలో తేడాలేదు. తేడా అల్లా ఖర్చుల్లోనే. మునపటికీ, ఇప్పటికీ క్రెడిట్ కార్డుల భారం పెరిగింది. బ్యాంకులో బాలన్స్ తరిగింది.

మరో రెండేళ్లు గడిచాయి. ఇద్దరు పిల్లలు పుట్టారు. అమ్మానాన్నని అమెరికా పిలిపించుకోవాలన్న ఆరాటం మొదలయింది. కానీ, ఆచారం ప్రకారం పురిటికి రామం అత్తా మామా వచ్చారు. వారికి తమ వైభోగం చూపించాలనే తాపత్రయంలో అలవికి మించి ఖర్చు పెట్టాడు. ఫలితం బ్యాంక్ బాలన్స్ సున్నా అయింది. క్రెడిట్ కార్డుల భారం బాగా పెరిగింది.

ఇండియాలో రామం అమ్మానాన్నకు మనుమడినీ, మనుమరాలినీ చూడాలనే తాపత్రయం పెరిగింది. ఫోను చేసిన ప్రతిసారీ ఇండియా రమ్మనే వారు. ఉద్యోగ బాధ్యతలవల్ల కొంత, డబ్బు సమస్యవల్ల కొంత ప్రయాణం పెట్టుకోవడానికి వీలుకాలేదు. ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ ఇండియా వెళ్లి అమ్మానాన్నను చూడాలనే కోరిక ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది.

హఠాత్తుగా ఒక రోజు తల్లీతండ్రికి వొంట్లో బాగాలేదనే కబురు తెలిసింది. వెంటనే వెళ్ళడానికి ఆఫీసులో తీరుబడి లేని పని. నిజానికి వారిద్దరూ యాత్ర కు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారట. ఆ కబురు రామం చుట్టపక్కాలకు కూడా ఆలశ్యంగా తెలిసిందట. దానితో అమెరికా వరకు ఆ సమాచారం చేరేసరికి మరికొంత ఆలశ్యం జరిగింది. రామం తలిదండ్రులకు రామం ఒక్కడే సంతానం. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎవ్వరూ లేరు. అమెరికాలో కూడా ఒంటరే. ఆఫీసులో రామం పని అతడు లేనప్పుడు చూసేవారు లేరు. చేసేవారు లేరు. అందుకే ఓ పట్టాన సెలవు దొరకదు. ఇండియా పోలేక వుసూరుమనిపించినా ఆసుపత్రి ఖర్చులకు డబ్బు పంపి వూరుకోవాల్సివచ్చింది.



రోజులన్నీ ఒక్కలాగే వుండవనడానికి అమెరికా ఒక పెద్ద ఉదాహరణ. ఆర్ధిక మాంద్యం కారణంగా చేస్తున్న రామం ఉద్యోగం పోయింది. కొత్తది దొరకడం అసాధ్యంగా మారింది. కాస్తో కూస్తో కూడబెట్టింది అప్పులు తీర్చడానికి సరిపోయింది.


విధిలేని స్తితిలో ఇండియాకు తిరిగొచ్చారు. వాళ్లని చూసి రామం అమ్మా నాన్నా ఎంతో సంతోషించారు. వున్న ఒకేవొక్క బెడ్ రూమ్ వాళ్లకు ఇచ్చారు. పిల్లలు ముందు ఇబ్బంది పడ్డా తరువాత సర్డుకున్నారు. ఎందుకంటె అమెరికాలో కలికానికి కూడా దొరకని ఆపేక్షలు, అనురాగాలు వారికి ఆ ముసలివారిదగ్గర లభించాయి.

కూడబెట్టింది ఏమీ లేదు అమెరికా అనుభవం తప్ప. తండ్రి సంపాదించి కొన్న సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఒక్కటే చివరకి అవసరానికి అక్కరకు వచ్చింది.

ఎండమావి వెంట పరుగులు తీస్తే దాహం తీరదన్న నగ్న సత్యం తెలిసివచ్చింది.(18-10-2011)

(ఎన్నారై ఒకరు ఈమధ్య నెట్లో ఇంగ్లీష్ లో ఒక పోస్టింగ్ పెట్టారు. మూలాంశం అందులోనిదే. కాకపోతే ముగింపు నచ్చలేదు. కన్నబిడ్డను చూడకుండానే తలితండ్రులు చనిపోతారు. పిల్లలు అమెరికన్లను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతారు. అమెరికన్ స్వేఛ్చా జీవితానికి అలవాటుపడిన భార్య విడిపోతుంది. నిరాశావాదంతో ఆ గల్పిక ముగుస్తుంది. అందుకే కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. పేరు తెలియని ఒరిజినల్ రచయితకు మనః పూర్వక ధన్యవాదాలు – భండారు శ్రీనివాసరావు)

5 కామెంట్‌లు:

  1. @ Rao S Lakkaraju - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  2. నమస్తే శ్రీనివాస రావు గారూ,మీరు జంధ్యాల గారిపై రాసిన కబుర్లు(http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/oct10/vartavyakhya.html)కొన్ని మా వెబ్ సైట్ లో వేసుకోడానికి అనుమతి కోరుతున్నాం.ఒక్కసారి మీరు ఈ లింకులో (http://www.jandhyavandanam.com/)తొంగిచూసి మీ అభిప్రాయం తెలియచేయగోరుతున్నాం.

    నామెయిల్ ఐడీ: pappusreenu@gmail.com

    రిప్లయితొలగించండి
  3. @శ్రీనివాస్ పప్పు - 'పరవస్తు' చిన్నయసూరులు (అంటే పరాయి రచనలను సొంతం చేసుకునే వీరులన్నమాట) రాజ్యమేలుతున్న రోజుల్లో మీరిలా అనుమతి కోరడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం.'నిరభ్యంతరంగా' అని ఒక్కముక్కలో మీకు నా జవాబు.(జంధ్యాల డిగ్రీలో నాకు క్లాసుమేటు కూడా)-భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి