అనగనగా ఓ గాడిద. తన యజమాని దగ్గర ఏళ్లతరబడి గాడిద చాకిరి చేసి చేసి కొన్నేళ్లకు ముసలిదయిపోయింది. అది బాగా వున్నన్నాళ్ళు దానితో అడ్డమయిన చాకిరీ చేయించుకున్న యజమాని, గాడిద ముసలిది కాగానే దాన్ని గురించి పట్టించుకోవడం మానేశాడు. అసలు గాడిదలంటేనే జనాలకు చులకన. ఇక పని చేయలేని, పనికి పనికిరాని గాడిదలను కనుక్కునేదెవరు?
రోజులు బాగాలేని ఆ గాడిద ఓ రోజు ఇంటి దగ్గరలోని పాడుబడ్డ బావిలో పడిపోయింది. దానితో పని లేదనుకున్న ఆ గాడిద యజమానికి దాన్ని బావిలోనుంచి పైకి లాగి కాపాడడం అన్నది డబ్బు దండగ వ్యవహారం అనిపించింది. పెద్దగా ఆలోచించకుండానే అతడికి ఉభాయతారకమయిన ఉపాయం తట్టింది. పాడుపడ్డ ఆ బావిని పూడ్చాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటూ వస్తున్నా ఆ పని ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పడా బావిని మట్టితో పూడ్చేస్తే ఆ పని పూర్తిచేసినట్టూ అవుతుంది. దానితో పాటే ఆ ముసలి గాడిదను కూడా అందులో పూడ్చిపెట్టినట్టూ అవుతుంది. అలా ఆలోచించి అతగాడు ఆ పని మొదలు పెట్టాడు. పైనుంచి కూలీలు తట్టలతో మట్టిని తన మీద పోస్తున్నప్పుడు కానీ బావిలో చిక్కుకుపోయిన గాడిదకు అసలు విషయం అర్ధం కాలేదు. తను ఎట్లాగో పనులకు పనికిరాదు. అందువల్ల బావిని పూడ్చే నెపంతో యజమాని తనను వొదుల్చుకోవాలని చూస్తున్నాడు. చావు ముంచుకు రాబోతున్న విషయం అర్ధం చేసుకున్న గాడిద మరణ భయంతో గట్టిగా వోండ్ర పెట్టసాగింది. అయితే, తనది కేవలం అరణ్య రోదన అన్న విషయం కూడా దానికి త్వరలోనే బోధపడింది. ఇక తనకు చావు తప్పదు అని నిర్ణయించుకున్న తరవాత ఆ గాడిదకు వున్నట్టుండి చావు తెలివి పుట్టుకొచ్చింది. తట్టల కొద్దీ మట్టి పైనుంచి తన మీద పడ్డప్పుడల్లా గాడిద వొళ్ళు దులుపుకుంటూ కింద పేరుకుపోతున్న మట్టి కుప్పల మీదకు యెగిరి దూకడం మొదలు పెట్టింది. కూలీలు పోస్తున్న మట్టితో ఆ పాడుపడ్డ బావి నిండిపోసాగింది. మట్టి మీద పడ్డ ప్రతిసారి దాన్ని దులుపుకుంటూ మట్టి కుప్పల మీదకు దూకుతూ పైకిరావడం ఆ గాడిదకు అంత శ్రమ అనిపించలేదు. పైనుంచి ఇదంతా చూస్తున్న యజమానికి ముందు జరుగుతున్నదేమిటో అర్ధం కాలేదు. అతడికి అర్ధం అయ్యేటప్పటికల్లా ఆ గాడిద పైకే వచ్చేసింది. బతికి బయట పడ్డ గాడిద బతుకు జీవుడా అని ‘కొరగాని యజమాని కొలువుకు’ ఓ దండం పెట్టి తన దారి తాను చూసుకుంది.
నీతి: తెలివి మనుషుల సొత్తు కాదు. అడ్డగాడిదలకు కూడా తెలివితేటలుంటాయి. (30-10-2011)
NOTE: Courtesy owner of the image used in this blog.
NOTE: Courtesy owner of the image used in this blog.
అడ్డగాడిదలకు కూడా తెలివితేటలుంటాయి.
రిప్లయితొలగించండి----------
Super story.
ముసలి గాడిద భలే తెలివైనదండీ !!! మంచి కధ సరైన సమయంలో చెప్పారు.
రిప్లయితొలగించండిThanks.
ఏరు దాటాక తెప్ప తగలేసే ఆ యజమాని గాడిద కంటే నికృష్టుడు కదా.
రిప్లయితొలగించండిమీ కథని నా పత్రికలో కాపీ చేస్తున్నాను, ఏమనుకోవద్దు.
రిప్లయితొలగించండిhttp://patrika.teluguwebmedia.in
@Rao S Lakkaraju,నీహారిక,Praveen Sarma - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావ్
రిప్లయితొలగించండిటైటిల్ సంస్కృతం/ప్రాకృతంలో పెట్టి ఉంటే బాగుండేది. "గార్దభ చాతుర్యం" అనే టైటిల్ బాగుంటుంది.
రిప్లయితొలగించండి@Praveen Sarma - 'గార్ధభ చాతుర్యం'. చక్కని సూచన.
రిప్లయితొలగించండికధ చాలా బాగుందండి.
రిప్లయితొలగించండికథ కాపీ చేసేటప్పుడు టైటిల్ మార్చి వ్రాసాను గార్ధభ చాతుర్యం
రిప్లయితొలగించండిమా అన్నయ్య గారి అబ్బాయికి నిద్రపుచ్చడానికి నేను ఈ కథ వినిపించాను. ఈ కథ నువ్వే వ్రాసావా అని మా పెద్దమ్మ గారు అడిగితే నేను కాదు, శ్రీనివాసరావు గారనే ఆయన వ్రాసారని చెప్పాను.
రిప్లయితొలగించండి@Praveen mandangi - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండిఈ లింక్ చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/XtJASEfiu42
రిప్లయితొలగించండి