తెలంగాణాపై కాంగ్రెస్ తేల్చుడా ? నాన్చుడా ?
-భండారు శ్రీనివాసరావు
(06-07-2011 తేదీ ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితం)
ఏదో జరగబోతోంది అన్న భ్రమలను కల్పించి ప్రజల దృష్టిని మళ్ళించడంలో కాంగ్రెస్ నాయకులు మరోసారి తమ ప్రజ్ఞను నిరూపించుకున్నారు. గత రెండు మూడురోజులుగా రాష్ట్రంలో చక చక కదులుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించినప్పుడు ఈ అభిప్రాయం కలగకమానదు. మూకుమ్మడి రాజీనామాల పర్వం ద్వారా వారు సాధించింది ఏమిటన్న ప్రశ్న జవాబు లేకుండా మిగిలిపోయింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కించుకోలేని చందంగా వారి రాజీనామాల వ్యవహారం సాగుతోంది. 12 మంది మంత్రులు, 42 మంది శాసనసభ్యులు, 9 మంది లోకసభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుదు, 12 మంది ఎమ్మెల్సీలు ఇంత మంది, ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఒకే ఒక్క రోజున రాజీనామా చేసిన సందర్భం మన రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విషయమే. రానున్న రోజుల్లో ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశాలు కూడా వున్నాయి. అయినా ఇంత సాహసోపేతమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నా దానివల్ల వొనగూడిన ఫలితం మాత్రం అంతంత మాత్రమే కావడం వారి దురదృష్టం. తాబేలు, కుందేలు కధలో మాదిరిగా తెలుగుదేశం పార్టీ హఠాత్తుగా ఒకడుగు ముందు వేసి మూకుమ్మడి రాజీనామాలు ఇవ్వడంలో తాను ఎంతమాత్రం వెనుకబడిలేనని నిరూపించుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన రాజకీయ మైలేజి కాస్తా టీడీపీ ఖాతాలో జమ పడిపోయింది.
‘ఈ రోజు – జులై నాలుగు. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. తెలంగాణలో రైతాంగ పోరాటం చేసిన చాకలి ఐలమ్మ ప్రాణ త్యాగం చేసిన రోజు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అసువులు బాసిన రోజు ‘ అంటూ తమ రాజీనామాల నిర్ణయాన్ని మీడియాకు వెల్లడిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పంచాయతీరాజ్ శాఖామంత్రి జానారెడ్డి అభివర్ణించారు. కానీ, వీర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో తొలి ఆత్మబలిదానం చేసిన దొడ్డి కొమరయ్య మరణించిన రోజు కూడా అదే అని ఆ సీనియర్ తెలంగాణా కాంగ్రెస్ నాయకుడుకి గుర్తురాకపోవడం విచిత్రంగా వుందని కొందరు చెవులు కొరుక్కున్నారు.
కారణాలు ఏవయితేనేమి, కారకులు ఎవరయితేనేమి మొత్తం మీద తెలంగాణా ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాలు చేసి జులై నాలుగో తేదీకి మరో విశిష్టత సంపాదించి పెట్టారు.
టీ ఆర్ ఎస్ ఆవిర్భావం తరవాత రాజీనామాలనేవి నిత్యకృత్యంగా మారిపోయాయని విమర్శించేవారున్నారు. కాంగ్రెస్ వారికి కూడా కొద్దో గొప్పో ఈ అలవాటు అలవడింది. కాకపొతే వాళ్ల రాజీనామాలు ఆమోదించే స్తాయిదాకా రాకుండానే వెనక్కు తీసుకోవడం జరిగింది. 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీ అర్ధరాత్రి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన చేసిన దరిమిలా ఆ మరునాడే ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. డిసెంబర్ 23 వ తేదీన కేంద్ర హోం శాఖ చేసిన మరో ప్రకటనతో మనస్తాపం చెందిన తెలంగాణా ప్రాంతపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా మొత్తం అందరు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఇక ఇప్పడు మళ్ళీ మొన్న జూలై నాలుగో తేదీన మూడోసారి ముచ్చటగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారు. కాకపొతే ఈసారి ఆ వంతు తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులది కావడం విశేషం.
ఇక్కడ హైదరాబాదులో కాంగ్రెస్ శాసన సభ్యులు, అక్కడ ఢిల్లీ లో పార్లమెంట్ సభ్యులు రాజీనామాల సమర్పణలో చేసిన జాప్యం, పడ్డ మల్లగుల్లాలు ఆ పార్టీకి శోభస్కరంగా లేవు. ట్రాఫిక్ కారణంగా అనుకున్నా సమయానికి లోక్ సభ స్పీకర్ ను కలవలేకపోయామని చెప్పిన కారణాలు కూడా తర్కానికి నిలిచేవిగాలేవు. పైపెచ్చు వారి చిత్తశుద్దిని శంకించేవిగా పరిణమించడం వారి దురదృష్టం. రాజీనామాల విషయంలో వారిలో ఏకాభిప్రాయం కొరవడిందన్న అనుమానాలు రేకెత్తడానికి కారణం ఇదే.
మంచో చెడో తెలుగు దేశం పార్టీ మాత్రం రాజీనామాల విషయంలో ఆఖరు నిమిషంలో అయినా భేషయిన నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు షరతులతో కూడిన సవాళ్లు విసిరినప్పటికీ, కాంగ్రెస్ కంటే ముందే తమ పార్టీకి చెందిన శాసన సభ్యులందరితో రాజీనామాలు ఇప్పించి తెలంగాణా విషయంలో గతంలో ఆ పార్టీపై ముసురుకుని వున్న అనుమాన మేఘాలను కొంతవరకు తొలగించుకోవడంలో జయప్రదమయిందనే చెప్పాలి.
సరే! రాజీనామాలు ఇవ్వడం వరకు జయప్రదంగా జరిగిపోయింది. కానీ, జరగాల్సింది వారి ‘చేతి’లో లేదు. కాంగ్రెస్ అధిష్టానం సయితం సొంత పార్టీవారి ఈ ‘నిరసన’ను అంతగా పట్టించుకున్న దాఖలా కనబడం కనబడడం లేదు. రాజీనామాలకు మీడియా ఇచ్చిన ప్రాధాన్యతను కూడా అధిష్టానం ఇవ్వడం లేదు. పైపెచ్చు గులాం నబీ ఆజాద్ హైదరాబాదులో ఆడిన నిష్టూరాలనే మరో మారు ఢిల్లీలో వల్లె వేసారు. తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ‘నాన్సెన్స్’ అంటూ కొట్టివేసిన తన వ్యాఖ్యలనే అక్షరం పొల్లుపోకుండా తిరిగి అప్పచెప్పారు. తమ రాజీనామాలతో ఢిల్లీ పెద్దలు దిమ్మతిరిగి దోవకు వస్తారని తెలంగాణా కాంగ్రెస్ నాయకులు పెట్టుకున్న గంపెడు ఆశలపై కుండెడు నీళ్ళు గుమ్మరించారు. రాజీనామాలపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవడానికి ఏండ్లూ పూండ్లూ పట్టకపోయినప్పటికీ రూలు ప్రకారం పోయినా అంత త్వరగా తెమిలే వ్యవహారం కాదని నిపుణులు చెబుతున్నారు. హీనపక్షం వర్షాకాల సమావేశాల వరకు వేచిచూడక తప్పదు. అలాగే, శాసన సభ్యుల రాజీనామాలు.
మరి ఫలితం వెంటనే ఇవ్వని రాజీనామాలు ఎందుకు ఇచ్చినట్టు?
ఇందులో ఎవరి స్వలాభాలు వారికున్నాయి.
కాంగ్రెస్ వారికి ప్రజలవద్ద మొహం చెల్లుతుంది. ఛీ కొట్టిన జనం చేతనే జై కొట్టించుకునే మహత్తర అవకాశం లభిస్తుంది. అధిష్టానం తమను ప్రతి విషయంలో కించపరుస్తున్న అధిష్టానానికి ఒక ఝలక్ ఇవ్వగలిగామన్న తృప్తి మిగులుతుంది.
‘రెండు కళ్ళ సిద్ధాంతం’ తో ఆత్మరక్షణలో పడిపోయిన తెలుగు దేశం పార్టీకి తెలంగాణలో మళ్ళీ కాలు కూడ దీసుకోవడానికి వెసులుబాటు లభిస్తుంది.
‘ఇదిగో తెలంగాణా వస్తోంది, అదిగో వస్తోంది’ అంటూ ఎప్పటికప్పుడు జనాలకు నచ్చచెప్పుకోవాల్సిన పరిస్తితి తెలంగాణా రాష్ట్ర సమితిది. ఇంతపెద్ద సంఖ్యలో శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులచేత- అదీ ఇతర పార్టీలకు చెందిన వారిచేత రాజీనామాలు ఇప్పించగలిగేలా వొత్తిడి తెచ్చిన ఘనత తమదే అని చెప్పుకోవడానికి ఆ పార్టీకి వీలు చిక్కుతుంది.
ఇక - తెలంగాణా సమస్య ఇంత జటిలం కావడానికి మూలకారణమయిన కేంద్రంలోని యూ.పీ.యే. ప్రభుత్వానికి ఈ రాజీనామాల వ్యవహారం మరో విధంగా ఉపయోగపడే అవకాశం వుంది. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ పరిస్తితి చక్కదిద్దలేనంత అధ్వాన్నంగా తయారయిన సంగతి పార్టీ అధిష్టానానికి తెలియని విషయం కాదు. అలాగే, తెలంగాణా అన్నది తక్షణమే పరిష్కరించాల్సినంత ప్రాధాన్య విషయమూ కాదు. ఇవన్నీ పార్టీ అధినాయకత్వం దృష్టిలో అత్యల్ప స్వల్ప విషయాలు. ఎందుకంటె సోనియా నాయకత్వంలో వున్న కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం ఒకటే. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా ఆ పార్టీ నాయకత్వం చేయడం లేదు కూడా. 2014 తరవాత రాహుల్ గాంధీని ప్రధాని పీఠం పై ప్రతిష్టించడం ఒక్కటే ఆ పార్టీ నాయకత్వం ప్రధాన ధ్యేయం. ఆ లక్ష్య సాధనలో తెలంగాణా అంశం ఉపయోగపడుతుందని అంచనాకు వచ్చిన వెంటనే పార్టీ అధిష్టానం పచ్చ జెండా వూపుతుంది. అలా జరిగే అవకాశాలు శూన్యం అనుకున్నప్పుడు ప్రజాభీష్టాన్ని కూడా తోసిరాజని తెలంగాణా అంశాన్ని ఆటకెక్కించడం తధ్యం. రాష్ట్ర విభజన అంశం పరిశీలించేటప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి పెట్టేది ఈ కోణం నుంచే. యెలా చేస్తే ఎక్కువ లోక సభ స్తానాలు గెలుచుకోవడానికి వీలుంటుంది అన్న ఒక్క లెక్క పైనే అన్ని లెక్కలు ఆధారపడివుంటాయి.
ఈ లెక్క తేలగానే అన్నీ తేలిపోతాయి. అది తేలనంతవరకు ప్రస్తుతం సాగుతున్న నాన్చుడు వ్యవహారమే మరికొంత కాలం సాగుతుంది. రాష్ట్రపతి పాలనలు, స్పెషల్ పాకేజీలు రంగప్రవేశం చేస్తాయి.ఎన్నికలకు నిండా మూడేళ్ళ వ్యవధానం వున్న యే అధికార పార్టీ అయినా ఇలానే ఆలోచిస్తుంది. ఎన్నికలప్పుడు చూసుకుందాంలే!
అన్న ధీమాతో ముందుకు అడుగేస్తుంది. ఇక రాజీనామాలా? వాటి పరిష్కారానికి వెయ్యి మార్గాలున్నాయి. బుజ్జగింపులు, లాలింపులు, ఝాడింపులు, బెదిరింపులు. సామదానబేధదండోపాయాలతో సాధించరానిదేదీ లేదన్న సూక్తి రాజకీయాల్లో వున్నవారికి తెలియనిదేమీ కాదుకదా.
అంతవరకూ ఆందోళన బాటలో ప్రజా సంఘాలు, రాజకీయ ప్రయోజనాలు దక్కించుకునే పనిలో రాజకీయ పార్టీలు తలమునకలుగా వుంటాయి. ఒకరిపై మరొకరు ప్రయోగించుకోవడానికి తగినన్ని అస్త్రశస్త్రాలు వారి అంబుల పొదిలో ఎప్పుడూ సిద్ధంగానే వుంటాయి. ఎత్తులు పై ఎత్తులతో వాళ్లు బిజీ. చిక్కులు, చీకాకులతో జనం బిజీ.
అయినా ఎన్నికలు దూరంగా వున్నప్పుడు జనాన్ని దగ్గరకు తీయడం రాజకీయులకు ఇంటావంటా లేని పని. (05-07-2011)
రాజీనామా చేసినోళ్ళని మళ్ళీ గెలిపించుకుంటాము అని తె.ఐకాస aka తెరాస ఇస్తున్న హామీ ఎలా కుదురుతుంది? కాంగ్రెస్, తెదెపా, బిజెపి MLA/MPల స్థానాల్లో తెరాస కాని, మరే ఇతర పార్టీ కాని తెలంగాణాలో పోటీ చేయదనేగా దీనర్థం? ఒకవేళ అదే జరిగితే తెరాసకు వచ్చే సీట్లెన్ని? ఆ సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందా? ఇదంతా కిరికిరిలా వుంది.
రిప్లయితొలగించండి@అజ్ఞాత - అందరూ మాటలతో మభ్య పెట్టేవాళ్ళే. ఆ మాటలు జనం నమ్ముతూ వున్నంత కాలం వాళ్ల మాటలు ఇలాగే కోటలు దాటుతుంటాయి.-భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండి