13, మే 2011, శుక్రవారం

ఇది నిజం. నిజంగా నిజం – భండారు శ్రీనివాసరావు

ఇది నిజం. నిజంగా నిజం – భండారు శ్రీనివాసరావు




‘నేను చదువుకున్నవాడినన్న మాటే కాని నీకున్న ప్రపంచ జ్ఞానం నాకు లేదు’ అని ఈ మధ్య టీవీలో చూసిన ఓ సినిమాలో నిజాయితీగా వొప్పుకుంటుందొక మగ పాత్ర తన భార్యతో మాట్లాడుతూ.

క్షేత్రస్తాయి సమాచారం తెలుసుకోకుండా టీవీ చర్చల్లో పాల్గొనే కుహనా మేధావులనుంచి కూడా ఈ మాదిరి నిజాయితీని ఆశించడంలో తప్పులేదేమో. ఇప్పటికయినా వారి కళ్లు తెరిపిళ్లు పడివుంటాయేమో.

వీళ్ళతో వచ్చిన చిక్కేమిటంటే - వీళ్ళు తమ వాదమే వేదమనుకుంటారు. దాన్నే జనమంతా నమ్మాలనుకుంటారు.

కొన్నేళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. ఓ పెళ్ళిలో బాగా ఎరిగున్న ఓ ముసలావిడ కనిపించింది. ఎప్పుడు తారసపడ్డా ‘దేవుడికి నామీద దయకలగడంలేదల్లే వుంది. ఇంకెన్నాళ్లిలా బతకాలని రాసిపెట్టాడో!’ అని నిర్వేదంగా మాట్లాడుతుండేది. అలాటిది ఆరోజు ‘మరో నాలుగేళ్ళు బతికితే బాగుండు’ అనడం ఎంతో వింతగా అనిపించింది. ‘ఎందుకవ్వా?’ అనడిగితే ‘మరొక్కసారి ఆఖరుసారి వోటు వేసి చనిపోవాలనివుంద’న్నది. అదేమీ ఆశ్చర్యం కలిగించేది కాదు. ఎందుకంటే, స్వతంత్రం వచ్చినప్పటినుంచి ఆవిడ వోటు వెయ్యకుండా వున్న సందర్భం లేదు. ఆవిడది కాంగ్రెస్ కుటుంబం. ఆమె వొంట్లో పారేది కాంగ్రెస్ రక్తం. జనతా పార్టీ ప్రభంజనం, ఎన్టీయార్ సుడిగాలి వీస్తున్న రోజుల్లో కూడా ఆవిడ వోటు కాంగ్రెస్ కే. అభ్యర్ధి ఎవరన్నది అనవసరం. కాడి జోడెడ్ల గుర్తు నుంచి ఆవు దూడా గుర్తుకు, అక్కడినుంచి చేతి గుర్తుకు- ఆ పార్టీ గుర్తు మారిపోవడం గుర్తు పెట్టుకుని మరీ వోటు వేసేది. ఆమె గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఇది.

కానీ, ఆమె గురించి పూర్తిగా తెలియదన్న సంగతి మాత్రం ఆరోజు మాటల్లో బయట పడింది. ఈ మూడేళ్ళు ఎట్టాగో బతికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు వోటు ‘వెయ్యకుండా’ చనిపోవాలన్నది తన ఆఖరు కోరిక అని చెప్పినప్పుడు అక్కడ వున్న వాళ్ళందరం ఆశ్చర్యపోయాము. రాజశేఖరరెడ్డి చనిపోయినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా తయారయిందని, ఇక చస్తే ఆ పార్టీకి వోటు వెయ్యననీ ఖరాఖండిగా తేల్చిచెప్పింది. అప్పటికి వై ఎస్ జగన్ మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీని వొదిలి పెట్టనూ లేదు. కొత్త పార్టీ పెట్టనూ లేదు. కాకపొతే, ఆయన తలపెట్టిన ఓదార్పు యాత్ర గురించి పార్టీలో నానా రభస సాగుతున్న రోజులవి.

కాంగ్రెస్ కు వోటు వెయ్యకుండా చనిపోవాలనివుందని ఆ ముసలావిడ చెప్పిన మాట రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితికి అద్దం పడుతోంది. కానీ, దురదృష్టం, సాధారణ జనంలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కారణరహితంగా అభిమానించే వారిలో వచ్చిన ఈ మార్పుని గమనించకుండా ఇటు రాష్ట్ర స్తాయిలోనూ, అటు కేంద్రంలోనూ వున్న ఆ పార్టీ నాయకులు ఒంటెత్తు పోకడలకు పోయారు. దరిమిలా పార్టీ పట్ల ప్రజల్లో ఏర్పడ్డ ఏహ్యతే కడప ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది.(13-05-2011)



4 కామెంట్‌లు: