15, ఏప్రిల్ 2011, శుక్రవారం

బాబా బందీనా ! – భండారు శ్రీనివాసరావు

బాబా బందీనా ! – భండారు శ్రీనివాసరావు
భక్త సులభుడయిన భగవంతుడు ఎప్పుడూ భక్తులకు బందీనే. పురాణ కాలం నుంచీ ఈ సత్యం ఎప్పటికప్పుడు రుజువవుతూనే వచ్చింది. కానీ ఇది కలికాలం కదా. దేవుడినే బంధించి పబ్బం గడుపుకోవాలనే భజన బృందం బయలుదేరింది. అక్కడ పుట్టపర్తిలోను ఇదే కధ. తిరుపతిలోను ఆ దేవదేవుడిది అదే కధ. నలుగురు నమ్మి చేరే ప్రతిచోటా ఇదే కధ.
ఎంత ఆస్తికులయినా అయినా పుట్టపర్తికి సంబంధించి నాస్తికులుగా మారడానికి బాబా చుట్టూ అస్తమానం చుట్టు ముట్టి వుండే పరిజనమే కారణం అని నా నమ్మకం. క్రమశిక్షణ పేరుతొ అటు బాబాను, ఇటు భక్తులను ఏకకాలంలో ‘బందీలను’ చేసేసారు. పదేళ్లక్రితం అనుకుంటా పుట్టపర్తిలో చక్రం తిప్పే ఓ పెద్ద ఆసామీని నిలదీసాను. పూర్వాశ్రమంలో ఆయనో పెద్ద అధికారి. బాబా పేరుతొ ఈ దిగ్బంధనాలేమిటని ప్రశ్నించాను. ఆయన సమాధానం ఆయన అహంకారానికి అద్దం పట్టేదిలావుంది. అప్పటినుంచి బాబాను పుట్టపర్తి నుంచి బయటకు తెచ్చి నా మనసు వరకే పరిమితం చేసాను. బహుశా ఇప్పుడు పుట్టపర్తినుంచి వస్తున్న వార్తలు వింటుంటే బాబాను నమ్మే ప్రతి వ్యక్తీ బాబాకు తమ గుండెల్లో చోటిచ్చి కాపాడుకుంటే మంచిదనిపిస్తోంది. ఎందుకంటె ఆయన చుట్టూ వున్నవారికి ఆయన అక్కరలేదు. ఆయన పేరు కావాలి. ఆ పేరుతొ వచ్చే పేరు ప్రతిష్టలు కావాలి. తద్వారా సమకూడే సంపదలు కావాలి. అయాచితంగా లభించే అధికారం కావాలి. బాబా అందరికీ దేవుడు కావచ్చేమో కానీ వారికి మాత్రం కాసులు కురిపించే దేవుడు.
ఈ పరాన్నభుక్కులు ఆధ్యాత్మిక రంగం లోనే కాదు అన్నిచోట్లా కనిపిస్తుంటారు. మంత్రులు, ప్రధాన మంత్రులు. ముఖ్య మంత్రులు, ఉన్నతాధికారులు అందరి చుట్టూ వీరే. కాకపోతే, పదవి దిగిపోయేదాకా వీరి నిజ స్వరూపం అసలు వారికి కనిపించదు. ఎందుకంటె, అప్పటివరకు జనం అనుకునే మాటలు వారి చెవులకు చేరకుండా చూస్తారు. వాస్తవాలు వారి కళ్ళకు కనబడకుండా చేస్తారు. ఇలాటి విషయాలలో మాత్రం వీళ్ళు భగవంతుడినీ, బాబాలను మించిన శక్తివంతులే.(15-04-2011)

   

2 కామెంట్‌లు:

  1. బాబా ని నేను ఒక phylosophy తెలిసిన వ్యక్తిగానో లేక ఒక సామాజిక సేవకుడిగానో గౌరవంగా చూస్తాను కాని దేవుడని మాత్రం నమ్మను. ఎందుకంటే భగవంతునికి తనని ఎవరు ఎందుకు కొలుస్తున్నారో తెలుస్తుంది. మరి బాబాకి తన చుట్టు ఉన్నవాళ్ళలో ఎవరు ధనదాసులో తెలుసుకుని వారికి తగిన బుధ్ధి చెప్పగలగాలి కదా. అలా చేయలేకపోతున్నాడంటే అతనూ ఓ మానవమాత్రుడే కదా. మానవ రూపం ధరించిన దేవునికి, దేవుని అవతారం ఎక్కించుకున్న బాబాలకి పోలిక పెట్టొద్దు ప్లీజ్.

    రిప్లయితొలగించండి