3, ఫిబ్రవరి 2011, గురువారం

వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం – భండారు శ్రీనివాసరావు


వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం – భండారు శ్రీనివాసరావు

అనేక రకాల రుగ్మతలతో బాధ పడుతున్న రోగిలా వుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి. రోగనిదానానికి పార్టీ అధిష్టానం తీసుకుంటున్న చర్యలు ‘వ్యాధి కంటే చికిత్స’ ప్రమాదకరమన్న తీరులో సాగుతున్నాయి. అటు తెలంగాణా అంశం, ఇటు జగన్ జగడం కాంగ్రెస్ వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సమస్యకు మూలాన్ని స్వయంగా నిర్ధారించుకోకుండా కేవలం తమకు అందిన సమాచారంతోనో లేదా అందుతున్న వివరాలతోనో ఢిల్లీ నుంచి చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయే కానీ ఫలిస్తున్న దాఖలాలు ఎక్కడా కానరావడం లేదు. శారీరక రుగ్మతలు అనేకం అయినప్పుడు ఒక దానికి చేసే వైద్యం మరో జబ్బుని ప్రకోపింపచేసినట్టు, ఒక సమస్యకు పరిష్కారం అనుకున్నది మరో సమస్యకు ఆజ్యం పోస్తున్నది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ‘చిరంజీవి-వెంకటస్వామి’ వ్యవహారమే.


రాజశేఖరరెడ్డి మొదటి అయిదేళ్ళ హయాములో ఢిల్లీ అధిష్టాన దేవతలు రాష్ట్రం వైపు అంతగా దృష్టి సారించలేదు. అనుదిన వ్యవహారాలలో అధిష్టానం జోక్యం అంతంత మాత్రంగానే వుండేది. అసంతృప్తులు లేవనీ చెప్పలేముకానీ అవి అదుపు చేయలేని పరిమితులు దాటిపోలేదు. దీనికి రాజశేఖరరెడ్డి రాజకీయచతురత కొంతవరకు దోహదపడివుండవచ్చు. అయితే - సోనియా పట్ల సాధారణ ప్రజల అభిప్రాయం సానుకూలంగా మారడానికి ఈ వాతావరణం ఉపయోగడిందనే చెప్పాలి. రెండో పర్యాయం రాష్ట్రంలో కాంగ్రెస్ అదికారం అధికారం లోకి రావడానికి సాయపడిన అంశాలలో ఇది కూడా ఒకటి. అత్తగారు ఇందిరాగాంధీ కంటే కోడలు సోనియా చాలా నయం అన్న భావన క్రమంగా ప్రబలుతున్న సమయంలో హటాత్తుగా వైఎస్సార్ హెలికాప్టర్ దుర్ఘటనలో కన్నుమూయడంతో, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలపై లోగడ వున్న పాత పట్టును తిరిగి చేజిక్కించుకోవాలన్న ప్రబలమయిన కాంక్ష ఢిల్లీ పెద్దలకు కలిగినట్టుగా తదనంతర పరిణామాలు సూచిస్తున్నాయి. గతంలో మాదిరిగా స్వల్ప కాలంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులను నామినేట్ చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను తమ చెప్పుచేతల్లో వుంచుకోవడానికి అధిష్టానవర్గం మళ్ళీ నడుం కట్టిన సూచనలు కానవస్తున్నాయి. మచ్చలేని ప్రధానిగా మన్మోహన్ సింగ్, పేను పెత్తనం చేయని కాంగ్రెస్ అద్యక్షురాలిగా సోనియా గాంధీ - అయిదేళ్ళ క్రితం జనబాహుళ్యంలో సంపాదించుకున్న మంచి మార్కులన్నీ, ఇటీవలికాలంలో కలికానికి కూడా కానరాకుండా పోయాయి. షరా మామూలు కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు రాష్ట్రంలో తిరిగి తెరతీశారు. వాస్తవ పరిస్తితులను పరిగణనలోకి తీసుకోకుండా, తమ కందిన సమాచారం ప్రాతిపదికపైనే నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం మళ్ళీ మొదలయింది. శాశ్విత పరిష్కారాలను కనుగొనడం కన్నా తాత్కాలిక ఉపశమనాల పట్లే శ్రద్ధ పెరిగింది. ముడులు విప్పే క్రమంలో కొత్త ముళ్లు పడుతున్న విషయం గమనించకపోవడం వల్ల సరికొత్త చిక్కులు తలెత్తుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరూ ప్రతి అంశం మీద తమదయిన శైలిలో వ్యాఖ్యానాలు చేయడం పరిస్తితిని మరింత గందరగోళపరుస్తోంది. కొద్దికాలం క్రితం పరస్పరం పొగుడుకున్న నాలుకలతోనే ఇప్పుడు ఎందుకు తెగుడుకుంటున్నారో ఎవరికీ అర్ధం కాని స్తితి.

కొద్దిరోజులక్రితం వరకు మిత్రులుగా మసలిన వాళ్ళు ఇప్పుడు కత్తులు నూరుతూ కుత్తుకలు కోసుకోవడానికి ఎందుకు ముందుకు దూకుతున్నారో తెలియక కాంగ్రెస్ కార్యకర్తలే సిగ్గుపడుతున్న దుస్తితి. పదవిలో వున్నప్పుడు వెన్నంటివుండే భజన బృందం ఆ పదవిపోగానే కనుమరుగయిపోతుందన్న నగ్న సత్యం, అధికారంలో వున్నంతకాలం అధినాయకులెవరికీ బోధపడకపోవడం మరో విచిత్రమయిన పరిస్తితి.

అనుదినం మీడియాలో హోరెత్తిపోతున్న విషయాలే కనుక వీటిపై మరింత వివరణ ఇవ్వడం కూడా అనవసరం. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్న మీమాంసకు తావులేదు. ఎందుకంటే తమ అభిప్రాయాలకు దన్నుగా వారు వినిపిస్తున్న వాదనలు కొండొకచో పరస్పరవిరుద్ధంగా వుంటున్నాయి. వీటిని వేలెత్తి చూపడం అంతకంటే అనవసరం. వారు తెలియక మాట్లాడుతున్నారన్న అనుమానం అక్కరలేదు. కావాలని చేసే వాదనలకు వాస్తవమయిన పునాదులు వుండవు. అలా చేసే వ్యాఖ్యలను ఎవరికి తోచిన రీతిలో వారు అన్వయించుకోవచ్చు. అదే ఇప్పుడు జరుగుతోంది. తాము చెప్పింది జనం నమ్ముతున్నారా లేదా అన్న విషయంతో వారికి నిమిత్తం వున్నట్టులేదు. చెప్పుకుంటూ పోవడమే తమ కర్తవ్యంగా ముందుకు పోతున్నారు. ఉదయం చెప్పినదానికి సాయంత్రం అన్నదానికి పొంతన వుందా లేదా అన్నది వారికి అనవసరం. రాజకీయ అవసరమే వారి తక్షణ అవసరం. ఇందుకు ఎవరూ మినహాయింపు కారు. జవాబుదారీతనం లోపించిన రాజకీయం ఇప్పుడు తెలుగునాట రాజ్యమేలుతోంది. ఈ నేపధ్యంలో నైతికత గురించి మాట్లాడడం గొంగడిలో తింటూ వెంట్రుకలు ఏరుకున్న సామెతను గుర్తు చేసుకోవడమే అవుతుంది.

అవకాశవాదం ముందు ఏ వాదం నిలవదు. ఈ నాటి రాజకీయాలకు అదే ప్రధాన ప్రాతిపదిక అవుతుండడమే విషాదం. గతంలో అవకాశవాద రాజకీయాలు వున్నప్పటికీ ఇంత నిస్సిగ్గుగా వాటిని రాజకీయులు అనుసరించలేదు. నమ్మిన సిద్ధాంతాలకు నీళ్ళు వొదులు కావడానికీ, పార్టీలు మార్చడానికీ కొంత వ్యవధానం తీసుకునేవారు. కొన్ని మర్యాదలు పాటించేవారు. ఇప్పుడా తీరిక ఎవరికీ వున్నట్టులేదు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్టుగా ఏపూటకాపూటే పరగడుపు. నిన్న ఏమి చెప్పాము? ఈ రోజు ఏమి చెబుతున్నాం? రేపేం మాట్ల్లడబోతున్నాం? అన్న స్పృహతో నిమిత్తం లేదు. ఏదో ఒక రాజకీయ పదవిలో కొనసాగుతున్నవారిది ఒక ధోరణి అయితే దానికి దూరంగా వున్నవారిది మరో దారి. పదవుల ఆరాటం తప్ప విలువల యావ ఎవరికీ లేదు. ఎదుటివాడిని ఇరకాటంలో పెట్టాలనుకున్నప్పుడే పాత సంగతులు కొత్తగా గుర్తుకు వస్తాయి. రాష్ట్ర రాజకీయ అవనికపై చకచకా కదులుతున్న దృశ్యాలు ఈ విషయాలనే మరోమారు కళ్ళ ముందు వుంచుతున్నాయి.

చిరంజీవిని దగ్గరకు తీసి, సీమాంధ్ర లో జగన్ మోహనరెడ్డికి కళ్ళెం వేయాలనే ఆలోచనలో వున్న అధిష్టానం- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను విశ్వాసంలోకి తీసుకోకుండా, వారితో విస్తృత స్తాయిలో చర్చలు జరపకుండా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే ధోరణిలో వ్యవహరించడం ఢిల్లీ పెద్దల దాష్టీకానికి నిదర్శనంగా కొందరు భావిస్తున్నారు. అధిష్టానం పనుపుపై కేంద్రమంత్రి, కోర్ కమిటీ సభ్యుడు ఆంటోనీ హైదరాబాద్ వచ్చి నేరుగా చిరంజీవితో జరిపినచర్చల సారాంశం కూడా తమకు తెలియకుండా చేసినందుకు రాష్ట్ర కాంగ్రెస్ లో కొందరు నాయకులు గుర్రుగా వున్నారు. మరో పార్టీని ఏకంగా విలీనం చేసుకోవడం అనే కీలక విషయంలో తమపట్ల అధిష్టానం అంటీ ముట్టని వైఖరి ప్రదర్శిస్తూ వుండడం, ఒకవేళ అదే జరిగితే తమ కేడర్ కు ఎలా నచ్చచెప్పుకోవాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్న వారిని అధిష్టానం ధోరణి మరింత అయోమయంలోకి నెడుతోంది.  పైకి అందరూ కోరస్ గా అధిష్టానం వేస్తున్న అడుగులు సరయినవే అని ప్రకటనలు గుప్పిస్తున్నా – లోలోపల రగిలిపోతున్న దాఖలాలు ప్రైవేట్ సంభాషణల్లో స్పష్టంగా కనబడుతున్నాయి. పీ ఆర్ పీ ని కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటున్నారా లేక ఈ ఎత్తుగడలన్నీ పొత్తువరకే పరిమితమా అన్న విషయంలో స్పష్టత కనబరచకుండా, తమని అయోమయంలో వుంచడం వారిని బాధిస్తోంది. అయినా అధిష్టానాన్ని ప్రశ్నించలేని పరిస్తితి వారిది. కానీ, పొత్తయినా, విలీనం అయినా కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా తమ ఎదుగుదలకు, భవిష్యత్ అవకాశాలకు ఆ పరిణామం గండికొట్టగలదన్న భీతి మాత్రం సీనియర్లను వెంటాడుతోంది. పదవుల పందేరంలో వెనుకబడిపోతున్నవారి పరిస్తితి మరీ ఘోరం. కొత్తవారికి పెద్ద పీట వేసే పరిస్తితే ఎదురయితే – తమ స్తితి ‘అయినవాళ్లకు ఆకుల్లో, కానివాళ్లకు కంచాల్లో’ అన్న సామెత చందాన కాగలదని వారి భయం.

ఈ పరిణామాలేవీ పార్టీకి మంచి చేయవని తెలిసికూడా ఎందుకిలా అధిష్టానం ప్రవర్తిస్తోందని విశ్లేషించుకుంటే ఒకే సమాధానం తడుతోంది. ప్రజల్లో పలచన అవుతున్నాం అని తెలిసి తెలిసి ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించుకుంటే ఒకే జవాబు మిగులుతోంది. అదే ఎన్నికలకు మిగిలివున్న మూడేళ్ళ వ్యవధానం. అప్పటివరకు తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా. మూడేళ్ళలోగా ఇల్లు సర్డుకోలేకపోతామా అన్న ధైర్యం. ఇక ఇవేవీ పనిచేయవనుకుంటే, పరిస్థితులు చేయిదాటిపోయే తరుణమే వస్తే, కొన్నాళ్ళు రాష్ట్రపతి పాలన విధింఛి, చేజారిన పరిస్తితులను తమ చేతిలోకి తిరిగి తెచ్చుకునేలా చేయగల ‘అంతిమ అధికారం’ తన గుప్పిటిలోనే వుందన్న భరోసా. అదే కాంగ్రెస్ చేత ఇన్ని ‘కాని’ పనులు చేయిస్తోంది. (04-02-2011)

2 కామెంట్‌లు:

  1. Nice analysis!.

    Sonia and PM are like the "King with out cloths".

    Indian people know that the two heading the most corrupt rule. But their followers don't agree that.

    They attribute all the corruption to "other" people, and attribute all good deeds to "Sonia and PM".

    But the Indian people know it well, who is corrupt and inefficient.

    రిప్లయితొలగించండి
  2. ఎమైనా చెప్పండి, రాష్ట్ర కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. కుక్కమూతిపిందెల్లాంటి ప్రరాపాలను దేబరిస్తోంది. విషవృక్షం కూలితే రాష్ట్రప్రజలకు శుభపరిణామం. ఇగబోతే, కాకా. గీయన 40ఏడ్లబట్టి షేస్తోండు ఏంటి? గదే, షేవ కాని ఎక్కడో కాలింది. :)

    రిప్లయితొలగించండి