16, జనవరి 2011, ఆదివారం

వినదగునెవ్వరు చెప్పిన -భండారు శ్రీనివాసరావు

వినదగునెవ్వరు చెప్పిన -భండారు శ్రీనివాసరావు


ఇద్దరు వ్యక్తుల నడుమ అనుమాన బీజం నాటుకోవడానికి ఒక్క క్షణం చాలు. కానీ వారిద్దరు కలసి గడిపిన రోజుల్లోని అనేక మధుర క్షణాలను ఆ ఒక్క క్షణమే తక్షణం మరచిపోయేలా చేస్తుంది.


మిమ్మల్ని పట్టించుకోని ఎవరినీ బాధ పెట్టడం సరికాదు. అలాగే, మీతో ఎంతమాత్రం సంబంధం లేనివాడు మిమ్మల్ని బాధ పెడుతుంటే వూరుకోవడం కూడా సమంజసం కాదు.


జీవితం అనేది పిల్లీ ఎలుకా నడుమ సాగే పరుగు పందెం లాటిది. ఈ పోరులో తరచుగా చిట్టెలుకదే పై చేయి కావడం కార్టూన్ సినిమాల్లో చూస్తుంటాము. పిల్లి అస్తమానం ఆహారం కోసం వెంపర్లాడుతుంటే – ఎలుక ప్రాణాలు దక్కించుకోవడం ఎలా అని చూస్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే – అవసరం కన్నా పరమార్ధం ముఖ్యం అని.


మనకు నచ్చని అనేక అవలక్షణాలు ఇతరుల్లో వుంటే వుండవచ్చుగాక. వాటిని గురించి ఏమాత్రం పట్టించుకోవద్దు. క్షమించి వొదిలేయడం ఉత్తమం. కానీ అవే లక్షణాలు మీలో వుంటే మాత్రం వాటిని మన్నించి వూరుకోవడం ఎంతమాత్రం క్షేమం కాదు.


చుట్టూ తెలివితక్కువ వాళ్ళను పెట్టుకొని తెలివిగలవాళ్ళం అనిపించుకోవడం గొప్పకాదు. పైగా అలాటి వారితోనే అస్తమానం కాలం గడుపుతుంటే కొన్నాళ్ళకు వున్న తెలివి కూడా తెల్లారిపోయే ప్రమాదం వుంది. గొప్పవాళ్ళ సాంగత్యంలో వుంటే కొద్దో గొప్పో ఆ గొప్పదనం మనకూ లభించే అవకాశం వుంటుంది.


భావోద్రేకాలు అనేవి దేముడు మనిషికి ప్రసాదించిన విలువయిన వరాలు. వాటిని జాగ్రత్తగా వాడుకోలేకపోతే ఆ అమూల్య వరాలే భయంకర శాపాలుగా మారిపోతాయి.


విశ్వాసం అన్నింటినీ సుసాధ్యం చేస్తుంది. ఆశ అన్నిటినీ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. ప్రేమ యావత్ ప్రపంచాన్ని అందంగా కళ్ళ ఎదుట ఆవిష్కరిస్తుంది. ఈ మూడూ తోడుంటే – జీవితంలో ప్రతిరోజూ అద్భుతంగా గడిచిపోతుంది.


రెండు చేతుల్లో రాళ్ళు పట్టుకుని వుంటే మీ గుప్పిళ్ళలో మిగిలేవి ఆ రాళ్ళే. ఎందుకంటె ఎంతో విలువయిన వజ్రాలు అందుబాటులోకి వచ్చినా అందుకోవడానికి మీ చేతులు ఖాళీగా వుండవు.


జరిగినదానిని తలచుకుని చింతించడం అంటే కుమిలే గుండెని మరింత బాధపెట్టడమే. జీవితంపట్ల నమ్మకాన్నిపోగొట్టుకోవడమే.

అందుకే, నిన్న జరిగిన వాటినుంచి మనసును మళ్ళించుకోవాలి. రేపటి గురించిన భయాలను వొదుల్చుకోవాలి. ఈ రోజు నుంచి ప్రశాంతతను స్వీకరించాలి.


చిన్న తాళం చెవితో పెద్ద తాళాన్ని తెరవగలుగుతున్నట్టే - చిరునవ్వుతో ఇతరుల హృదయాలలో సుస్తిర స్తానాన్ని సంపాదించుకోవచ్చు.


గురి మీద గురిపెట్టి వుంచాలి. సూర్యకిరణానికి ఎంతటి తేజస్సు వున్నా- ఒక్క బిందువు మీద ఆ శక్తిని కేంద్రీకరించని పక్షంలో మామూలు కాగితాన్ని సయితం అది కాల్చలేదు.


ఇతరులతో పోల్చుకోవడం, లేని పోని దానిని ఆశించడం – అనే రెండింటిని వొదులుకోగలిగితే, జీవితంలో గెలుపు సొంతం అవుతుంది.


సీతాకోకచిలుక జీవించేది కేవలం పదునాలుగు రోజులే. అయితేనేమి? ఆ స్వల్ప వ్యవధిలోనే అది ప్రతిరోజునీ ఆస్వాదిస్తుంది. హాయిగా అందంగా ఆనందంగా ఎగురుతుంది. అందరి హృదయాలను చూరగొంటుంది. మనిషి జీవితంలో కూడా ప్రతి క్షణం అమూల్యమైనదే. దాన్ని ఆమూలాగ్రం ఆనందించగలగాలి. ఇతరులను ఆనందింపచేయాలి.


జీవితంలో అత్యంత ఉత్తమ క్షణాలను సొంతం చేసుకోవడానికి ఏదయినా సరే వొదులుకోండి. కానీ దేనికోసమో మీ జీవితంలోని ఉత్తమ క్షణాలను మాత్రం వొదులుకోకండి.


అపజయాలకు కొన్ని కారణాలు వుంటాయి. మామిడి చెట్టు కింద నిల్చుని యాపిల్ పండు కోరుకుంటే ఎలా? కోరికనన్నా మార్చుకోవాలి. లేదా సరయిన చెట్టు కింద అయినా నిలబడాలి.


అన్ని విషయాలను గురించి సరయిన అవగాహన వున్నవాళ్ళే తమకు తెలిసింది చాలా తక్కువ అని వొప్పుకుంటారు.


ఆర్ధిక శాస్త్రాన్ని ఆపోసన పట్టిన పిల్లవాడే తండ్రి వ్యాపారాన్ని తొందరగా దివాళా తీయించగలుగుతాడు.


మూర్కుడు చిట్టచివర చేస్తే తెలివయినవాడు మొట్టమొదటే చేస్తాడు. (16-01-2011)

1 కామెంట్‌:

  1. "చిన్న తాళం చెవితో పెద్ద తాళాన్ని తెరవగలుగుతున్నట్టే - చిరునవ్వుతో ఇతరుల హృదయాలలో సుస్తిర స్తానాన్ని సంపాదించుకోవచ్చు."
    ఇంకొంచం పెద్ద తాళం చెవితో ప్రపంచాన్నే గెలవవచ్చు.

    రిప్లయితొలగించండి