24, అక్టోబర్ 2010, ఆదివారం

రేడియో వార్తల వెనుక వ్యక్తులు - భండారు శ్రీనివాసరావు

మూన్నెళ్ల విదేశీ ప్రవాసం - హైదరాబాద్ వచ్చిన తర్వాత బ్లాగుపై అంతగా దృష్టి పెట్టలేదు. అప్పుడప్పుడూ రాసినా అవసరార్ధమే. ఎవరయినా పత్రికలవాళ్ళు అడిగినప్పుడు రాసినవే బ్లాగులో పెడుతూ వచ్చాను.

 ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన ‘ఆకాశవాణి’ వార్తలు చదువుతున్నది " కూడా నిజానికి మాగాయ సరుకే. అంటే, లోగడ ఎప్పుడో ప్రెస్ అకాడమీ శిక్షణ తరగతులకోసం రాసుకున్న ప్రసంగ వ్యాసం నుంచి తీసుకున్న 'ఎత్తిపోతల పధకం' అన్నమాట.  

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది - అని బ్లాగులో రాయగానే అనూహ్య స్పందన వచ్చింది. రేడియో మీద జనాలకువున్న అవ్యాజ ఆదరణ చూసి దానికి కొనసాగింపుగా మరికొన్ని వివరాలు అందిస్తే బాగుంటుందనిపించింది.

తెలుగు రేడియో న్యూస్ రీడర్లు గురించిన కొంత సమాచారం.

న్యూ ఢిల్లీ నుంచి – కపిల కాశీపతి, కలపటపు రామగోపాలరావు, వారణాసి సుబ్రహ్మణ్యం, కొంగర జగ్గయ్య, పన్యాల రంగనాధరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల పూర్ణయ్య, జె.మంగమ్మ, తిరుమలశెట్టి శ్రీరాములు, మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, సూర్యదేవర ప్రసన్నకుమార్, రాజశ్రీ, బుచ్చిరెడ్డి (అతి స్వల్ప కాలం), గోపరాజు లక్ష్మి.

ప్రముఖ రచయిత శ్రీపతి (అసలు పేరు పుల్లట్ల చలపతిరావు) కూడా దాదాపు దశాబ్దంపాటు ఢిల్లీలో కాజువల్ న్యూస్ రీడర్ గా పనిచేశారు.

పెద్దవిశేషమేమిటంటే మహాకవి శ్రీ శ్రీ సయితం కొద్దికాలం ఢిల్లీ ఆకాశవాణి తెలుగు విభాగంలో పనిచేశారు. ఆయన కూడా తెలుగులో వార్తలు చదివినట్టు అనౌన్స్సర్ల సంఘం ఇటీవల వాచస్పతి పేరుతొ ప్రచురించిన ప్రత్యెక సంచికలో పేర్కొన్నారు.

నిర్వహణ కారణాల రీత్యా న్యూ ఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే తెలుగు వార్తలను కూడా హైదరాబాద్ కేంద్రానికి బదిలీ చేయడం వల్ల అక్కడి న్యూస్ రీడర్లు కూడా ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వార్తలు చదువుతున్నారు.

హైదరాబాద్ నుంచి ఢిల్లీ వార్తలు చదువుతున్నది- యండ్రపాటి మాధవీ లత, సమ్మెట నాగమల్లేశ్వర రావు, గద్దె దుర్గారావు, తురగా ఉషారమణి

విజయవాడ కేంద్రం నుంచి – జ్యోత్స్నాదేవి (తరువాత హైదరాబాదుకు మారారు), ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావు ఈ ముగ్గురు పర్మనెంట్ న్యూస్ రీడర్లు.  అప్పుడప్పుడు చదివినవారిలో రెంటాల కల్పన, ఓంకార్, సాధన వున్నారు.హైదరాబాద్ లో  కాజువల్ న్యూస్ రీడర్ గా వున్న జీడిగుంట నాగేశ్వర రావు  ప్రతివారం బస్సులో విజయవాడ వెళ్లి  ఆదివారం ఉదయం వార్తలు చదివేవారు.

హైదరాబాదు నుంచి – నళినీమోహన్, డి.రాధాకృష్ణారావు, మాడపాటి సత్యవతి, డి. వెంకట్రామయ్య, భండారు శ్రీనివాసరావు (అప్పుడప్పుడు – అసలు న్యూస్ రీడర్లు లభ్యం కాని రోజుల్లో అవసరార్థం – వార్తలు చదవాల్సి వచ్చేది. అలాగే అయిదేళ్ళు రేడియో మాస్కో- మాస్కో నుంచి తెలుగు వార్తలు)

నాకంటే ముందు కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు రేడియో మాస్కోలో పనిచేశారు. లిదా స్పిర్నోవా, విక్టర్ అనే తెలుగు తెలిసిన రష్యన్లు కూడా వార్తలు చదివేవారు. ఆ రోజుల్లో రాదుగ (విదేశీ భాషల రష్యన్ ప్రచురణ సంస్త) లో పనిచేసే ఆర్వీయార్ (ప్రముఖ రచయిత, రాళ్ళబండి వెంకటేశ్వరరావు) అప్పుడప్పుడు వార్తలు చదివేవారు)

పోతే, హైదరాబాద్ విషయానికి వస్తే -

రెగ్యులర్ న్యూస్ రీడర్లు కాకుండా తాత్కాలిక ప్రాతిపదికన వార్తలు చదివిన వారు, ఇంకా చదువుతున్నవారు వున్నారు. సీనియర్ జర్నలిస్ట్, ఆంద్ర ప్రభ మాజీ సంపాదకులు, ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు కొద్దికాలం చదివారు. అలాగే, ఉషశ్రీ (పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు గారు- రేడియోలో చేరక పూర్వం అతి కొద్దికాలం వార్తలు చదివారు)

కాజువల్ న్యూస్ రీడర్లలో మరికొందరు – పీ ఎస్ ఆర్ ఆంజనేయ శాస్త్రి, సురమౌళి, గుడిపూడి శ్రీహరి, పార్వతీ ప్రసాద్, వేదగిరి రాంబాబు, చంద్రమోహన్ (ప్రముఖ క్రీడా విశ్లేషకులు, ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీధరబాబు వ్యక్తిగత కార్యదర్శి), కృష్ణమోహన్ ( పెళ్లి పత్రిక సంపాదకులు), జె. చెన్నయ్య, (ఓపెన్ యూనివర్సిటీ ప్రధాన పౌర సంబంధ అధికారి), షర్ఫుద్దీన్, రామ్మోహన్ నాయుడు, జొన్నలగడ్డ రాధాకృష్ణ, ప్రసాదరెడ్డి, అయాచితుల రవికిషోర్ (ఆంద్ర జ్యోతి), పొణంగి బాల భాస్కర్, చుండూరి వెంకట రంగారావు, వెంపటి కామేశ్వరరావు, సీహెచ్ రామఫణి

(లబ్ధ ప్రతిష్టులు, తమ స్వరంతో రేడియో వార్తలకు జీవం పోసిన తెలుగు న్యూస్ రీడర్లలో ఎవరయినా ఈ జాబితాలో కనిపించకపోతే, నూటికి నూరుపాళ్ళు ఆ తప్పు - నాదే – భండారు శ్రీనివాసరావు)

37 కామెంట్‌లు:

  1. మీ పోస్ట్ చదువుతూ వుంటే నా చెవులకు ఆ రోజులలో[1965 - 1975 ] మేము స్కూల్ నుండి మద్యాహ్నం ఇంటికి వేడు తూ వుంటే 12 . 30 వార్తలు ,1 .౦౦ ప్రాంతీయవార్తలు వింటున్న అనుభూతి వొస్తోంది -msr

    రిప్లయితొలగించండి
  2. తిరుమల సెట్టి శ్రీరాములు,పార్వతీ ప్రసాద్,కోణంగి బాల భాస్కర్,ఏడ్దీ గోపాల రావు గార్ల వార్తలు కూడా విన్నానండీ నేను. జగ్గయ్య గారు, రంగనాథరావు మొదలైన వారి సమాయినిక్ ఇపుట్టానో లేదోమరి!:-))

    ఉషారమణి గారంటే హైద్రాబాదు రేడియో కేంద్రంలో అనువాదకురాలిగా పని చేస్తున్న వారేనాండి?

    వార్తలు చదివేంతగా తెలుగు తెలిసిన రష్యన్లు ఉండేవారని తెలుసుకోవడం ఆశ్చర్యంగాను, ఆనందంగానూ ఉంది.

    మేం స్కూల్లో ఉన్నపుడు మధ్యాహ్నం వార్తలు ఆదివారం మాత్రమే వినే అవకాశం ఉండేది. అదవ్వగానే కార్మికుల కార్యక్రమం వచ్చేది.(ఇప్పుడూ వస్తుందేమో అనుకోండి..వినట్లేదుగా) చిన్నక్క, ఏకాంబరం కోసం తప్పకుండా వినే వాళ్ళం!

    రిప్లయితొలగించండి
  3. మీ పోస్ట్ చదువుతుంటే నా చెవుల్లో ఏడిద గోపాల్ రావు , కందుకూరు సూర్యనారాయణ గొంతు ఇప్పుడే విన్నట్టు అనిపిస్తుంది. ఈ న్యూస్ రీడర్స్ ప్రేరణ తో నేను స్కూల్లో ప్రేయర్ తర్వాతా రెగ్యులర్ గా వార్తలు ఉదయమే పేపర్ లో సేకరించి చదివే వాణ్ని. మాల్లి ఆ రోజులు గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. ఇంకా గుర్తు అ రోజుల్లో సినిమాల్లో న్యూస్ రీల్ వేసే వారు. అది ఏడిద గోపాల రావు గారి గొంతేనా అండి ఇప్పటికి గుర్తు " బెంగాల్ లో వరదలు" అని ఓ రకంగా పలికే వారు. బాగా గుర్తుంది ఆ పదం ఆ ఆక్సేంట్

    రిప్లయితొలగించండి
  5. శ్రీనివాసరావుగారూ. జాలా జ్ఞాపకాలను కదుపుతున్నారు. అవును రేడియో మాస్కో లో తెలుగులో వార్తలు రష్యన్లు ఒక మగ ఒక ఆడ గొంతు వినబడేవి. వాళ్ళ వచ్చీ రాని ఉచ్చారణ వల్ల వాళ్ళు చదివే తీరు చాలా హాస్యంగా ఉందెది, నేను అనుకోవటం వాళ్ళకు తెలుగు వచ్చి ఉండదు. ఇక్కడ ఇండియాలో ఉన్న అప్పటి కామ్రేడ్ల సంతోషం కోసం, తెలుగును మనవాళ్ళు చెబుతుంటే రష్యన్ లిపిలో వ్రాసుకునె చదివేవాళ్ళు అనుకుంటాను. , అబ్బో రష్యన్లు కూడ తెలుగు నేర్చుకున్నార్రోయ్ అనిపించటానికి అయ్యి ఉంటుంది. ఇది నా ఊహ మాత్రమే. వాళ్ళు నిజంగా తెలుగు నేర్చుకుని చదివి ఉంటే వాళ్ళ ఉచ్చారణ సవ్యంగా లేకపోయినప్పటికీ అద్బుతమే.

    మీరు ఉదహరించిన వారిలో ఎవరిదైనా, అదృష్టం బాగుంటే అదరివీ ఆడియోలు దొరికితే ఎంత బాగుండును. మీ దగ్గర ఉంటే నాకు పంపి పుణ్యం కట్టుకోండి, రావుగారూ.

    రిప్లయితొలగించండి
  6. శివ గారు మీరన్నది నిజమే నాకు కూడా గుర్తు రేడియో మాస్కో లో వార్తలు వాళ్ళు వచ్చి రాని తెలుగు లో చదువు తుంటే వింతగా అనిపించేది. అలాగే సిలోన్ లో కూడా " నిలయం లో సమయం సరిగ్గా మూడు గంటలు" అన్న మాటలు. జ్ఞ్యాపకాలు ఒక్కొక్కటే గుర్తుకు వస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  7. పాత ఒక రోత అని చీదరించుకునే రోజుల్లో – నాలుగు పాత విషయాలను, నలుగురు పాత మనుషులను గుర్తుచేసుకున్నందుకు ఇంత స్పందనా! ఒక్కొక్కరికీ విడివిడిగా జవాబు రాయలేక “అందరికీ నమస్కారం” అంటున్నా, దయచేసి స్వీకరించండి. – భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  8. శ్రీనివాస రావు గారు,

    ఈ పోస్ట్, దీని ముందు పోస్ట్ కూడా చదివాను. అక్షర లక్షల్లాంటి మాటలు చెప్పారు. నేను కూడా ఒక దశాబ్దం పైగా వార్తాలు చదివినా మీరు ఉటంకించిన పేర్ల వాళ్ళు వార్తలు చదువుతుంటే చెవులుఅప్పగించి వింటూ వుండిపోయేవాళ్ళం.

    ఢిల్లీ నుంచి గోపరాజు లక్ష్మి, విజయవాడ కేంద్ర నుంచి నేను, సాధన, నాగేశ్వరరావు , ఇంకా చాలా మంది చదివేవాళ్ళమూ.

    సినీ రచయిత, జర్నలిస్ట్ కొద్ది కాలం క్రితం మారణించన వొంకార్ కూడా వార్తలు చదివేవారు.

    గోవాడ సత్యా రావు గారు మీకు తెలుసు కదా.ఆయన మరి రిపోర్త్తర్ గానే కాకుండా అప్పుడప్పుడు మీలాగే వార్తలు కూడా చదివినట్లు గుర్తు.

    రిప్లయితొలగించండి
  9. కల్పనా, అయ్యో, ఓంకార్ గారి పేరు,మీ పేరూ మర్చిపోయాను మళ్ళీ!. మీ గొంతు కూడా గుర్తుంది నాకు. :-))
    కానీ మీరు రెగ్యులర్ గా చదివే వారా లేదా అన్నది గుర్తు లేదు. మీరు మధ్యాహ్నం వేళ చదివితే ఆదివారం తప్ప వినే ఛాన్స్ లేదు. ఆ టైములో స్కూల్లో ఉండేవాళ్ళం కదా! మీరు వార్తలు చదివింది ఏ సంవత్సరాల్లో చెప్పండి?

    రిప్లయితొలగించండి
  10. కల్పనా గారు ,

    ఓంకార్ గొంతు విన్నట్లు గుర్తుంది. కాని మీ గొంతు మేం విన్నట్లు గుర్తులేదు. ఎ పీరియడ్ లో చదివారు చెబుతారా. వీలుంటే మీ వార్తల ఆడియో వినిపించండి. సంతోషిస్తాం. ఎక్కువగా హైదరాబాద్ వినేవాళ్ళం అందుకేనోమే మిస్ అయ్యమనుకుంటా.

    రిప్లయితొలగించండి
  11. విజయవాడ నుంచి వార్తలు కాజువల్ పద్ధతిలో చదివిన కొందరి పేర్లను ఉదహరించనందుకు చింతించడమే కాదు వారిని క్షమించమని కూడా కోరుతున్నాను. రెంటాల కల్పన, సాధన, జీడిగుంట నాగేశ్వర రావు, ఓంకార్, గారపాటి నరసింహారావు మొదలయిన వారిని గుర్తుపెట్టుకుని రాసివుండాల్సింది. మంచి మనసుతో వార్తలు చదివిన వారందరూ మంచిమనసుతో అర్ధం చేసుకుంటారని నమ్ముతున్నాను. –భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  12. శ్రీనివాస రావు గారు,

    మీరు మాకు క్షమాపణ లు చెప్పటమేమిటండీ...ఈ విషయాలు మీరు ఓపికగా రాస్తున్నందుకు, మేము కేవలం చదువుతున్నందుకు మేమే మీకు క్షమపణలు చెప్పాలి. మీరు ఇంకా ఇంకా ఇలాంటి వ్యాసాలు రాస్తారని మేం ఎదురుచూస్తున్నాము. పేర్లు రాయటం లో మర్చిపోవటం అనేది ఎవరికైనా వుండే ఇబ్బంది నే. నేను అర్థం చేసుకోగలను.

    సుజాత...

    నేను వార్తలు చదివిన కాలం 1988 నుంచి 1998 వరకూ. ఉదయం ప్రాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యేవి. అవి వారానికి రెండు మూడు సార్లు చదివేదాన్ని. ఈ వార్తలు మొత్తం రాష్ట్రం అంతటా ప్రసారమయ్యేవి.
    భాను గారు, మీరు నా వార్తలు వినాలంటే బహుశా ఇవి విని వుంటే నా గొంతు గుర్తు పట్టి వుండేవారు. మధ్యాహ్నం వార్తలు కేవలం విజయవాడ ఆకాశవాణి కేంద్రం పరిధి లో మాత్రమే ప్రసారమయ్యేవి. సాయంత్రం వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యేవి.

    కేవలం ప్రాంతీయ వార్తాలే కాకుండా న్యూస్ బులెటన్లు, న్యూస్ లేటర్స్, వార్తా వ్యాఖ్యలు, యువవాణి, మహిళావాణి, ఇంకా సాహిత్య కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, నాటికలు, కవితలు, పుస్తక సమీక్షలు, ఇలా ఆకాశవాణి లో ఆల్ రౌండర్ అన్న మాట. ఇవి కాక సిలోన్ వాళ్ళ కోసం చిన్న చిన్న న్యూస్ బులెటన్లు చదవటం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. శ్రీలంక లో వచ్చిన న్యూస్ రీడర్ పోస్ట్ ని వదులుకోవటం ఒక తీపి జ్నాపకమే ఇంకా.
    భానూ, అవును. మీరు ఉదయం వార్తలు వింటే తప్ప నా గొంతు వినే ఛాన్స్ లేదు ...ఆ రకంగా మీరు బతికిపోయారన్న మాట.:-))

    అన్నీ రికార్డ్ చేయలేదు కానీ చాలా రికార్డ్ చేసుకున్నాను కానీ ఇదివరకు చెప్పాను కదా మొత్తం నా కృషి మొత్తం అమెరికా ట్రావెల్ లో పోగొట్టుకున్నాను. అలా కృష్ణార్పణం అయిపోయింది. ఇక మీకు ఆ భాగ్యం లేదు.
    కావాలంటే ఇప్పుడు బ్లాగ్ వార్తలు చదివి పెట్టగలను.:-))

    రిప్లయితొలగించండి
  13. భండారు శ్రీనివాసరావు గారూ!
    చాలామంది గత కాలపు స్మృతులు రేడియో శ్రవణంతో ముడిపడివున్నాయి. ఓ పరిమళం సోకినపుడు దానితో సంబంధమున్న పాత విషయాలు అప్రయత్నంగా, వెల్లువలా గుర్తొస్తాయి కదా, అలాగే
    మీ టపాలో ప్రస్తావనలు ఎందరికో వారి పాత విశేషాలను తట్టిలేపుతున్నాయి.

    ఒక్కో న్యూస్ రీడర్ శైలి గురించీ, ఆయన/ఆమె చదివే తీరులో ప్రత్యేకత గురించీ వివరంగా మీరు రాయాలని నా కోరిక!

    అద్దంకి మన్నార్ గొంతు ప్రత్యేకించి నాకెంతో అభిమానపాత్రమైనది. ఓ జనరల్ ఎన్నికల ఫలితాల సమయంలో వేగంగా, స్పష్టంగా ఆయన వార్తలను చదవటం నాకింకా బాగా గుర్తు!

    రిప్లయితొలగించండి
  14. తెలుగు వార్తలు చదివిన వారిలో శ్రీశ్రీ, రష్యన్లు ఉన్నారని తెలిసి ఆశ్చర్యపడ్డా. మీనాక్షి పొన్నుదొరై తెలుగు పాటల కార్యక్రమాలు విన్నాను కాని వారు వార్తలు చదవటం వినలేదు.

    -సి.బి.రావు, హైదరాబాదు.

    రిప్లయితొలగించండి
  15. భలే బాగుందండీ మీ వ్యాసం.
    నాకూ చిన్నప్పుడు రేడియోలో వార్తలు వినటం తీయటి ఙ్ఞాపకం. అద్దంకి మన్నార్ గారి తో పాటు నాకు సంస్కృతంలో వార్తలు చదివే ఉదయశ్రీ (?) (ఇతి వార్తాః శ్రూయంతాం ప్రవాచితః ఉదయశ్రీ అంటూ వచ్చేది), ఇంకా ఉర్దూలో వార్తలు చదివే ఆయన గొంతూ కూడా చాలా ఇష్టంగా వుండేవి. మంచి విశేషాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
    శారద

    రిప్లయితొలగించండి
  16. సీబీ రావు గారికి
    జర్నలిజం లో వున్నవాళ్ళు ‘తొందరపాటులో ఎలా తప్పులు తొక్కు తారో’ అన్న విషయంపై లోగడ నేనే రాసి- ఇప్పుడు అదే తప్పు నేను చేసాను. మీనాక్షి పొన్నుదొరై సిలోన్ రేడియోలో కేవలం అనౌన్సర్ మాత్రమే, న్యూస్ రీడర్ కాదు. దయచేసి మన్నించండి. శ్రీ శ్రీ విషయంలో ‘వాచస్పతి’ ప్రత్యెక సంచికను ఉదహరించడానికి కారణం ఖచ్చితంగా తెలియకపోవడమే. అయితే శ్రీ శ్రీ గారు కొంతకాలం పాటు ఢిల్లీ వార్తావిభాగంలో పనిచేసిన విషయాన్ని కొందరు సీనియర్ సహచరులు నిర్ధారించారు. విలేకరిగా, న్యూస్ ఎడిటర్ గా వుంటూ ఆపద్ధర్మంగా అప్పుడప్పుడు నేను స్టూడియోలోకి వెళ్లి వార్తలు చదివినట్టు వారు కూడా చదివారేమో తెలియదు. తెలుగు వార్తలు చదివిన రష్యన్లు గురించి ‘మార్పు చూసిన కళ్ళు’ అనే పేరుతొ నా బ్లాగులో అనేక ఆర్టికిల్స్ వున్నాయి. కొద్దిగా వెనక్కు వెళ్లి చూడాల్సి వుంటుంది. –భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  17. శివ గారికి- నేను 1987 నుంచి 1992 వరకు దాదాపు అయిదేళ్లపాటు మాస్కోలో వుండి రేడియో మాస్కోలో తెలుగు వార్తలు చదివాను. మా తెలుగు విభాగంలో లిదా స్పిర్నోవా అనే మహిళ తో పాటు, విక్టర్ గీర్మన్, నటాషా, సెర్గీ అనేవారు పనిచేసేవారు. వీరిలో మొదటి ముగ్గురికీ, అంటే లిదా, విక్టర్, గీర్మన్ లకు తెలుగు వచ్చు. అంటే రష్యన్ వార్తలను తెలుగులోకి అనువాదం చేయగల ప్రావీణ్యత వున్నవారు. కాకపొతే, పలుకుబడిలో కొంత తేడా రావచ్చు. ప్రపంచం లో మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వ పతనం గురించి ‘మార్పు చూసిన కళ్ళు’ అనే పేరుతొ ఇదే బ్లాగులో ‘ప్రత్యక్ష సాక్షి’ కధనం రాసాను. వీలుంటే చదవగలరు. ధన్యవాదాలతో – భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  18. శ్రీ శ్రీ గారు వార్తలు చదివినట్టు ఈ మధ్య ఏదో పత్రిక లో ఆకాశవాణి గురించి నరహరి అనుకుంటా రాసిన వ్యాసం లో చదివినట్టు గుర్తు

    రిప్లయితొలగించండి
  19. (ఈ కింది లేఖను నాకు మెయిల్ చేసిన సుజాత గారికి ధన్యవాదాలతో –భండారు శ్రీనివాసరావు)

    శ్రీనివాసరావు గారూ, మీరు ఇవన్నీ బ్లాగులో రాసి వదిలేస్తున్నారేమిటండీ! ఇంతటి అద్భుతమైన అనుభవాలు ఎంతమందికుంటాయి? నాకు చాల ఈర్ష్యగా ఉంది, మా నాన్నకి ఆలిండియా రేడియో లో ఉద్యోగం ఉండి, నేను మాస్కో ఎందుకు చూడలేదా అని!

    మొత్తం చదువుతున్నాను !

    డీ వెంకట్రామయ్య గారు రచన మాసపత్రికలో తన రేడియో జీవితానుభవాలు రాస్తున్నారు. ఇక్కడివే! మా నాన్నగారు కమ్యూనిస్టు సానుభూతి పరులు కావడం వల్ల సోవియట్ భూమి, సమీక్ష వగైరాలన్నింటికీ చందాలు కట్టేవారు. ఆ పత్రికల్లో ఎర్రని యాపిల్ తోటలూ, మంచు నిండిన మాస్కో వీధులూ చూస్తూ ఒక్కసారి రష్యా చూడాలి అని కలలు కనే వాళ్ళం చిన్నప్పుడు. నయాగరా కవుల్లో ఒకరైన శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు సోవియట్ భూమికి ఎడిటర్ గా రష్యాలో పని చేశారని అప్పుడు పట్టించుకోలేదు. పెళ్ళి అయ్యాక ఆయన మా పెద్దత్త గారి భర్త అని తెలిసింది. అప్పటివరకూ మా వూరి మనిషిగా, కవిగా మాత్రమే ఆయన పరిచయం! మీకు ఆయన తెలుసా(రష్యాలో ఉన్నపుడు)! ఇప్పుడు లేరనుకోండి. పోయి కూడా చాలా రోజులైంది.

    రష్యాలో అందమైన జీవితం గడిపిన మీరు అప్పటి రేడియో అనుభవాలను కేవలం బ్లాగుకే పరిమితం చేస్తే ఎలాగ? ఇక్కడ బ్లాగుల్లో ఇటువంటి నాణ్యత గల రాతల్ని పట్టించుకునే వారు తక్కువ ఉన్నారు. చెత్త మాటలతో ఒకరినొకరు ఎత్తి పొడుచుకోడాలు, దెబ్బలాడుకోటాలు..అంతా వీధి పంపుల వ్యవహారం!

    మీరు దీన్ని ఏదైనా పత్రిక్కి రాసి ఉంటే ఎంతో బావుండేది. ఇప్పటికైనా ఆలస్యం అవలేదు కదా! నవ్య వీక్లీకో, స్వాతి వీక్లీకో రాయొచ్చు కదండీ!

    లేదంటే మీ అనుభవాలన్నింటినీ పుస్తకంగా అయినా వేయాల్సిందే! – సుజాత

    రిప్లయితొలగించండి
  20. We might not be commenting on every post. But there are many folks who are enjoying and appreciating your posts :)

    still publishing your experiences as a small book would be a good idea..

    రిప్లయితొలగించండి
  21. భళే వాళ్ళే..తక్కువో, ఎక్కువో తెలీదు కానీ అందులో నేను ఒకణ్ణి. చాలా రెగ్యులర్ గా చదువుతుంటాను నేను మీ బ్లాగు. మాస్కోనే కాదు, మీ అమెరికా అనుభవాలన్నీ కూడా చదివా, అలాగే మీరు వివిధ హోదాల్లో పనిచేసినప్పుడూ, ప్రశంసల ఫఒటోలూ అన్నీ చూసా. సుజాత గారన్నట్లు, ఈర్ష్య కాదు గానీ, మా నాన్నకీ, ఇంత ఇంట్రస్టు ఉంటే అమెరికా గురించి ఇంకా బాగా చూపించి, వివరించి ఉండి వాణ్ణి కదా అనిపించింది.

    రిప్లయితొలగించండి
  22. msrmurty గారు, Nitpicking :-) 1.00 కి కాదు, 1.10కి ప్రాంతీయ వార్తలు.

    పన్నెండున్నర జాతీయ వార్తలు అయిపోయిన తర్వాత వచ్చే కార్మికుల కార్యక్రమం థీం మ్యూజిక్ వింటూ స్కూల్ నుండి ఇంటికి నడచుకుంటూ వెళ్ళటం, నాకో మధురమైన అనుభూతీ, జ్ఞాపకం కూడానూ.

    రిప్లయితొలగించండి
  23. రేడియో సిలోన్ లో, మీనాక్షి పొన్నుదొరై వినిపించే పాటలు ఆ రోజులలో ఎంతో ఆసక్తితో వినే వాళ్లము. క్రమం తప్పకుండా, నిరంతరాయంగా ప్రతిరోజు ఆ పాటలు వచ్చేవి. అయితే ఒక రోజు తీవ్ర జ్వరంతో వుండటం వలన, మీనాక్షి పొన్నుదొరై స్టుడియో కు రాలేక పోయారు. ఆ రోజు తెలుగు కార్యక్రమాలు రద్దయ్యాయి.

    "అప్పటి రేడియో అనుభవాలను కేవలం బ్లాగుకే పరిమితం చేస్తే ఎలాగ? ఇక్కడ బ్లాగుల్లో ఇటువంటి నాణ్యత గల రాతల్ని పట్టించుకునే వారు తక్కువ ఉన్నారు. చెత్త మాటలతో ఒకరినొకరు ఎత్తి పొడుచుకోడాలు, దెబ్బలాడుకోటాలు..అంతా వీధి పంపుల వ్యవహారం!" -– సుజాత

    -సమాజం లో ఉన్న రాగ ద్వేషాలే బ్లాగులలో ప్రవేశించాయి. పుస్తక రచయితలు/రచయిత్రులు కూడా రాగద్వేషాలకు అతీతులు కారు. అయితే గమనించవలసిన విషయం ఏమంటే బ్లాగు పాఠకులు, పత్రికా పాఠకులు వేరు. బ్లాగులు చదివే అంతర్జాతీయ పాఠకులకు తెలుగు పత్రికలు, పుస్తకాలు అందుబాటలో ఉండవు. పత్రికలు చదివే భారతదేశ పాఠకులు అంతర్జాలం జోలికెళ్లరు. ఈ సూష్మం గ్రహించి మిత్రులు ఇన్నయ్య గారి పుస్తకాలను ఉచిత ఈ పుస్తకాలుగా దీప్తిధార బ్లాగులో ఉంచినా వాటి (పుస్తకాల) అమ్మకాల పై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఒక ఉదాహరణగా రాష్ట్ర రాజకీయ చరిత్ర: వందేళ్ల విశ్లేషణ 1910 – 2010 -నరిసెట్టి ఇన్నయ్య పుస్తకాన్ని చెప్పవచ్చు. ఇది ఉచిత ఈ పుస్తకంగా ఇచ్చినా, పుస్తక అమ్మకాల జోరు ఏ మాత్రం తగ్గలేదు. మీ వ్యాసాలకు అంతర్జాలంలో గుర్తింపు, స్పందనా రెండు ఉన్నాయి. అచ్చులొ ప్రచురించే వ్యాసాలకు వచ్చే స్పందన రచయితలకు తెలియదు. బ్లాగు వ్యాసాలకు తక్షణ స్పందన లభించగలదు. బ్లాగులో మీ వ్యాసాలను కొనసాగించవచ్చు.


    "మీ అనుభవాలన్నింటినీ పుస్తకంగా అయినా వేయాల్సిందే! " – సుజాత

    -అన్నీ కాకుండా, ఎంపిక చేసిన వ్యాసాలు పుస్తకంగా రా తగ్గవి. పుస్తక ప్రచురణలో, అవసరమైతే నా, వెంకటరత్నం మరియు Print consultant మురళీధర్ గార్ల సలహాలు తీసుకోవచ్చు. అయితే పుస్తక ప్రచురణకు నష్టానికి సిద్ధమయి దిగాలి.

    రిప్లయితొలగించండి
  24. శారద గారికి
    హైదరాబాద్ రేడియో కేంద్రానికి వున్న ప్రత్యేకత ప్రతి రోజూ సాయంత్రం ఐదుగంటల యాభయి నిమిషాలకు ప్రసారమయ్యే పది నిమిషాల ఉర్దూ బులెటిన్. ఇది చదవడానికి రెగ్యులర్ న్యూస్ రీడర్ ఒకరు వుండేవారు. ఆయన పేరు వసీం అక్తర్. ఆయన వార్తలు చదువుతుంటే ఉర్దూ రానివారు కూడా చెవులొగ్గి వినాలనిపించేంత మధురంగా వుండేది. అతి మార్దవంగా సంగీత ప్రవాహం మాదిరిగా వార్తలు సాగిపోయేవి. ఆయన మరణించిన తరవాత ఉర్దూ పత్రికల్లో పనిచేసే చాలామంది జర్నలిష్టులు రేడియోలో ఉర్దూ వార్తలు చదువుతున్నారు. కొన్నాళ్ళు రాణి అనే ఆవిడ శాశ్విత ప్రాతిపదికపై ఉర్దూ వార్తలు చదివారు. ఆవిడ రిటైర్ అయిన తరవాత ఇప్పుడందరూ కాజువల్ గా వార్తలు చదువుతున్నవారే. –ధన్యవాదాలతో –భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  25. వేణు గారికి- నిజమే ఒక్కొక్క న్యూస్ రీడర్ ఒక్కొక్క బాణీ లొ వార్తలు శ్రోతలకు అలవాటు చేసి అభిమానులను తయారుచేసుకున్నారు. సినీ నటుల మాదిరిగా రేడియో న్యూస్ రీడర్లను అనుకరించడం ఆ రోజుల్లో ధ్వన్యనుకరణ కళాకారులకు ఒక పనిగా వుండేది. ఆ స్వరాలు అంత పాపులర్. మీరు చెప్పిన సలహా మంచిదే. ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలతో –భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  26. సుజాత గారికి- రేడియోలో న్యూస్ రీడర్ ఉద్యోగాన్ని న్యూస్ రీడర్ కం ట్రాన్స్ లేటర్ అంటారు. ఇంగ్లీషులో తయారుచేసే న్యూస్ బులెటిన్ ని ఆయా భారతీయ భాషల్లోకి తర్జూమా చేసి చదివే విధానం వల్ల ఆ పేరు వచ్చింది. విజయవాడనుంచి కేవలం తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి కాబట్టి అక్కడ తెలుగులోనే బులెటిన్ తయారు చేస్తారు. కాకపొతే యుఎన్ఐ, పీటీఐ వంటి వార్తా సంస్తలు ఇంగ్లీష్ లొ ఇచ్చే వార్తలను అనువాదం చేసుకోవాల్సి వుంటుంది. హైదరాబాదులో ఉర్దూ బులెటిన్ కూడా వుండడం వల్ల మెయిన్ బులెటిన్ ను ఇంగ్లీష్ లొనే తయారు చేస్తారు. – భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  27. మరో మాట కూడా చెప్పుకోవాలి - న్యూస్ రీడరుకే కాదు;
    కేజువల్ అనౌన్సరుకి కూడా ట్రాన్సులేషను తెలిసి ఉండాలి!!
    ఇంగ్లీషు మీడియం చదువులు ఎక్కువయ్యాయి కనుక
    అది పెద్ద సమస్య కాదనుకోండి. కొందరు పొడవైన
    అనువాదిత వాక్యాలని కామాలు, ఫులుస్టాపులు లేకుండా
    చదువుతూ ఉంటే సరిగ్గా అర్ధం కాక నవ్వాలో - బాధపడాలో
    తెలియకుండా ఉంటుంది..

    రిప్లయితొలగించండి
  28. aarveeyaar intiperu raallabandi kaadu raallabhandi.vootu'bha'

    రిప్లయితొలగించండి
  29. పెద్దలు శ్రీనివాస రావు గారు,
    హైదరాబాదు రేడియో కేంద్రంలో మీరు చెప్పిన కాజువల్ న్యూస్ రీడర్ల తో బాటుగా, నాలాగా కొందరం క్యాజువల్ స్టెనోలుగా పనిచేసే వాళ్ళం. ఆదివారాలు, ప్రభుత్వ సెలవుదినాలు, ఇంకా రెగ్యులర్ స్టెనోలు సెలవుపెట్టినప్పుడు, మరీ ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగం, ప్రధానమంత్రి ప్రసంగాల టేపులు ముదుగా వచ్చినప్పుడు మమ్ములను హైర్ చేసే వారు. గుర్తు వచ్చి వుంటాను. మీతో కలిసి సుమారు 20 సంవత్సరాలుగా పనిచెసి, వార్తలు వెలువడడానికి మీరు పడే ప్రసవ వేదనలాంటి కష్టాలన్ని ప్రత్యక్షంగా చుసినవాడిని. మీ బ్లాగు చదువుతుంటే అవన్నీ గుర్తుకు వచ్చాయి.మరీ ముఖ్యంగా పాతనగరంలో గొడవలప్పుడు బలవంతంగా వసీం అక్తర్ గారి ఇంటికి వెళ్ళి పిలుచుకు రావడం, ఆఅయన టేబిల్ మీద చార్మినార్ సిగరెట్ పేకట్ల దొంతర మొత్తం వార్తలు పూర్తిగా వ్రాసుకునే టైముకు ఖాళీ అవడం మంచి నొస్టాల్జిక్ గ్నాపకాలు. 24 గంటల చానెల్లు వచ్చాక వార్తల విలువ పూర్తిగా పడిపొయింది. ఆకాశవాణి వార్తలంటే ఎంత క్రెడిబులిటి వుండెది. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ రోశయ్య గారు ఎక్కడ వున్నప్పటికీ ఆఖరికి ప్రయాణాల్లొ వున్నా, స్వయంగా హైదరాబాదు రేడియొ ట్యూను చెసుకొని ప్రాంతీయవార్తలు విడం నెను ప్రత్యక్షంగా చూసాను. ముఖ్యంగా నాకు మీరు, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి శైలజ గార్లు , శ్రీ ఆకిరి గారు అందించిన సపోర్ట్ గ్రేట్.

    ప్రసాద్, హైదరాబాద్.

    రిప్లయితొలగించండి
  30. పెద్దలు శ్రీనివాస రావు గారు,
    హైదరాబాదు రేడియో కేంద్రంలో మీరు చెప్పిన కాజువల్ న్యూస్ రీడర్ల తో బాటుగా, నాలాగా కొందరం క్యాజువల్ స్టెనోలుగా పనిచేసే వాళ్ళం. ఆదివారాలు, ప్రభుత్వ సెలవుదినాలు, ఇంకా రెగ్యులర్ స్టెనోలు సెలవుపెట్టినప్పుడు, మరీ ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగం, ప్రధానమంత్రి ప్రసంగాల టేపులు ముదుగా వచ్చినప్పుడు మమ్ములను హైర్ చేసే వారు. గుర్తు వచ్చి వుంటాను. మీతో కలిసి సుమారు 20 సంవత్సరాలుగా పనిచెసి, వార్తలు వెలువడడానికి మీరు పడే ప్రసవ వేదనలాంటి కష్టాలన్ని ప్రత్యక్షంగా చుసినవాడిని. మీ బ్లాగు చదువుతుంటే అవన్నీ గుర్తుకు వచ్చాయి.మరీ ముఖ్యంగా పాతనగరంలో గొడవలప్పుడు బలవంతంగా వసీం అక్తర్ గారి ఇంటికి వెళ్ళి పిలుచుకు రావడం, ఆఅయన టేబిల్ మీద చార్మినార్ సిగరెట్ పేకట్ల దొంతర మొత్తం వార్తలు పూర్తిగా వ్రాసుకునే టైముకు ఖాళీ అవడం మంచి నొస్టాల్జిక్ గ్నాపకాలు. 24 గంటల చానెల్లు వచ్చాక వార్తల విలువ పూర్తిగా పడిపొయింది. ఆకాశవాణి వార్తలంటే ఎంత క్రెడిబులిటి వుండెది. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ రోశయ్య గారు ఎక్కడ వున్నప్పటికీ ఆఖరికి ప్రయాణాల్లొ వున్నా, స్వయంగా హైదరాబాదు రేడియొ ట్యూను చెసుకొని ప్రాంతీయవార్తలు విడం నెను ప్రత్యక్షంగా చూసాను. ప్రసాద్, హైదరాబాద్.

    రిప్లయితొలగించండి
  31. ఎందరో మహానుభావులు అందరికీ వందనం

    రిప్లయితొలగించండి
  32. పైన వ్యాఖ్య చేసిన ప్రసాద్ గారికి :

    మీ రేడియో జ్ఞాపకాలని వీలుంటే మరి కాస్త వివరంగా
    రేడియో అభిమానులతో పంచుకోగలరని మనవి. మీకు
    అవకాశం ఉంటే సొంతంగా ఓ బ్లాగులో వ్రాయండి. లేదా
    శ్రీ శివప్రసాదు గారికి మెయిలులో పంపగలరు
    (vu3ktb AT gmail DOT com)

    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  33. Thank you MANAVANI for asking on behalf.

    Yes! I invite input on Radio Memories, information on Radio Artists, in any language, not necessarily in Telugu, Photos of Radio Artists. Please mail me at vu3ktb@gmail.com

    రిప్లయితొలగించండి
  34. డియర్ శ్రీ ప్రసాద్- మీడియా అనేది కలెక్టివ్ వర్క్. అందరం ఒక కుటుంబం లాగా ఎలా పనిచేసేవారమో మీ వంటి వారందరికీ బాగా తెలుసు. నాలుగో తరగతి అధికారినుంచి న్యూస్ ఎడిటర్ దాకా అంతా కలసి ఒక మాట మీద, ఒక ధ్యాస మీద పని చేస్తేనే న్యూస్ బులెటిన్ బయటకు వస్తుంది. మనపక్కన యువవాణి లొ పెక్స్ గా పనిచేసి ఈ మధ్యనే స్టేషన్ డైరెక్టర్ గా రిటైర్ అయిన పీ ఎస్ గోపాల కృష్ణ గారు – సాయంత్రం వార్తలు సమాప్తం అనగానే మన దగ్గరకు వచ్చి పొద్దుటి నుంచి పడ్డ శ్రమ అంతా గాలిలో కలసిపోయిందా అనేవారు హాస్యోక్తిగా. ఈ శ్రమ విజయంలో మీ పాత్ర తక్కువేమీ కాదు. కానీ మీ గురించి ప్రస్తావించే సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఎవరినీ మరచిపోలేదు. మరచిపోను కూడా. అవసరమయితే మీ సలహాలు సూచనలతో పాటు మీ జ్ఞాపకాలను కూడా ఈ బ్లాగు ద్వారా నలుగురితో పంచుకోవాలన్నది నా ఉద్దేశ్యం. అభివాదాలతో – భండారు శ్రీనివాసరావు.

    రిప్లయితొలగించండి
  35. సార్, మీకు గుర్తున్నంతవరకు రాసినట్టున్నారు. అయనా నాకు తెలిసింది రాస్తున్నాను.తప్పుగా భావించవద్దు. సార్ .ముఖ్యంగా రెంటాల కల్పన,ఓంకార్, జీడిగుంటనాగేశ్వరరావు ల సమయంలోనే విజయవాడలో జి. అరుణ, ఆరవల్లి జగన్నాధస్వామి, తూములూరి రాజేంద్రప్రసాద్,ఉన్నారు. వీళ్ళంతా బీ.యన్.రావు గారి టైమ్ లో క్యాజువల్ న్యూస్ రీడర్సు గా సెలక్ట్ అయిన వాళ్ళే.వీళ్ళలో జగన్నాధస్వామి ప్రస్తుతం హైదరాబాద్ స్టేషన్ లో ఎఫ్.ఎమ్.న్యూస్ కి క్యాజువల్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. మిగతా ఇద్దరు ఇంకా అక్కడే ఇప్పటికి వార్తలు చదువుతున్నారు. ఇకపోతే ప్రయాగ రామకృష్ణ గారు డెప్యుటేషన్ మీద ఏపి. ట్రాన్స్ కో కి వెళ్ళిన సమయంలో విజయవాడలో న్యూస్ రీడర్లు అవపరమైనపుడు మళ్లీ క్యాజువల్స్ రిక్రూట్మెంట్ జరిగింది.అప్పుడు మళ్ళీ కొంతమంది చేరారు. అందులోని వాళ్ళలో ఒకరు ప్రస్థుతం మహాటీవీలో వార్తలు చదువుతున్న రామకృష్ణ, హెచ్.ఎమ్.టీ.వీ. లో వాయిస్ ఓవర్ చెపుతున్న శ్యామ్ వున్నారు. ఆతర్వాత మళ్ళీ ప్రయాగరామకృష్ణ వెనక్కి వచ్చి కొంతకాలం విజయవాడలో పనిచేసి మళ్ళీ హైదరాబాద్ కి ట్రాన్సఫర్ అయినపుడు మళ్ళీ కొత్త వాళ్ళను తీసుకన్నారు. ఈలోపు కొప్పుల సుబ్బారావు గారు రిటైర్ అయిపోవటంతో విజయవాడ ప్టేషన్ అంతా క్యాజువల్స్ మయం అయిపోయి
    అప్పటి క్వాలిటీ ఇప్పటి వార్తల్లో లేదనేది ఒప్పుకోవాల్సిన నిజం. అవునంటారా, కాదంటారా.

    రిప్లయితొలగించండి
  36. జర్నలిస్ట్ గారికి
    చాలా మంచి విషయాలు తెలియచేసారు. నా ఉద్యోగ జీవితమంతా హైదరాబాద్ లోనే గడిచిపోయింది. విజయవాడలో న్యూస్ ఎడిటర్లు దీర్ఘకాలం సెలవు మీద వెళ్ళినప్పుడు మాత్రమె నేను హైదరాబాద్ నుంచి వచ్చి న్యూస్ బులెటిన్ల తయారీలో తోడ్పడుతుండేవాడిని. కాబట్టి విజయవాడ స్టేషనుకు సంబంధించి నా వ్యాపకాల జ్ఞాపకాలు అంతంత మాత్రమె అని చెప్పాలి. కొందరి పేర్లు నా వ్యాసం లో పెర్కొనలేక పోవడానికి ప్రధానంగా ఇదే కారణం. అంటే కాని వారిని ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించడం కాదు. – ధన్యవాదాలతో – భండారు శ్రీనివాసరావు.

    రిప్లయితొలగించండి
  37. బండారు శ్రీనివాసరావు గారు నమస్కారం మీ వద్ద వాయిస్ రికార్డింగ్ ఏవైనా ఉంటే తిరుమలశెట్టి శ్రీరాములు గారి వార్త పఠనాలు ఏమైనా పెట్టగలరా

    రిప్లయితొలగించండి