జీవితంలో చాలా విషయాలు కనురెప్పల కిందే కరిగిపోతున్నాయి.
సుజాతగారి బ్లాగులో (http://www.narasaraopet-bloggers.blogspot.com/) నరసారావుపేటలో అంతరించిపోతున్న గూడు రిక్షాల గురించి చదివాను.
నరసరావుపేట గూడు రిక్షా
ఇప్పుడీ రిక్షాల కాలం చెల్లిపోయి వాటితో పొట్టపోసుకునేవారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. అభివృద్ధి వల్ల కలిగే అనర్ధాల్లో ఈ పరిణామం ఒక భాగం. కొత్తనీరు వచ్చి పాతనీటిని నెట్టివేయడం కొత్తేమీకాదు. కాకపొతే, అలా మరుగునపడిపోతున్న విషయాలను ఇలా నెమరు వేసుకోవడం వల్ల కలిగే ఆనందమే వేరు. చిన్ననాటి ఫోటోలను చూసుకున్నప్పుడు కలిగే సంతోషానికి వెల, విలువ కట్టగలమా?
అమెరికా నుంచి బయలుదేరుతూ ఆఖరివారంలో చూసిన రెండు విశేషాలతో పాతలోని మధురిమ మరోసారి అనుభవం లోకి వచ్చింది. పాతను ‘ఉప్పు పాతర’ వేయకుండా ఇక్కడవాళ్ళు యెంత జాగ్రత్త పడుతున్నారో అర్ధం అయింది.
అగ్నికీలల్లో నాటి సియాటిల్
1889 లో సంభవించిన అగ్ని ప్రమాదంలో సియాటిల్ డౌన్ టౌన్ లో చాలాభాగం తగులబడిపోయింది. తరవాత దాని స్తానంలో కొత్త నగరం నిర్మితమయింది. కానీ పాతనగరం జ్ఞాపకాలను అతి పదిలంగా దాచుకుంటున్న తీరే అద్భుతం. ఆదర్శప్రాయం.
దాదాపు నూట యిరవై ఏళ్ల నాటి సియాటిల్ పాత బస్తీలోని కొన్ని ప్రదేశాలను ఎంపికచేసి, బేస్ మెంట్ లో పాతవాటిని మ్యూజియంలో మాదిరిగా జాగ్రత్తచేసి, పైన పలుంతస్తుల సుందర భవనాలను నిర్మించుకున్నారు.
వీటి కిందనే భద్రపరచిన పాతజ్ఞాపకాలు
ఆ కాలంనాటి టాయిలెట్
అండర్ గ్రౌండ్ టూర్ లో ఒక దృశ్యం
అలాగే. ఇస్సక్క్వా (Issaquah).
సులభంగా నోరు తిరగని ఈ ఊరు సియాటిల్లోని శివారు ప్రాంతం. మైనింగ్ అవసరాలకోసం ఈ పట్టణాన్ని కలుపుతూ లోగడ ఒక రైలు మార్గం వుండేది. దాన్ని తరవాత మూసివేశారు. ఇస్సక్క్వా హిస్టారికల్ సొసైటీ వారు ఈ పట్టణం డౌన్ టౌన్ ను ఒక చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేసి, అప్పటి రైల్వే స్టేషన్ ను, రైలు పట్టాలను లాగే వుంచేసి పాత జ్ఞాపకాలకు గుర్తుగా మిగిల్చుకున్నారు.
నాటి రైల్వే స్టేషన్
ఆ రోజుల్లో వుండే పెట్రోల్ (గ్యాస్) బంకులను, సినిమాహాళ్ళను యధాతధంగా వుంచేసారు. ఆధునిక నగరం సియాటిల్ నుంచి వచ్చి ఆ పాత పట్టణంలో కలయ తిరుగుతూ వుంటే, ఒక్కసారిగా ‘టైం మెషిన్’ లో గతకాలంలోకి జారిపోయిన అనుభూతి కలుగుతుంది.
అలనాటి పాత బజారు
అంతరించి పోతున్న నరసారావుపేట గూడు రిక్షాలను గురించి చదివిన సమయంలోనే ఈ ప్రదేశాలకు వెళ్ళిరావడం కేవలం యాదృచ్చికం.
పోతే- గూడు రిక్షాలేకాదు, కలికానికి కూడా కనబడకుండా పోతున్న వస్తువుల జాబితా తక్కువేమీ లేదు. తిరగళ్లు, రోకళ్లు, రుబ్బురోళ్లు, ఎడ్లబళ్లు – చెప్పుకుంటూ పోతే చాంతాడంత. అన్నట్టు చాంతాడు కూడా ఇక ఇలాటి సామెతలకే పరిమితం. మొన్న జ్వాలనరసింహారావు ఏదో సందర్భంలో చెప్పాడు. ఈ మధ్య అవసరం పడి, ‘రేడియో కం టేప్ రికార్డర్’ కోసం హైదరాబాదంతా కారు టైర్లు అరిగేట్టు తిరిగాడట. రేడియోనా అదేమిటి అన్నట్టు అందరూ మొహం పెట్టారట.ఇవి సరే! –
ఇవి కనబడకపోతే ఏదో సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రేమలూ, ఆప్యాయతలూ, అనురాగాలు, అనుబంధాలూ – వీటి సంగతేమిటి? అతివేగంగా అంతరించిపోతున్న వాటిలో వీటిదే ప్రధమ స్థానం.
వీటినెలా కాపాడుకునేటట్టు? కానరాకుండా పోతున్న వీటినెలా కనిపెట్టేటట్టు?
విచిత్రమేమిటంటే ఈ ప్రశ్నలకు జవాబు కూడా- “కనిపించుటలేదు”. (22-09-2010)
NOTE:All images in the blog are copyrighted to the respective owners
ఇంకొకటి నేను గమనించింది, చిన్న పెద్దా ప్రతి వూరు లోనూ హిస్తోరికాల్ సొసైటీ ఒకటి ఉంటుంది.
రిప్లయితొలగించండిthanks for the observation sir - bhandaru srinivasrao
రిప్లయితొలగించండిసియాటిల్ లో స్పేస్ నీడిల్ దగ్గర ఇప్పటికి రిక్షాలు దొరుకుతాయి. కాకపొతే అవి గూడు రిక్షాల్లా ఉండవు. తొక్కేది అమెరికన్స్, కాబట్టి కొంచెం రేటు ఎక్కువ.
రిప్లయితొలగించండి