17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

రేడియో రోజులు -7 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు -7            - భండారు శ్రీనివాసరావు

ఒకరు - సాక్షాత్తు దేశానికి ప్రధాన మంత్రి. మరొకరు జిల్లాస్తాయి యంత్రాంగంలో ఓ జీపు డ్రైవర్. వీరిద్దరూ కలసి భద్రాచలం అడవుల్లో ఓ డొక్కు జీపులో కలసి ప్రయాణం చేశారు. నమ్మదగని విషయంగా అనిపించినా ఇది అక్షర సత్యం. పైగా దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని.

గోదావరికి వరదలు రావడం మామూలే. కానీ వరద నష్టం పరిశీలించడానికి ప్రధాన మంత్రి స్వయంగా రావడం మామూలు విషయం కాదు. అందుకే ఏర్పాట్లన్నీ పకడ్బందీగా జరిగాయి. అందులోనూ రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం - ఎన్ టీ రామారావు గారి నాయకత్వంలో నడుస్తున్న రోజులాయె.

హెలికాఫ్టర్ లో భద్రాచలం చేరుకున్న రాజీవ్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ కార్యక్రమాలను వివరించే ఫోటో ప్రదర్శనని తిలకించిన అనంతరం - అనేక వాహనాలతో కూడిన ప్రధాన మంత్రి బృందం రోడ్డు మార్గంలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలను చూసేందుకు బయలుదేరింది. ప్రధాని వెంట ముఖ్య మంత్రి రామారావు గారు, మాజీ ముఖ్య మంత్రి, అప్పటి కేంద్ర మంత్రి జలగం వెంగళరావు గారు అధికారులు, అనధికారులు అంతా వున్నారు. ఆ రోజుల్లో రేడియో విలేఖరికి కొద్దో గొప్పో ప్రాధాన్యత వుండడం మూలాన హైదరాబాదు నుంచి వెళ్ళిన నాకు కూడా ప్రధాని కాన్వాయిలో ఒక జీపు కేటాయించారు. అప్పట్లో ఇప్పటిలా ఇన్ని టీవీ ఛానళ్ళు లేవు. టేపు రికార్డర్ చేతబట్టుకుని వీ ఐ పీ ల వెంట తిరగగలిగే వెసులుబాటు వుండేది. భద్రాచలం నుంచి చింతూరు వరకు రోడ్డుమార్గంలో వెళ్లి రావాలన్నది అధికారుల ప్లాను. మార్గ మధ్యంలో రాజీవ్ గాంధీ అనేక చోట్ల వాహనాన్ని నిలిపి రోడ్డు దిగి కాలినడకన ఇసుక మేట వేసిన పొలాలలోకి వెళ్లి రైతులతో, కూలీలతో మాటా మంతీ కలిపేరు. కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావు ప్రజలకు, ప్రధానికి నడుమ దుబాసీగా వ్యవహరించారు. ఇలా అనేక చోట్ల కాన్వాయి ఆపడం - చాలాదూరం నడుచుకుంటూ వెళ్లి స్తానికులతో మాట్లాడడం - ఇదంతా యువకుడయిన రాజీవ్ గాంధీకి ఏమాత్రం అలసట కలిగించలేదు కానీ ఆ ఎర్రటి ఎండలో ఎగుడు దిగుడు పొలాల్లో వేగంగా అడుగులువేస్తూ వెడుతున్న రాజీవ్ గాంధీతో పాటు సమానంగా నడవడానికి మిగిలిన నాయకులు నానా హైరానా పడ్డారు. ఈ విధంగా సాగిపోతున్న ప్రధాని పర్యటన అనుకోని మలుపు తిరిగింది.

పైలట్ రాజీవ్

నేను ఖమ్మంలో చదువుకునే రోజుల్లో వంటమ్మగారనే పేద వృద్ధురాలు వుండేది.నాలుగయిదు ఇళ్ళల్లో వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేది. ఆమె మనవడికి చదువు వొంట పట్టకపోవడంతో వారినీ వీరినీ ప్రాధేయపడి ఏదో చిన్న ఉద్యోగం వేయించగలిగింది. అతను కూడా డ్రైవింగ్ నేర్చుకుని ఓ ప్రభుత్వ శాఖలో డ్రైవర్ గా స్తిరపడ్డాడు. రాజీవ్ గాంధీ కాన్వాయిలో నేనెక్కిన డొక్కు జీపుకు అతనే డ్రైవర్ కావడం కాకతాళీయం. ఇక వర్తమానం లోకి వస్తే -

మరి కాసేపటిలో చింతూరు చేరతామనగా ఓ మలుపు దగ్గర రాజీవ్ గాంధీ వాహనం ఆపించారు. ఆ మలుపులో రోడ్డుకు ఎడమవయిపున దిగువగా అడవిలోకి వెళ్ళే ఓ బాట వుంది.
రాజీవ్ గాంధీ ఆయన కారు దిగి జేబులోనుంచి ఓ మ్యాప్ తీసి చూసుకుంటూ అడవి బాట పట్టారు. ఆ వెనుకే రామారావు గారు, వెంగళరావు గారు, ఒకరిద్దరు భద్రతాధికారులు, నేనూ, నామాదిరిగానే హైదరాబాదు నుంచి వచ్చిన పత్రికా విలేకరి సురేందర్(ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ ) - అంతా ఆయన్ని అనుసరించాము. రాజీవ్ గాంధీ పదే పదే రోడ్డు దిగిపోయి పొలాలవెంట తిరిగిరావడం గమనిస్తూ వచ్చిన పోలీసులూ, ఇతర అధికారులూ రోడ్డు మీదే వుండిపోయారు.

ఆ అడవి బాటలో కొద్ది దూరం వెళ్ళిన తరవాత - 'ఇక్కడికి దగ్గరలో పలానా పల్లెటూరు వుండాలి కదా' అని అడిగారు రాజీవ్ గాంధీ మరో సారి మ్యాప్ కేసి చూస్తూ. ఖమ్మం జిల్లా ఆనుపానులన్నీ తెలిసిన వెంగళరావు గారికి కూడా ఈ గ్రామం గురించి తెలిసినట్టు లేదు. 'పదండి పోదాం' అంటూ రాజీవ్ కదిలారు. దూరంగా రోడ్డుపై జీపు ఆపుకుని వున్న డ్రైవర్ అదే అమ్ముమ్మగారి మనవడు - మేము ముందుకు కదలడం చూసి రివ్వున జీపు స్టార్ట్ చేసి మా దగ్గరకు వచ్చాడు. మ్యాప్ చూస్తున్న రాజీవ్ గాంధీ గభాలున ఆ జీపులో ఎక్కి కూర్చున్నారు. దాంతో, రామారావు గారు, వెంగళరావు గారు, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎక్కేసారు. నేనూ సురేందర్ పరిగెత్తుకుని వెళ్లి జీపు వెనుక డోరు కడ్డీపై చతికిలపడ్డాము- సెక్యూరిటీ వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా.జీపు కదిలింది. డ్రైవర్ పక్కన ముందు సీట్లో రాజీవ్ గాంధీ, ఆయన వెనుక వెంగళ రావుగారు, డ్రైవర్ వెనుక సీట్లో రామారావు గారు , సెక్యూరిటీ వాళ్ళు, నేనూ, సురేందర్- అంత చిన్న జీపులో ఎలా ఇరుక్కుని వెళ్ళామో ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి రాకముందు విమానాలు నడిపే పైలట్ గా పనిచేసారు. ఆకాశంలో కొన్ని వేల అడుగుల ఎత్తున విమానం నడుపుతూ, రాడార్ సాయంతో దిగాల్సిన ప్రదేశాన్ని గుర్తించి, నడి రాత్రయినా, పట్టపగలయినా రన్ వేపై ఖచ్చితంగా దించగలిగిన అనుభవం ఆయనకు వుంది. ఎక్కడో భద్రాచలం దగ్గర మారుమూల అరణ్య ప్రాంతంలో మ్యాప్ చూసి గ్రామాలను గుర్తించగలిగిన దక్షతను ఆ అనుభవమే ఆయనకు నేర్పి వుంటుంది.

అందరి ప్రాణాలు (అడవి) గాలిలో దీపాలు

అడవి గాలికి జీపుకు వేళ్ళాడుతున్న పాత టార్పాలిన్ పట్టాలు టపటపా కొట్టుకుంటున్నాయి. నిటారుగా పెరిగిన చెట్ల కొమ్మలు రాపాడుకుంటూ చప్పుడు చేస్తున్నాయి. నక్సల్స్ సంచరించే ప్రాంతాలలో కొత్త వ్యక్తుల రాక గురించి వారికి తెలియచెయ్యడానికి వారి సానుభూతిపరులు చెట్ల కొమ్మలను ఒకదానికి మరొకటి తాటించి చప్పుడు చెయ్యడం ద్వారా సంకేతాలు పంపుతారని చెప్పుకునేవాళ్ళు. నక్సల్స్ కు పట్టు వున్న అడవుల్లో ఇలా సంచరించడం క్షేమం కాకపోయినా - రాజీవ్ గాంధీ మాత్రం ముందుకే పోవాల్సిందని డ్రైవర్ కు సైగ చేశారు. తన పక్కన కూర్చుని సూచనలిస్తున్నది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి అన్న విషయం తెలిసికూడా మా అమ్మమ్మగారి మనమడు మాత్రం ఏమాత్రం తొట్రుపడకుండా - నిబ్బరం కోల్పోకుండా - సుశిక్షితుడయిన సైనికుడి మాదిరిగా జీపు నడపడం చూసి నివ్వెరపోవడం మా వంతయింది.

రాజీవ్ ఊహించినట్టుగానే దగ్గరలోనే ఆ లంబాడాగూడెం తారసపడింది. తీరా చూస్తె పట్టుమని పది పూరిళ్లు కూడా లేవు. రాజీవ్ గాంధీ ఎలాంటి భేషజం లేకుండా ఓ చుట్టు  గుడిసె లోకి వెళ్లి ఆ పేద కుటుంబం స్తితిగతులను ఆరా తీసారు. ఓ మూలాన మూడు రాళ్ళ పొయ్యిపై వున్న మూకుడు మీద మూత తీసి - అన్నం మెతుకులను పట్టి చూసి - ఆ పేదరాలి భుజంపై చేయి వేసి - సాయం చేయడానికి సర్కారు ఉన్నదన్న భరోసా కలిగించారు. ఆ మిట్టమధ్యాన్నం వేళ తమ ఇంటికి వచ్చిన అతిధి - దేశ ప్రధాని అన్న సంగతి ఆమెకు తెలుసో లేదో! ఇప్పటి ప్రచార యుగంలో ఈ సంఘటన జరిగి ఉన్నట్టయితే ఎంతటి ప్రాచుర్యం లభించి ఉండేదో!
తర్వాత షరా మామూలే.- రాజీవ్ గాంధీ మళ్ళీ మ్యాప్ సాయంతోనే మమ్మల్నందర్నీ చేరాల్సిన చోటికి చేర్చారు.
ఒక ప్రధాని-ఒక ముఖ్య మంత్రి- ఒక మాజీ ముఖ్య మంత్రి వెంట ఖమ్మం జిల్లా అడవుల్లో కలిసి తిరిగిన విశేషాలను మర్నాటి ఉదయం రేడియో వార్తల ద్వారా బయటి ప్రపంచానికి తెలియచెప్పడానికి - మట్టికొట్టుకుపోయిన దుస్తులతో తెల్లారేసరికల్లా భద్రాచలం చేరడం అదో కధ.

4 కామెంట్‌లు:

  1. Good informative piece. I hope there were at least photos for this strange incident, which would not have happened present day.

    రిప్లయితొలగించండి
  2. శివ గారికి – ఎనభయ్యవదశకంలో నేను ఏఐఆర్ న్యూస్ రూం లో పనిచేస్తున్నప్పుడు డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ గారు(ఈ మధ్యనే హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు) యువవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా వుండేవారు. వార్తలు సమాప్తం అంటూ సాయంత్రం మేము బయట పడగానే – ఆయన “పొద్దటి నుంచి పడ్డ శ్రమంతా గాలిలో కలిపేశారా!” అని జోక్ చేసేవారు. ఆ రోజుల్లో ఏ రోజుపని ఆ రోజు పూర్తిచేసుకుని బయటపడడమే కానీ ఆ మధుర జ్ఞాపకాలను దాచుకోవాలని ఎవరూ అనుకోలేదు. రిపోర్టర్ ని నన్ను వొదిలిపెట్టండి. మిగిలిన కళాకారుల సంగతేమిటి? అహరహం తమ మెదడు కరిగించి, తమ రచనలతో, తమ గాత్రంతో రేడియో ప్రోగ్రాములకు ప్రాణ ప్రతిష్ట చేసేవారు. కానీ, వారిలో ఏ ఒక్కరూ తమ అనుభవాలకు గుర్తుగా ఏమీదాచుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా గారు (ఆయనా చిన్న తనంలో ‘రేడియో బాలానందం’ ఆర్టిస్టే) అంటుండేవారు. ప్రతి ఉద్యోగి - తాను ఉద్యోగం చేస్తున్నన్నాళ్ళు- ఆ ఉద్యోగం ‘శాశ్వితంగా శాశ్వితం’ అనే భ్రమలోనే వుంటాడుట. కానీ జాతస్య మరణం ధ్రువం అన్నట్టు ప్రతి ఉద్యోగికీ రిటైర్మెంట్ అనేది తప్పదు. – భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  3. Great to get in read this..
    Could you identify the people in teh below link

    http://www.thehansindia.com/posts/index/2013-10-06/75-years-of-radio-news-73247

    I was born in 1975 and I grew up listening radio, I still love listening to readio...

    రిప్లయితొలగించండి
  4. @Jahangir

    Please follow the below link andyou can see the details:

    http://saahitya-abhimaani.blogspot.in/2010/05/blog-post_25.html

    రిప్లయితొలగించండి