12, ఆగస్టు 2010, గురువారం

దేశం వెలిగిపోతోంది! - భండారు శ్రీనివాసరావు

దేశం వెలిగిపోతోంది!  - భండారు శ్రీనివాసరావు - (2008)


టీవీ ఛానళ్ళు  వీక్షించే అలవాటు అంతగా లేని నాకు దేశం వెలిగిపోతోంది అన్న ఈ నిజం బోధపడడానికి చాలా ఆలస్యం అయిందనే చెప్పాలి. ఈ మధ్య ఎండలు పేట్రేగి పోవడంతో పగలు కాలు బయట పెట్టడానికి దడిసి ఇంట్లోనే కూర్చుని మా ఆవిడతో కలసి తీరుబాటుగా టీ వీ  చూసే అవకాశం కలిగింది. కరెంటు కూడా అంతరాయం లేకుండా సరఫరా అవుతుండడం వల్ల నా యీ నిరంతర టీ వీ వీక్షణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఎల క్షన్లు కదా! కరెంట్‌ ఇవ్వక ఏం చేస్తాడు రాజశేఖరరెడ్డి ! అంటూ మెటికలు విరుస్తాడు మా సుబ్బారావు. అంత మాత్రాన మా వాడు హార్డ్ కోర్‌ టీ డీ పీ మనిషని మనం పొరపాటు పడితే అది నిజంగా మన పొరపాటే! ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మా సుబ్బారావుది ఇదే వరస. వాళ్ళింట్లో పనిమనిషి నాగా పెట్టినా, వంటగ్యాస్‌ అయిపోయినా, స్కూటర్‌ టైర్‌ పంక్చర్‌ అయినా దానికి కారణం చంద్రబాబు అధ్వాన్నపు పరిపాలనే అని స్టేట్‌ మెంట్లు ఇచ్చే వాడు. అందుకే మా సర్కిల్లో వాడ్ని ఎవర్‌ గ్రీన్‌ యాంటీ ఇంకంబెంట్‌ అని పిలుస్తుంటాము. పది, పదిహేనేళ్ళ వరకూ మాలో చాలా మందికి ఈ ఇంగ్లీషు పదానికి సరైన అర్ధం తెలిసి చచ్చేది కాదు. కాకపోతే ప్రీ పోల్‌ సర్వే - పోస్ట్ పోల్‌ సర్వేలంటూ బయలు దేరిన 'సర్వే'జనా సుఖినోభవంతుగాళ్ళ పుణ్యమా అని ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనే దాన్ని గురించి మాకు బాగా వంట బట్టింది.
సరే! మా సుబ్బారావు యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్‌ సంగతి అలా ఉంచి - దేశం వెలిగిపోతోందనే విషయానికి వద్దాం!

వెనుకటి రోజుల్లో భారతదేశం ఎంత దరిద్రగొట్టుదో తెలుసుకోవాలంటే బీ బీ సీ చూడాలనేవారు. వాళ్ళు  చూపించే డాక్యుమెంటరీల్లో మన దేశపు పసి పిల్లలు డొక్కలెండుకుపోయి - అన్నమో రామచంద్రా అని అలమటిస్తూ కాన వచ్చేవారు. పందులు తిరిగే సందులు, పూరిగుడిసెలు, ఆకలి, హాహాకారాలు వాటిల్లో పుష్కలంగా కానవచ్చేవి. అవి చూసి మన దేశం ఇంత దరిద్రంగా ఉందా అని అనుమాన పడేవాళ్ళం మా చిన్నతనంలో. ఇక ఇప్పుడు టీ వీ ల వరుస చూస్తే దేశంలో దరిద్రం అన్నది మచ్చుకు కూడా లేదనిపిస్తుంది.

ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలతో,చుట్టూరా  పచ్చదనంతో పరిఢవిల్లేలా కళ్ళకు కట్టినట్టు చూపించే  రియల్‌ ఎస్టేట్‌  ప్రాయోజిత కార్యక్రమాలు,

 'వండుకు తిందాం రండి ' వంటి ప్రోగ్రాముల్లో పెళ్ళిళ్లు , పేరంటాళ్ళలో కట్టుకునే అతి ఖరీదయిన చీరలు ధరించి, 'ఇలా చేసి మాడండి' వంటకాలు వండుతూ కనిపించే ఆడంగులు, నేరేడు పండ్లని ముక్కుతో పట్టి నోటితో ఎన్ని తినగలరన్న పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనే శాల్తీల తాలూకు అపార్ట్మెంట్లలో బ్యాక్‌ గ్రౌండ్‌లో కానవచ్చే ఖరీదుకట్టలేని ఫర్నీచర్‌ ,

 'పంచపాండవులెంతమంది! నలుగురా! ముగ్గురా! అయిదుగురా! సరిగ్గా సమాధానం చెప్పేవారికి ఈ బంగారం అంతా మీదే ' అంటూ భ్రమలు కల్పించి బంగారులోకంలో విహరింపజేసే కార్యక్రమాల్లోని సెట్టింగులు -

వీటిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది?  'దేశం వెలిగిపోతోంద'ని అనిపించడం లేదా?
ఈ నిత్య  నూతన నిరంతర వార్తా స్రవంతుల మధ్య-
కోటి రూపాయల అపార్టుమెంట్లు - ఘుమఘుమల రెస్టారెంట్లు,


 వొళ్లు తగ్గించుకోవడానికి శతకోటి చిట్కాలు,  కళ్ళు  బైర్లుకమ్మే షాపింగ్‌  మాల్స్, క్లబ్బులు, పబ్బులు, మల్టీప్లెక్సులూ-




పట్టకారు కొనుక్కోండి అన్నంత సులభంగా ఈ కొత్త మోడల్‌ కారు కొనుక్కోండి అనే అర్ధగంట ప్రకటనలూ - ఇవన్నీ చూస్తున్నప్పుడు కూడా దేశం వెలిగిపోవడం లేదన్న భావం కలిగితే నిజంగా లోపం మనలోనే వుందనుకోవాలి.
కానీ మరొక్క విషయం టీ వీ ఛానళ్ళ కార్యక్రమ నిర్వాహకులు ఆలోచించుకుంటే బాగుండనిపిస్తోంది.

 ఇన్నిన్ని కార్యక్రమాల్లో ఇన్నిన్ని ధగధగలు చూపిస్తూ మరోప్రక్క నేరాలు - ఘోరాలవంటి కార్యక్రమాల్లో కూతుర్ని రేప్‌ చేసిన కామంధుడంటూ దిగువ తరగతి వారికి సంబంధించిన కధనాలు మాత్రమే ఎందుకు ప్రసారం చేయాల్సి వస్తోంది? ఉన్నతశ్రేణి వర్గాల్లో ఈ ఘోరాలు జరగవా? జరిగినా బయటకురావా? వచ్చినా, ప్రసారాలకు పనికిరావా?

కధ చెబుతా - ఊ కొడతారా  


తాజా తోక
ఇలాంటి నేర ఘోర కార్యక్రమాల ప్రాయోజికుల రూపం, హావభావాలు, ఉచ్ఛారణ కరడుగట్టిన నేరస్తులను తలపించేలా ఉండి తీరాలన్న రూలేమైనా ఉందా?
భండారు శ్రీనివాసరావు
21-5-2008

NOTE: All the images in this blog are copy righted to the respective owners

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి