(ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియోలో ప్రసారితం)
జీవనస్రవంతి - 1
'ఉప్పంటే ఏమిటి? దాని రుచి ఎలా వుంటుంది?' అంటే తెలియదు-
'రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే అదీ తెలియదు.
ఇవి ఏ ఇంటర్వ్యూ లోనో అడిగిన షరా మామూలు ప్రశ్నలు - జవాబులు కావు.
యెంతో అభివృద్ధి జరిగిందని జగమంతా అనుకుంటున్న సోవియెట్ రష్యా లాంటి దేశంలోని ఒక మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న ఒకానొక తెగవారు గత నలభై సంవత్సరాలనుంచి ఉప్పు రుచి ఎరగరు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సంగతే వారికి తెలియదు.
ఈ మధ్య దారితప్పిన ఓ పరిశోధకుల బృందం - దారి తెలియక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తెలియవచ్చిన విషయాలు ఇవి.
జీవన స్రవంతి -2
పశ్చిమ బెంగాల్ లోని పోలిసులు పాగా వేసి ఓ పాగా లేని పెద్ద మనిషిని పట్టుకున్నారు. అతని దగ్గర పోలితిన్ సంచీ ఒకటి వారికి దొరికింది. దాంట్లో రెండు పుర్రెలు బయట పడ్డాయి. ఈ పుర్రెల సంగతి చెబుతావా? నీ బుర్ర రామకీర్తన పాడించమంటావా అని పోలీసులు సుతారంగా బెదిరించేసరికి, పాపం ఆ పుర్రెల షావుకారు జావకారిపోయి అసలు సంగతి ఒప్పేసుకున్నాడు. పుర్రెల్ని కలకత్తాలో హెచ్చు ధరలకు కొనే బడా వ్యాపారులున్నారన్న రహస్యం బయటపెట్టి వారి పుట్టి ముంచేసాడు. దాంతో పోలీసులు కలకత్తాలో కూడా దాడులు చేసి పుర్రెల వ్యాపారం చేసే వారిని పట్టేసుకుని కటకటాల వెనక్కు నెట్టేశారు.
జీవన స్రవంతి -3
దేశంలోని గూడ్స్ రైళ్లన్నీ కలసి ఏటా ఎంత సరుకుని రవాణా చేస్తున్నాయో - అంత కంటే ఎక్కువగా ఎడ్ల బండ్లపై సరుకుల రవాణా జరుగుతోందని ఆ మధ్య ఓ సర్వేలో తేలింది. ఇప్పుడా ఎడ్ల బండి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
జీవన స్రవంతి -4
ఒక్కో దేశంలో జనాన్ని ఒక్కోరకమైన వింత రోగాలు పట్టి పీడిస్తుంటాయి.
ఈ మధ్య ఇంగ్లాండ్ లో జనం విపరీతంగా వొళ్ళు పెరిగిపోయి తెగ బాధ పడిపోతున్నారట. కాస్త కండ పట్టి, వొళ్ళు చేసి నిగ నిగలాడుతూవుంటే . బాగానే వుంటుందికాని, పెరిగే వొళ్ళు పెరిగిపోతూనేవుంటే ఏం బాగుంటుంది చెప్పండి ? ఇలా వొళ్ళు పెరిగిపోయే జబ్బు - రోజు రోజుకు పెరిగి పోతూ వుండడంతో .- జనంలో ఆందోళన కూడా అదే మోతాదులో పెరిగిపోతోందని అక్కడి రాయల్ వైద్య కళాశాల నివేదికలో పేర్కొన్నారు. పెద్దవారిలో ముప్పయి శాతం- పిల్లల్లో అయిదు శాతం ఊబకాయంతో లబ లబ లాడుతూ వున్నారట. గున్న ఏనుగుల్లా బలిసిన చిన్న పిల్లలు గున గున తిరుగుతూ- బరువు తగ్గడమెలా అన్న బెంగతో మంచమెక్కి - మరింత వొళ్ళు చేస్తున్నారట.
జీవన స్రవంతి -5
గుండె భద్రం తమ్ముడూ అంటున్నారు డాక్టర్లు.
అయితే గుండె గురించి గుండె చెరువు అయిపోయే విషయాలు వీళ్ళిలా చెబుతుంటే- అమెరికాలోని ఫ్లోరిడా వైద్య కళాశాలలో పనిచేసే శాస్త్రవేత్తలు - చెప్పాపెట్టకుండా ఆగిపోయే గుండెని ఎన్నాళ్ళు నమ్ముకుంటామని ఏకంగా ఒక నకిలీ గుండెనే తయారుచేసారు. హృదయ చలనం ఆగిపోయిన రోగికి ఈ అయస్కాంతంతో రూపొందించిన ఈ నకిలీ గుండెని అమరిస్తే- గుండె చేసే పనులన్నీ అదే చేసేస్తుందట.
జీవన స్రవంతి -6
చాదస్తం మొగుడు చెబితే వినడు- కొడితే ఏడుస్తాడు అన్నట్టయింది పంజాబులో ఓ భర్తగారి పరిస్తితి.
అమృతసర్ దగ్గర ఓ ఊళ్ళో ఒక పెద్దమనిషి ఇంటి విషయాలు ఏమాత్రం పట్టించుకోకుండా - కేవలం వొంటికి మందు పట్టించడంలోనే ఎక్కువ సమయాన్నీ, డబ్బునూ ఖర్చు చేస్తూ వుండేవాడు.
ఇంటి ఇల్లాలుకి ఇంటి ఖర్చులకింద ఏమీ ఇవ్వకుండా- సంపాదన అంతా తాగుడికే తగలేస్తూవుండడం ఆవిడకు సుతరామూ నచ్చేదికాదు.
నచ్చని సంగతి నయాన చెప్పింది. ఏడుస్తూ చెప్పింది. వేడుకుంటూ చెప్పింది. అయితే- మందు తలకెక్కిన ఆ పెద్దమనిషికి పెళ్ళాం మాటలు మాత్రం మనసుకు ఎక్కలేదు. పైపెచ్చు- ఇంట్లో గొడవలన్నింటికీ మందే మందు అని ధృడంగా నమ్మేసి తన మందు గొడవలోనే కూరుకుపోయాడు.
దానితో ఆ ఇల్లాలుకి చిర్రెత్తుకొచ్చింది.
భర్త పని చేసే దుకాణం ముందు ధర్నా ప్రారంభించింది. చోద్యం చూస్తున్నవారందరికీ తన మొగుడి నిర్వాకాన్ని తెలియచెప్పింది. ఆ విధంగా భాద్యత తెలియని భర్తలందరికి బుద్ధి చెప్పింది.
జీవన స్రవంతి -7
'అడుక్కోవాల్సిన ఖర్మ నాకేం పట్టింది- అప్పిచ్చే వాళ్ళు న్నంతకాలం.' అన్నాడొక అప్పారావు.
నిజమే. వూరికే ధర్మం చేసాడా- అప్పిచ్చాడు కాని - అని ఆనక బుకాయించవచ్చు- ఎంచక్కా అప్పు తీసేసుకుని.
పంజాబు నేషనల్ బ్యాంకు వారు అడుక్కునేవాళ్ళకి అప్పులిచ్చిచూద్దామని ఆలోచన చేసి - కొందరు బిచ్చగాళ్ళకు రుణాలు మంజూరు చేశారు.
జీవన స్రవంతి -8
కొందరు సాహసాలు చేసి కీర్తి గడిస్తే- మరికొందరు దుస్సహాసాలకు దిగి జయిల్లో పడుతుంటారు.
ఫ్రాన్సు సైన్యంలో పనిచేస్తున్న ఓ కుర్ర ప్రేమికుడికి - కొత్తగా తళతళలాడుతున్న ఆర్మీ కారు కనిపించింది.
జీవన స్రవంతి -9
ప్రతి బియ్యపు గింజమీద తినేవాడి పేరు రాసుంటుంది అన్నది ఓ సామెత. పెళ్ళిళ్ళ విషయం కూడా అంతే అంటారు. ఎవరికెవరో ఎవరికెరుక ?
సౌదీ అరేబియాలో ఈమధ్య ఇలాంటి ఒక వివాహం - నిజం చెప్పాలంటే రెండు జరిగాయి.
ఇంట్లో వొంట్లో పుష్కలంగా వున్న ఒకానొక పెద్దమనిషి తన ఇద్దరు కుమార్తెలకీ పెళ్లి సంబంధాలు వెతికి- ఘనంగా వివాహ వేడుకలకు ఏర్పాట్లు చేసి- ఆర్భాటంగా నలుగుర్నీ పిలిచి - సరిగ్గా నిఖా సమయానికి నోరు జారి, తన కూతుళ్ళను - ముందు నిశ్చయం చేసుకున్న వరుళ్ళలో - ఒకరికి బదులు మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టు ప్రకటించాడు. తరువాత జరిగిన పొరబాటు తెలుసుకుని, నాలుక కరుచుకుని - , అవసరమయితే విడాకులు ఇప్పించయినా సరే - కూతుళ్ళకి ముందు నిర్ణయించిన వరులతోనే వివాహం జరిపిస్తానని మాట ఇచ్చాడు. అయితే ఆ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే- మారుపడిన మొగుళ్ళ తోనే మనువు కొనసాగిస్తామని ఆ కొత్త వధువులిద్దరూ మారు మాట లేకుండా రాజీ పడిపోయారు.
జీవన స్రవంతి -10
భార్యలమీద ప్రేమని ఒక్కొక్కరూ ఒక్కొక్కవిధంగా వెల్లడిస్తుంటారు కొందరు పెళ్ళాం మెడలో నగలు దిగవేసి తమ వగలు చూపిస్తే- మరికొందరు పట్టు చీరెలతో కట్టుకున్నవారిని ఆకట్టుకుంటూ వుంటారు. మనీలాలో- ఆర్మిడో పినేడా అనే వడ్రంగికి భార్య అంటే వల్లమాలిన ప్రేమ. ఎలాగయినా సరే- కష్టపడి కాసులు కూడబెట్టి - రెండస్తుల మేడ కట్టి- సుఖపెడతానని ఇల్లాలితో ఎప్పుడూ చెబుతుండేవాడు. పాపం- విధి వక్రించి- ఇంతలొ ఆ ఇంటావిడ కన్నుమూసింది.
ఆటను మాత్రం- భార్యనూ, ఆమెకిచ్చిన మాటనూ మరవలేదు. రేయింబవళ్ళు శ్రమించి, డబ్బులు పోగేసి- అనుకున్న ప్రకారం భార్య పేరున ఇల్లు కట్టాడు. ఆమె అవశేషాలతో ఇంట్లోనే సమాధి నిర్మించాడు. దానిపైన- భార్య చాయా చిత్రాన్ని వేలాడకట్టాడు . ఆవిడ జీవించి వుండగా ఉపయోగించిన గ్యాస్ స్టవ్ ను, పడక మంచాలను ఆ సమాధికి దగ్గరగా అమర్చాడు. అలా, గృహ ప్రాంగణం లోనూ, గృహ ప్రాంగణం లోను - ఇల్లాలి జ్ఞాపకాలను భద్రపరచుకుని రోజులు దొర్లిస్తున్నాడు.
NOTE: All images in this blog are copy righted to their respective owners.
మీ బ్లాగు భలె బాగుంది. అప్పుడెప్పుడో మీరు రేడియో ద్వారా ప్రసారం చేసిన సంగతులన్నీ నేటి తరానికి తిరిగి వినిపించేందుకు... అదేనండీ బాబూ... చదివించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే... సమకాలీన కొత్త సంగతులు కూడా జోడిస్తుంటే ఇది నిత్య యవ్వనం సింగారించుకుని కుర్రకారును కట్టేయగల్గుతుంది.
రిప్లయితొలగించండిఇట్లు,
భవదీయ నేస్తం... అంబేద్కర్