అభిమానమా? అధిష్టానమా? – భండారు శ్రీనివాసరావు
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులను కలవర పరుస్తున్న ప్రశ్న ఇది.
దివంగత కాంగ్రెస్ నేత రాజశేఖరరెడ్డి కుమారుడు, కడప ఎంపీ వై ఎస్ జగన్మోహనరెడ్డి తలపెట్టిన ‘ఓదార్పు యాత్ర’ లో మొదటి రెండు ఘట్టాలు కలిగించిన కలకలానికి పరాకాష్టగా మూడో దశ మొదలయి పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అభిమానానికీ, అధిష్టానానికీ నడుమ నలిగిపోతున్నకొందరు పార్టీ నేతలు 'ఈ యాత్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పెనుమార్పులకు తెర తీస్తుంద'ని కలవరపడుతున్నారు. ‘మాట తప్పని, మడమ తిప్పని తత్వం’ తండ్రినుంచి వారసత్వంగా సంక్రమించిందని చెప్పుకుంటున్న జగన్ వెన్ను చూపే ప్రసక్తే లేదని ఆయన అనుయాయులు అంటున్న నేపధ్యంలో - క్రమ శిక్షణను ఉల్లంఘించే వారిపై వేటుపడకతప్పదని, పార్టీని కాదని వెళ్లేవారికి రాజకీయంగా పుట్టగతులు వుండబోవని ఆయన రాజకీయ ప్రత్యర్ధులు తేల్చి చెబుతున్న పరిణామ క్రమంలో - జగన్ అనుకూల, ప్రతికూల వర్గాలుగా పార్టీ శ్రేణులు నిట్ట నిలువుగా చీలిపోయి, మాటల ఈటెలతో బుల్లితెరలపై నికృష్ట రాజకీయాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్న తరుణంలో - జగన్ ఓదార్పు యాత్ర - ఈ వ్యాసం రాసే సమయానికి, అంచనాలను మించి సాగుతోంది. నిరుటి ఎన్నికల్లో ప్రతిపక్ష 'మహాకూటమిని' మట్టి కరిపించి వరసగా రెండోపర్యాయం అధికారపగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ- వైఎస్సార్ చనిపోయి ఏడాది తిరగకుండానే ‘కాళ్ళ పారాణి’ సామెతను గుర్తుచేస్తూ ఇలా గందరగోళంలో పడిపోతుందని కాకలు తీరిన రాజకీయపండితులు కూడా వూహింఛి వుండలేదు.
పొతే, ఇరుపక్షాలు తమ స్కంధారావాలతో తుదిపోరుకు సిద్దమయినట్టుగా మీడియా కోడై కూస్తోంది. జగన్ వైఖరిపై అధిష్టాన దేవత అగ్గిపై గుగ్గిలం చందాన ఆగ్రహంతో వున్నట్టు పరోక్ష కధనాలతో అగ్నికి ఆజ్యం పోస్తోంది. అధిష్టానం బూచిని చూపిస్తూ మరో పక్క జగన్ వ్యతిరేక శిబిరం పార్టీ శ్రేణులను అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అమీతుమీ తేల్చుకునే రీతిలో జగన్ పక్షం పట్టుదలగా వుండడం రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. పాలకపక్షంలో బయటపడుతున్న ఈ చీలిక ప్రతిపక్షాలను ఆశల పల్లకీలో వూరేగిస్తోంది. 2009 ఎన్నికల్లో సమైక్యంగా వుండి కూడా సాధించలేని దానిని - కాంగ్రెస్ లోని ‘అనైక్యత’ అప్పనంగా అందించే పరిస్తితి ఇంత త్వరగా అందిరావడం ప్రతిపక్షాలకు ఆడబోయిన తీర్ధం ఎదురయిన చందంగా గోచరిస్తోంది. ఇంకా నాలుగు సంవత్సరాలు ‘పాలించే’ వీలున్నప్పుడు - ఎదురుతిరిగే వారిని ‘లాలించే’ ప్రసక్తే లేదన్న ధోరణిలో ‘ ధిక్కారమున్ సైతునా ’ అన్నట్టు కాంగ్రెస్ అధిష్టాన దీవత కొలువులోని పూజారులు, వారి తాబేదారుల ముఠా తన సహజ శైలిలో హుంకరిస్తోంది. ' ‘ఔరా! ఇలాటి వారికా మనం వోట్లు వేసి, పట్టంకట్టి నెత్తికెత్తుకుందని ' ఇవన్నీ గమనిస్తున్న షరా మామూలు ప్రజానీకం' మౌన వేదనకు గురవుతోంది.
ఇలా జరుగుతుందని పదినెలల క్రితం ఎవరయినా వూహించారా!
కానీ రాజకీయం అన్నది ఇలాగే వుంటుంది. అధికారం అన్నది ఇలాగే ఆడిస్తుంది. ఈ ఆట ఇలాగే కొనసాగుతుంది. ఎప్పటిదాకా? ప్రజలు కళ్ళు తెరిచేదాకా! (12-07-2010)
NOTE: All the images in this blog are copy righted to their respective owners.
nice article sir
రిప్లయితొలగించండిthanks - bhandaru srinivasrao
రిప్లయితొలగించండి