31, జులై 2010, శనివారం

అమెరికా అనుభవాలు – 24

అమెరికా అనుభవాలు – 24




స్వేచ్చతో పాటు బాధ్యత

అమెరికాలో వ్యక్తిగత స్వేచ్చకు స్వచ్చందంగా గీసుకున్న సరిహద్దు రేఖల కారణంగా దాన్ని దుర్వినియోగపరిచే అవకాశాలు తగ్గిపోయాయి. పౌర హక్కుల ఉద్యమాలు బలంగా వున్నా వాటిపై రాజకీయ నీలినీడలు సోకిన సంకేతాలు లేవనే చెప్పాలి. ప్రభుత్వ విధానాలను నిరసించే విషయంలో పౌరుల ప్రతిస్పందనలు భాద్యతతో కూడి వుంటాయి. ప్రజాస్వామ్య హక్కుల పేరుతొ బందులు, హర్తాళ్ళ వంటి చర్యలకు పూనుకుని పౌరజీవితాన్నిఅతలాకుతలం చేయడం ఏనాడూ చూడలేదు. ఎన్నికల ప్రచారాలు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టని రీతిలో వుంటాయి.

 మేమున్న రోజుల్లో సియాటిల్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగాయి. రోడ్లపక్క పేవ్ మెంట్ల పై - పలానా వారికే వోటు వెయ్యమని కోరుతూ చిన్న చిన్న బోర్డులు మినహా ఎలాటి ప్రచార ఆర్భాటం మా కంటబడలేదు.







ఎవరికో వీడ్కోలు చెప్పడానికి ఆ మధ్య ఒకరోజు విమానాశ్రయానికి వెళ్ళాము. ఎవరినో రిసీవ్ చేసుకోవడానికి నలుగురయిదుగురు వచ్చారు. వారి చేతుల్లో WELCOME TO CLARK అనే ప్లకార్డులు వున్నాయి. మేము చూస్తుండగానే ఆ క్లార్క్ మహాశయులు బయటకు వచ్చారు. ఆయన ఎవరో కాదు, 2004 నవంబరులో జరిగిన అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్ధి స్తానం కోసం పోటీపడిన నలుగురయిదుగురిలో ఆయన ఒకరు. ఎలాటి పటాటోపం లేకుండా – క్లార్క్ – తన నామినేషన్ ప్రచారం నిర్వహించుకుంటున్న తీరు నివ్వెరపరచింది. విమానాశ్రయం అధికారులు కూడా ఆయన రాక పట్ల ‘అత్యుత్సాహం’ ప్రదర్శించలేదు.


ఇండియన్ అమెరికా

అమెరికాలో అన్నిదేశాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో కానవస్తారు. టూరిష్టులుగా వచ్చిన వారే కాకుండా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే వుంటూ, చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ స్తిరపడ్డవాళ్ళు అనేకమంది వున్నారు. అలాగే మన దేశం నుంచి కూడా. వైద్య విద్యారంగాల్లో భారతీయులు అనేకమంది పెద్ద సంఖ్యలో పాతుకు పోయారు. అష్టయిశ్వర్యాలతో తులతూగుతున్న అనేకమంది సంపన్న అమెరికన్లకు సరితూగగల భారతీయుల సంఖ్య కూడా తక్కువేమీకాదు.



 శాన్ ఫ్రాన్సిస్కో లోని ఇండియన్ అసోసియేషన్ వారు నిరుడు తమ ఉత్సవాల కోసం ఒక ప్రసిద్ధ హినీ నటుడిని ఆహ్వానించారట. ఆయనకు ఒక భారతీయ డాక్టర్ ఇంట్లో బస ఏర్పాటు చేసారు. ఒక కొండపై ఆ డాక్టర్ కట్టుకున్న విలాసవంతమయిన భవంతిని చూసి – కోట్లు గడిస్తున్న అంత పెద్ద నటుడు కూడా కళ్ళు తేలవేసాడట. ఇక్కడ మన వారి సంపాదనను గురించి తెలియ చెప్పడానికి ఈ విషయాలు చెబుతుంటారు.

అలాగే మన రాష్ట్రానికి చెందిన వారు కూడా అనేక మంది ఇక్కడకు వచ్చి హోటళ్ళు, రెష్టారెంట్లు, వెండి బంగారు నగల దుకాణాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాదు నుంచి వచ్చిన ఒక రెడ్డి గారు సియాటిల్ లో  పెద్ద షాపు నడుపుతున్నారు. కరివేపాకునుంచి మన వాళ్లకు అవసరమయిన సమస్తం ఇక్క డ లభిస్తాయి. పాత దేవదాసు సినిమా నుంచి కొత్తగా విడుదలయిన అన్ని సినిమాల సీడీలు దొరుకుతాయి.







పోతే కంప్యూటర్ పుణ్యమా అని ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ రెండు చేతులతో (భార్యా –భర్తా) ఆర్జిస్తున్న వాళ్ళు కోకొల్లలు.



 మన దేశంలో కలలో సయితం ఊహించని జీవన ప్రమాణాలు అనుభవిస్తున్నారు. వీరి మూలంగా వారి కుటుంబాలు సయితం ఆర్ధికంగా తెరిపిన పడుతున్నాయి.

శాన్ ఫ్రాసిస్ స్కో లోని ఒరేకిల్ కార్యాలయానికి వెడితే – అక్కడ ప్రతి అంతస్తులో తెలుగు వారి నేమ్ ప్లేట్లు కనిపించాయి. వీరంతా ఆ కంపెనీలో చాలా పెద్ద పెద్ద హోదాల్లో పనిచేస్తున్నారు. నిజానికి వారికి ఈ ఉద్యోగాలు ఉత్తి పుణ్యానికి రాలేదు. చాల కష్టపడి చదువుకుని నా అన్న వాళ్ళందరినీ వొదిలి ఇంతంత దూర ప్రదేశాలకు వచ్చి సెటిలయి జీవిస్తున్నవారే. ఎవరూ కాదనరు. కానీ వీళ్ళల్లో ప్రతి ఒక్కరూ – ప్రతిభ కలిగిన మరో విద్యార్ధికి అండదండలను అందించి వారిని కూడా తమ మాదిరిగానే పైకి తీసుకురాగలిగితే- ఆ విదంగానే ఈ పరంపర కొనసాగితే – ఈ సంపాదనలకు ఒక అర్ధం పరమార్ధం వుంటుంది.

"ప్రార్ధన చేసే పెదాలకన్నా - సాయం చేసే చేతులు మిన్న"

NOTE: All Images in this blog are copy righted to their respective owners

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి