30, జులై 2010, శుక్రవారం

అమెరికా అనుభవాలు - 15

అమెరికా అనుభవాలు - 15

కారులో షికారుకెళ్ళే ........

మా అమెరికా యాత్రలో మరో అత్యద్భుత ఘట్టం నవంబర్లో మొదలయింది.
ఒక వీక్ ఎండ్ కు అటూఇటూ సెలవులు జోడించి లాల్ – గ్రాండ్ కేనియన్, లాస్ వెగాస్ - ట్రిప్ కు ప్లాన్ చేసాడు. నిజానికి మేము సియాటిల్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడానికి నెల రోజుల ముందుగానే- హోటల్ గదులు, మేము చూడబోయే ప్రదేశాలలో ఎంట్రీ టికెట్లు ఇంటర్నెట్ లో బుక్ చేసాడు. నేనూ, మా ఆవిడ నిర్మల, లాల్, అతడి అత్తమామలు కరుణ,రామచంద్రం (నా మేనల్లుడే), లాల్ స్నేహితుడు శ్రీనివాస్, ఆయన శ్రీమతి జ్యోతి - అంతా కలసి ఉదయమే రెంటల్ కారులో రోడ్డు మార్గాన వెళ్లేట్టు, లాల్ భార్య దీప, కుమార్తె స్పురిత (ఏన్నర్ధం పసిపిల్ల) ఆ సాయంత్రం విమానంలో బయలుదేరి, మేము లాస్ వెగాస్ చేరేసమయానికి వాళ్ళు కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాము. ఉదయం ఎయిర్ పోర్ట్ కి వెళ్లి – ఎనిమిదిమంది సుఖంగా ప్రయాణించే ఒక పెద్ద కారును రెంటల్ కంపెనీ నుంచి కిరాయికి తీసుకున్నాము. ఇలా కార్లు అద్దెకు ఇచ్చే కంపెనీలు దేశంలోని అన్ని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో వుంటాయి. ఇంటర్నెట్ ద్వారా కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు.


 ఒక చోట కారు తీసుకుని స్వయంగా నడుపుకుంటూ వెళ్ళిపోయి - వేరే ఊళ్ళో వదిలివేయవచ్చు. అతి ఖరీదయిన మెర్సిడెజ్ కార్లు కూడా రెంట్ కి దొరుకుతాయి. ఒక్కొక్క కంపెనీ వందలాది కార్లు ఒక్కొక్క చోట మెయిన్ టైన్ చేస్తుంది. విశాలమైన యార్డ్ లో తళ తళ మెరిసే సరికొత్త కార్లు ట్యాంక్ నిండా పెట్రోలుతో బారులు తీరి సిద్దంగా వుంటాయి. నెట్ లో వివరాలు సరిచూసుకుని కారు నెంబర్ ఇస్తారు. కారు తాళం చెవి కూడా కారుకే తగిలించి వుంటుంది. మనకు కేటాయించిన కారుని తీసుకుని ఝామ్మున వెళ్ళిపోవచ్చు.



 సొంత కార్లు వున్నవాళ్ళు కూడా దూర ప్రయాణాలకు రెంటల్ కార్లనే వాడడం కద్దు. కారు తిరిగి వాపసు చేసేటప్పుడు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ తో ఇవ్వాలి. తిరిగి తీసుకునేటప్పుడు కారుని కనీసం చెక్ చేయరు. కాకపోతే శుభ్రంగా తుడిచి అప్పచెప్పాలి.
శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ వెగాస్ సుమారు అయిదువందల మైళ్ల దూరం. చాలావరకు ఎడారి భూములు. హైవే (ఫ్రీ వే) చాలా బాగుంది. అతి వేగంగా వెళ్ళేవారిని నియంత్రించడానికి పోలీసు పెట్రోలింగ్ వాహనాలు అస్తమానం గస్తీ తిరుగుతూనే వుంటాయి. ఇందుకోసం హెలికాప్టర్లను కూడా వాడుతున్నారు.


 మధ్యలో కారు ఆపి దారి వాకబు చేయడానికి వీలుండదు. రోడ్ మ్యాప్, లేదా జీపీయాస్ సిస్టం ఆధారంగా వెడుతూవుండాలి. మొత్తం మార్గమంతా కొండలమయం. ఒక కొండ ఎక్కడం,దిగడం - మళ్ళీ మరో కొండ ఎక్కడం,దిగడం – ఇలానే  సాగుతుంది.

.




వాహనాల రాకపోకలకోసం నాలుగేసి లేన్ ల చొప్పున ఆ కొండలమీడుగా రోడ్లు వేసారు. ఎక్కడా వొంపులు వుండవు. వేల అడుగులు పైకి వెళ్లి మళ్ళీ ఏటవాలుగా కిందికి దిగిపోతుంటాయి. అమెరికా చేస్తున్న లేదా లోగడ చేసిన రోదసీ పరిశోధనలకంటే – రోడ్లు నిర్మించి వాటిని నిర్వహిస్తున్న విధానమే అపూర్వంగా తోచింది. మధ్య మధ్యలో ఏవేవో పట్టణాలు,పల్లెలు తగిలినా అవి ఫ్రీ వే కు దూరంగానే వుంటాయి.


 వాటికి వెళ్ళాలంటే ఫ్రీ వే నుంచి పక్కకు తొలగి వేరే మార్గంలో ఫ్లయి ఓవర్ల మీదుగా ప్రయాణించాల్సి వుంటుంది. మార్గ మధ్యంలో ఆహార పానీయాలకు వెతుక్కోవాల్సిన పని లేదు.


 మెక్డోనాల్డ్, బర్గర్ కింగ్, స్టార్ బక్స్ వంటివి అన్ని చోట్ల అందుబాటులో వుంటాయి. బాటా షాపుల మాదిరిగా వీటి డిజయినింగ్, పదార్ధాల తయారీ, ధరవరలు ఒకేమాదిరిగా వుంటాయి. కాకపొతే మద్యం తాగి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమే కాదు నేరం కూడా.

 పొతే, గ్యాస్ అంటే పెట్రోలు ధరలే విచిత్రం. రోడ్డుకు ఇవతల బంకులో ఒక ధర వుంటే అవతల బంకులో ఇంకో ధర వుంటుంది. కంపెనీని బట్టి ధరల్లో ఆ వ్యత్యాసం. ధరలను బంకుల్లో ప్రస్పుటంగా ప్రదర్శిస్తుంటారు.

NOTE: All images in this blog are copy righted to their respective owners




  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి