25, మే 2010, మంగళవారం

మీలో పాపం చేయనివాడు ఎవరో చెప్పండి? – భండారు శ్రీనివాస రావు

మీలో పాపం చేయనివాడు ఎవరో చెప్పండి? – భండారు శ్రీనివాస రావు











గత కొద్ది రోజులుగా తెలుగు చానళ్ళలో – వైఎస్సార్ సంక్షేమ పధకాల భవిష్యత్తు గురించి చర్చోపచర్చలు సాగుతున్నాయి.

నిధుల లేమి సాకుతో ఈ పధకాలకు గండి కొట్టే ప్రయత్నం జరుగుతోందని పాలక పక్షం లోనే కొందరు బాహాటంగా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. రాజశేఖరరెడ్డి ప్రజలకిచ్చిన వాగ్దానాలను తోసిరాజంటే- వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆ జనమే పార్టీకి ‘మొండి చేయి’ చూపిస్తారని హెచ్చరిస్తున్నారు.


అయితే, ఈ సంక్షేమ పదకాలకే కాదు – అసలు ప్రభుత్వం పూనిక వహించిన ఏ పదకానికయినా పూచీకత్తు వహించాల్సిన ముఖ్యమంత్రి రోశయ్య గారు మాత్రం – ఎటువంటి పరిస్తితుల్లోను సంక్షేమ పధకాలను నిలుపుచేసే ప్రసక్తే లేదని పదే పదే ఘంటాపధంగా చెబుతూ వస్తున్నారు. అయినా కూడా అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో – ఈ చర్చ రచ్చరచ్చగా తయారవుతోంది. ‘తప్పు చేస్తే సోనియానయినా నిలదీస్తాం’ అనేవరకు ఇది సాగి చివరకు ఈ సెగ డిల్లీ వరకూ పాకింది. ముఖ్యమంత్రి,- పీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఇద్దరు ఒకేరోజు హస్తిన ప్రయాణం పెట్టుకోవడంతో – అధిష్టానం ఆగ్రహంతోవుందన్న పుకార్లకు కూడా పట్టుచిక్కింది.
మూడు ముఠాలు , ఆరు వర్గాల సంస్కృతి కలిగిన కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీకి ఈ ‘కలహాల కాపురాలు’ కొత్తేమీ కాదు. వీటన్నిటినీ పిల్లకాయల ఆటలుగా కొట్టేయడం డిల్లీలో పెత్తనం చేసే పెద్దల అలవాటు. అవసరం అనుకునేవరకూ – పట్టించుకోనట్టుగా వ్యవరించగల దీమంతం ఆ పార్టీ సొంతం. పైగా మీడియాలో సాగే ఈ రకమయిన చర్చలూ రచ్చలూ ఒక రకంగా ఆ పార్టీకి బలమూ, బలహీనతా రెండూ కూడా. కాకపొతే ముఠాభక్తి మరింత ముదిరి, ఏకంగా అధినాయకత్వానికే కాక తగిలే రీతిలో మాటల తూటాలు ప్రయోగించినప్పుడే వస్తుంది ఇలాంటి తంటా. గల్లీ గోలలన్నీ డిల్లీ చేర నంతవరకే అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అధిష్టానంవారు అనుమతిస్తారన్నది జగమెరిగిన సత్యం.

రాజశేఖరరెడ్డి మరణం వరకూ నివురుగప్పిన నిప్పులా వున్న ముఠా తగాదాలు ఆ తరవాత ఒక్కసారిగా పెచ్చరిల్లి బజారున పడుతున్నాయి. సహజంగానే ఈ పరిణామాలన్నీ మీడియాకు వండి వార్చిన సిద్దాన్నం కావడంలో అసహజమేమీ లేదు.
‘మాట్లాడుకోవడానికి పార్టీ వేదికలున్నాయి. ఇలా త్వరపడి మీడియాకెక్కడం మంచిదికాదంటూ’ ఓ పక్క సన్నాయి నొక్కులు నొక్కుతూనే – మరో పక్క అదే నోటితో అనాల్సిన నాలుగు మాటలూ అనేసి చేతులు దులుపుకోవడం నిత్యకృత్యంగా మారుతోంది. ఇలా ఖండన ముండనలూ, విమర్సలు ప్రతి విమర్సలూ, ఆరోపణలు ప్రత్యారోపణలతో కూడిన టీవీ ప్రోగ్రాములతో తెలుగులోగిళ్ళు అన్నీ దద్దరిల్లిపోతున్నాయి. వీటి హోరులో – సదసద్వివేక చర్చలకూ, పూర్వాపరాల పరిశీలనకూ ఎంతమాత్రం అవకాశం లేకుండాపోతోంది. బహుశా ఈ కారణం వల్లనే కావచ్చు – కాంగ్రెస్ పార్టీలోని ముఠా తగాదాలు ఇంతింతై వటుడింతయ్ అన్నట్టు బుల్లి తెరలపై ‘ ఐమాక్స్’ అనుభూతిని అందిస్తున్నాయి. వొడ్డున వుండి తమాషా చూస్తున్న కొన్ని ప్రతిపక్షాలు ‘ఇవన్నీ కాంగ్రేస్ వాళ్ళ అంతర్గత వ్యవహారం’ అని కొట్టేస్తూనే – అగ్నికి ఆజ్యం చందంగా తమ వ్యాఖ్యానాలను జోడించి కధను రక్తి కట్టిస్తున్నాయి. బాలకృష్ణ సింహ గర్జనలనుంచి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి తెలుగుదేశానికి సంక్షేమ పధకాల రచ్చ అక్కరకు వచ్చింది.

 వైఎస్సార్ సంక్షేమ పధకాలను తూర్పారపడుతూ వచ్చిన ఆ పార్టీకి ఇప్పడు అవే ఆదుకునే అస్త్రాలుగా కానవస్తున్నాయి. పేదలకు పనికివచ్చే ఈ సంక్షేమ పధకాలను అమలుచేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి వుండాలే కానీ మనసుంటే మార్గముండదా అంటూ – కాంగ్రెస్ కోర్టు లోకి ఒక కొత్త బంతిని విసిరింది.

‘గత ఆరేళ్ళలో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కూడబెట్టిన అక్రమాస్తులూ, దోచుకున్న సొమ్మూ స్వాధీనం చేసుకుంటే ఎన్ని పధకాలనయినా నిక్షేపంగా అమలు చేయవచ్చని’ ఆ పార్టీ ఇచ్చిన సలహాతో తేనెతుట్టిని కదిపినట్టయింది.

రాష్ట్రంలో రాజకీయ అవినీతికి అసలు మూలాలు టీడీపీలోనే వున్నాయని, ఆ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ నాయకులు పోగేసుకున్న నల్ల ధనంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చని ఎదురుదాడి ప్రారంభం కావడంతో ఈ రగడ కొత్త మలుపు తిరిగింది.

అవినీతి భాగోతంలో అన్ని పార్టీలకు అంతో ఇంతో భాగం వుంది కనుక అంతా కలసి ఈ పని చేస్తే - మరో పాతికేళ్ళ వరకూ ప్రజలపై పైసా కూడా పన్ను వేయాల్సిన పని వుండదని మరి కొందరు మేధావులు విశ్లేషణల్లో వాకృచ్చారు.

ఇదంతా వినడానికి ఎంతో సొంపుగా వుంది. వూహించుకున్నంత మాత్రానే ఆహా అనాలనిపించేదిగా వుంది.

కానీ ఇది జరిగే పనేనా?

కోట్లు ఖర్చుపెట్టి వేలల్లో ఎన్నికల పద్దులు చూపే ప్రజ్ఞాశీలురు- అడ్డదోవలో అక్రమగా ఆర్జించిన సొమ్మును సినిమాల్లో చూపించినంత సులభంగా వొదులుకోగలరా?

పోనీ – అలాగే జరిగిందనుకున్నా – మళ్ళీ ఆ డబ్బుని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సింది తిరిగి వీళ్ళే కదా! ఈ అధికార యంత్రాంగమే కదా!

ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు – అతి సాధారణ అధికారి ఇంటిపై ఏసీబీ దాడిజరిగినా – బ్యాంకు స్ట్రాంగ్ రూముల్లోమాదిరిగా కరెన్సీ నోట్ల కట్టలు బయటపడుతున్న ఈ రోజుల్లో – ప్రజాధనం పక్క దారులు పట్టకుండా ఖర్చుకాగలదని ఆశించడం అత్యాశ కాదా!
ఇలాటి పరిస్థితుల్లో పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు?

ఎవరు వీరిలో పవిత్రులు?

అందుకే ఒక సినీ కవి చెప్పినట్టు –

ఒకరిపై రాయి విసిరేముందు -
‘మీలో పాపం చెయ్యనివాడు ఎవరో చెప్పండి?’

(24-05-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి