16, మే 2010, ఆదివారం

రాజశేఖరరెడ్డి – రోశయ్య -






రాజశేఖరరెడ్డి
 రోశయ్య


రెండోసారి వరసగా నిరుడు రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల va ఏడాది  పాలనను పూర్తిచేసుకుని ప్రధమ వార్షికోత్సవాన్ని పునరంకిత సభగా నిర్వహించింది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వమా  లేక రోశయ్య సర్కారా అన్న మీమాంస అనవసరం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు ద్వారా ఎన్నికయిన చట్టబద్ద ప్రభుత్వంగానే పరిగణించాలి. అంతే కాని, రాజశేఖరరెడ్డి మరణంతో రాష్ట్రంలో ఒక పార్టీ ప్రభుత్వం పోయి మరో పార్టీ ప్రభుత్వం వచ్చినంతగా కలవరపడాల్సిన పనిలేదు.     
రాజశేఖరరెడ్డి అమల్లో పెట్టిన పధకాలనన్నింటినీ రోశయ్య ఒక పధకం ప్రకారం నీరు కారుస్తున్నారని వెల్లువెత్తుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రభుత్వం ఏకంగా ఒక భారీ ప్రకటనను పత్రికల్లో ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ  విమర్శలు ఏ స్తాయికి చేరాయో అర్ధం చేసుకోవచ్చు.
ఇద్దరు మాజీ ముఖ్య మంత్రులు  ఎన్టీ రామారావు, రాజశేఖరరెడ్డి, వేర్వేరు పార్టీలకు చెందినవారయినా  – సంక్షేమ పధకాల రూపకల్పన, వాటి అమలు విషయంలో-ఈ ఇరువురికీ వున్న  నిబద్దతే  వారిని ప్రజలకు దగ్గర చేసిందనే వారు కూడ లేకపోలేదు. ఎన్నెన్ని అవరోధాలు ఎదురయినా సరే ఎన్నికల పోరులో పార్టీని వొడ్డునపడేయడానికి వారికి ఈ నిబద్దతే వారికి అక్కరకు వచ్చింది. ఖజానాపై పడే భారాన్ని కూడా లెక్కచేయకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పధకాలను అమలు చేయాలన్న పట్టుదలే కొన్ని సందర్భాలలో వారి పాలనా సామర్ధ్యాన్ని ఆర్ధిక నిపుణులు  శంకించే పరిస్తితులను సృష్టించింది. తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు, మళ్ళీ ఇప్పుడు రోశయ్య ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు – వారికి ముందున్న ముఖ్య మంత్రులు – రామారావు, రాజశేఖరరెడ్డి ఇరువురు కూడా ప్రజల మనస్సులను ముందు గెలుచుకుని తరువాత అధికారంలోకి వచ్చిన వారే కావడం గమనార్హం. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన పధకాలే కాకుండా, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదనంగా  అనేక   ప్రజాకర్షక పధకాలను ప్రకటించి, అమలు చేసిన ఘనత వారిది. తాము  మాత్రమే వాటిని అమలు చేయగలరన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించి, పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని రగిలించి అధికార పీఠం అధిరోహించిన చరిత్ర కూడా  వారిదే.
పోతే, ఇక ప్రస్తుతానికి వస్తే-

ఒక విపత్కర, అనూహ్య దారుణ సంఘటన కారణంగా రాష్ట్రం యావత్తూ  చేష్టలుడిగివున్న స్తితిలోకాంగ్రెస్ పార్టీ అదిష్టానం –హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన రాజశేఖరరెడ్డి స్తానంలో –వయస్సు పైబడుతున్న కారణంగా క్రమేపీ రాజకీయాలనుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి ఏనాడో వచ్చి – ఆ దృష్టి తోనే  ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా శాసన మండలికి పరిమితమై మంత్రిమండలిలో సీనియర్ సభ్యుడిగా కొనసాగుతున్న రోశయ్యను ముఖ్యమంత్రిగా నామినేట్ చేసింది. ఈ విషయంలో ఆయన ఎంతో అదృష్టవంతుడయిన కాంగ్రెస్ నాయకుడనే చెప్పాలి. ఎందుకంటె, రాజకీయాల్లో ఈనాడు ఎంతో ప్రధానంగా పరిగణిస్తున్నకులం, ధనం, వర్గం – వీటిల్లో ఏ కోణం నుంచి చూసినా – ఏ రకమయిన ప్రాధమిక అర్హతా  లేకుండా,కనీస స్తోమతా లేకుండా - రోజు రోజుకూ మీదపడుతున్న వయస్సు ఒక అడ్డంకి కాకుండా – అదిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు చోటా మోటా కాంగ్రెస్ నాయకులందరూ హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన సంప్రదాయం బలంగా వేళ్ళూనుకునివున్న పార్టీలోవుంటూ కూడా, అధిష్టానం కొలువైవున్న  కొత్త డిల్లీలో ఒక్క మారు కూడా కాలుపెట్టకుండా ముఖ్యమంత్రి  పీఠం ఎక్కగలిగారంటేఆయనకు వున్న సీనియారిటీకి తోడు  అదృష్టం కూడా  కలిసివచ్చిందనే అనుకోవాలి. ఈ వాస్తవాన్ని బయటవారు కాకుండా ఆయనే స్వయంగా పలుమార్లు ప్రస్తావించడం గమనార్హం. ఇటు ప్రభుత్వాన్నీ , అటు పార్టీ అధిష్టానాన్నీ తన కనుసన్నల్లో వుంచుకోగల శక్తియుక్తులు, ప్రతిభాసామర్ధ్యాలు కలిగిన రాజశేఖరరెడ్డి వారసుడిగా పాలన సాగించడం అంటే కత్తిమీద సాము  అన్న వాస్తవం తెలిసిన మనిషి కనుక –
 పార్టీలో  ఎవరు ఏమిటి? అన్న విషయాలు పుక్కిట పట్టిన దక్షుడు కనుక,
అధిష్టానం మనసెరిగి మసలుకునే తత్వం వొంటబట్టించుకున్న వ్యవహారశీలి కనుక,
 బలం గురించి బలహీనతలు గురించి  స్పష్టమయిన అంచనాలు వేసుకోగలిగిన సమర్ధుడు కనుక, అన్నింటికీ మించి రాజకీయాలలో కురువృద్ధుడు’- పెద్ద మనిషి అన్న ముద్రతో పాటు, అందరూ అర్రులు చాచి అందుకోవాలని తాపత్రయపడే ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించే సంసిద్దతను వ్యక్తం చేయగలిగిన ధీమంతుడు కనుక,
 పరిశీలకులు తొలినాళ్ళలో  ఊహించిన  స్తాయిలో ఆయన పట్ల వ్యతిరేకత  వెల్లువెత్త లేదు. ఇవి కాక, కాకలు తీరిన నాయకులకు ఏ మాత్రం కొదవ లేని కాంగ్రెస్ పార్టీలోని సహజసిద్ద వర్గ రాజకీయాలు సైతం – రోశయ్య ముఖ్యమంత్రిత్వానికి ఎవరూ ఎసరు పెట్టకుండా కాపాడుకుంటూ వస్తున్నాయి. మూన్నాళ్ళ ముఖ్యమంత్రి అనీ, మూన్నెళ్ల ముఖ్యమంత్రి అనీ ఎవరెన్ని రాగాలు తీసినా – మంత్రులను మార్చకుండా, వైఎస్సార్ పధకాలను ఏమార్చకుండా –గుంభనగా నెట్టుకొస్తూనేవున్నారు. లోగడ కనీ వినీ ఎరుగని ప్రకృతి వైపరీత్యాలు, ప్రాంతీయ ఉద్యమాలు రాష్ట్రాన్ని చుట్టుముట్టినా-ఆయన తనదయిన శైలిలో నిబ్బరంగా పాలనపై క్రమంగా పట్టుబిగిస్తున్నారు. గత ఎనిమిది మాసాలుగా ముఖ్యమంత్రిగా ఆయన చేసిన నియామకాలు వేళ్ళమీద లెక్కపెట్టదగినవే కావచ్చు. కానీ వాటి విషయంలో ఆయన ఎవరినీ సంప్రదించి చేసిన దాఖలాలు లేవు. ఉదాహరణకు ప్రెస్ అకాడమి చైర్మన్ గా తిరుమలగిరి సురేంద్రను, సాంస్కృతిక మండలి అధ్యక్షునిగా రమణమూర్తిని, ఏ పీ ఐ ఐ డి సీ అధినేతగా శివసుబ్రమణ్యంను నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలు ఈ కోవలోకే వస్తాయి. సమర్ధులయిన ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు, రాజశేఖరరెడ్డి సయితం ప్రెస్ అకాడమి విషయంలో రోశయ్య మాదిరిగా  స్వతంత్ర నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. అలాగే, జర్నలిష్టు సంఘాలన్నీ ముక్తకంఠంతో వద్దన్నప్పటికీ విజయవాడ పోలీసు కమీషనరుగా పీఎస్సార్ ఆంజనేయులును బదిలీ చేసిన తీరుని కూడా ఈ సందర్భంలో గుర్తుచేసుకోవచ్చు. ఈ రకమయిన వ్యవహార శైలిని సమర్ధించడంగా కాకుండా – రోశయ్య స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారంటూ వెలువడుతున్న విమర్శలలోని డొల్లతనాన్ని ప్రశ్నించడంగా ఈ సందర్భాలను మననం చేసుకుంటే సబబుగా వుంటుంది.
అలాగే సంక్షేమ పధకాల కొనసాగిపు విషయమై రోశయ్యకు వేరే ఉద్దేశ్యాలు వున్నట్టుగా వార్తాకధనాలు వెలువడుతున్నాయి. ఇటు ముఖ్యమంత్రిగా, అటు ఆర్ధిక మంత్రిగా రెండు విభిన్న పాత్రల పోషణలో ఎదురవుతున్న వైరుధ్యాలే ఇందుకు కారణమవుతున్నాయి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా రోశయ్యకు ఈ తలనొప్పులు పరిపాటే. సంక్షేమ పధకాల అమలు రాష్ట్ర ఖజానాకు అలవి కాని భారంగా పరిణమిస్తున్న సంగతి వైఎస్సార్ కు కూడా తెలియని విషయమేమీ కాదు. అందుకే నిరుటి ఎన్నికలకు ముందు కొత్త వాగ్దానాలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. కొన్ని ప్రభుత్వాలు వరుసగా అనేక  దశాబ్దాలపాటు అమలు చేయడానికి సాహసించలేని పధకాలను ఒకదానివెంట మరొకటి ముమ్మరంగా ప్రారంభించడం తోనే  ఆయన మొదటి అయిదేళ్ళు గడిచిపోయాయి. వాటినన్నిటినీ సమగ్రంగా సమీక్షించగల వ్యవధానం లేకుండాపధకాలకు రూపకల్పన చేసి అమలు చేయడంలోనే సమయం చెల్లిపోయింది. ఇప్పుడా బాధ్యత కొత్త ముఖ్యమంత్రిగా రోశయ్యపై పడింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్తితులను గురించి,  సంక్షేమ పధకాలు గురించి, వాటి వల్ల మీద పడే భారం గురించీ ఆకళింపు చేసుకున్న అనుభవం ఆయనకు వుంది. లోటుపాట్లను సవరించుకుని, మరింత సమర్ధవంతంగా, మరింతమంది పేదలకు ప్రయోజనం కలిగే విధంగా సంస్కరించుకోవాలన్న ప్రయత్నం ఏ విధంగా చూసినా సమర్ధనీయమే.రాజకీయ ప్రయోజనాలకోసం,  తనదయిన రీతిలో కొత్త పధకాలకు అంకురార్పణ చేసుకుంటూ, ప్రజలు మెచ్చిన పాత పధకాలను నిర్లక్ష్యం చేసినప్పుడే విమర్శలకు ఊతం ఇచ్చినట్టవుతుంది.
ఇంకా నాలుగేళ్ల పాలన మిగిలి వుంది. రాష్ట్రానికి ఏది మంచిదో ఆలోచించి  ఆచి తూచి ఆచరించడం వల్ల నష్టపోయేదేమీ వుండదు. బహుశా ఆయన కూడా ఈ దిశగానే ఆలోచిస్తూ వుండవచ్చు.
  
(15-05-2010)
భండారు శ్రీనివాసరావు

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి