గురువిందగింజలు – భండారు శ్రీనివాసరావు మీడియా సంచలనాలకు నిలయంగా మారుతున్నదా? ఆయన మొన్నంటే మొన్న అంటే ఈ నెల పదో తేదీ సోమవారం నాడు హైదరాబాదులో – గుడ్ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మీడియాపై ఈ వ్యాఖ్య చేసినట్టు మరునాడు కొన్ని చానళ్ళు ప్రసారం చేసాయి. అదేమి చిత్రమో కాని మీడియాకు సంబంధించి గవర్నర్ వంటి ప్రముఖ వ్యక్తి చేసిన ఈ వ్యాఖ్యానాన్ని గురించిన వార్త ఆ మరునాడు ఏ తెలుగు దిన పత్రికలోనూ రాలేదు. నిజానికి నరసింహన్ గారు గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి అనేక పర్యాయాలు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించినప్పటికీ, ఎందుకో ఏమోకానీ తెలుగు మీడియా ఆయన పట్ల సంయమనంగానే వ్యహరిస్తూనే వస్తోందని చెప్పాలి. చిన్ననాటి స్నేహితుడిని సాగనంపడానికి గవర్నర్ అట్టహాసం లేకుండా నాంపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్ళినప్పుడుకానీ, తన సతీమణితో కలసి తరచుగా గుళ్ళూ గోపురాలు సందర్శిస్తున్నప్పుడు కానీ– సహజంగా సంచలనాలకు పెద్దపీటవేసే తెలుగు మీడియా కొంత సంయమనం చూపిందనే అనుకోవాలి. మామూలుగా అయితే కట్ అండ్ పేస్ట్ తరహాలో అక్కడోముక్క ఇక్కడోముక్క అతికించి – గవర్నర్ అన్నదానికి, అననిది జోడించి తిమ్మిని బమ్మినిచేసి చూపించగల ప్రతిభాపాటవాలు పుణికి పుచ్చుకున్న తెలుగు మీడియా చానళ్ళు – కారణాలు తెలియవు కాని నరసింహన్ గారి విషయంలో చాలా ఉదార వైఖరి చూపుతూ వస్తున్నాయనడంలో సందేహం లేదు. మరి ఈ నేపధ్యంలో – గవర్నర్ గారు ఏదో ఒక సందర్భాన్ని ఎంచుకుని- మీడియా సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతోందన్న అర్ధం వచ్చే వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమిటన్న అంశంపై ఆలోచన చేయాల్సివుంది. సుపరిపాలనకు సంబంధించిన అంశంపై మాట్లాడుతున్నప్పుడు గవర్నర్ ఈ విషయాన్ని ప్రస్తా వించారంటే – మంచి పరిపాలన ప్రజలకు లభించాలంటే సంచలన ధోరణిని మీడియా వొదులుకోవడం అవసరం అన్న భావన ఆయన మాటల్లో తొంగిచూస్తోన్దని అనుకోవాలి. పోతే, కొన్ని తెలుగు చానళ్ళు ప్రతి ఉదయం నిర్వహించే చర్చల్లో పాల్గొన్న కొందరు విశ్లేషకులు తమ యధాశక్తి గవర్నర్ గారి వ్యాఖ్యలను ఏకిపారేశారు. ఆయన తన పరిధినిమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇలాటి చర్చలను తిలకించేవారెవ్వరికీ – వీటిలో పాల్గొనే విశ్లేషకులలో చాలామంది తమ పరిధికి లోబడి మాట్లాడుతున్నారన్న అభిప్రాయం కలిగే అవకాశం వుండే వీలు లేదు. ఎందుకంటె వారి వారి భావజాలాలకు అనుగుణ్యమయిన ‘ముద్రాంకితాలు’ ఆ విశ్లేషకుల మొహాల్లోనే స్పష్టంగా కానవస్తుంటాయి. కాబట్టి ఈ చర్చల ప్రాతిపదికగా ప్రజాభిప్రాయాన్ని మదింపు వేయడం శాస్త్రీయం అనిపించుకోదు. మీడియా గురించి వ్యాఖ్యానించినంత మాత్రాన గవర్నర్ తన హద్దులను దాటారని ఆరోపించడం కూడా సబబు అనిపించదు. రాజభవన్ కు పరిమితమయితే రబ్బర్ స్టాంప్ గవర్నర్ అని ముద్రవేయడం, అధికారులతో నేరుగా సమీక్షలు జరిపితే పరిధిని మించి వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించడం సద్విమర్శ కాజాలదు. ముఖ్యమంత్రి రోశయ్య గారికి కూడా విశ్లేషకులు ఇలాటి కితాబునే ఇచ్చిన సంగతి ఈ సందర్భంలో గమనార్హం. మంత్రులపై పట్టులేని అసమర్ధ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించిన వారు - డిల్లీ వైపు చూడకుండా ఏ నిర్ణయం తీసుకోలేని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేసిన వారు – ఎవరినీ సంప్రదించకుండా, ఎవరి సలహాలు తీసుకోకుండా ఆయన చేసిన కొన్ని రాజకీయ నియామకాల విషయం మరచిపోతున్నారు. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని వొత్తిడులు వచ్చినా ఏమాత్రం ఖాతరు చేయకుండా సీనియర్ పోలీసు అధికారులను బదిలీ చేసిన వైనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విజయవాడ పోలీసు కమీషనర్ గా ఆంజనేయులు గారిని ఎంపిక చేసిన సందర్భం ఇందుకు చక్కని ఉదాహరణ. పత్రికను కానీ లేదా ఒక చానల్ ను కానీ నిర్వహించడానికి ఎవరి పద్దతులు వాళ్లకి వున్నట్టే ప్రభుత్వం నడపడంలో కూడా ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కో శైలి వుండడంలో తప్పుపట్టాల్సినదేమీ వుండదు. రాజశేఖరరెడ్డి గారి స్పీడ్ తో నన్ను పోల్చకండని పదే పదే రోశయ్యగారు చెబుతున్నదానిని ఈ కోణం నుంచే అర్ధం చేసుకోవాలి. మామూలు అధికారులకే మారిన ఉద్యోగంలో కుదురుకోవడానికి కొన్ని మాసాలు పడుతుంది. అలాటిది ఒక ముఖ్యమంత్రి వంటి కీలక పదవిలో నిలదొక్కుకోవడానికి, కుదురుకుని తనదయిన శైలిలో పరిపాలన సాగించడానికి కొంత వ్యవధానం ఇచ్చి తీరాలి. ప్రతిచిన్న విషయాన్ని అద్దంలో చూపెట్టి రేటింగులు పెంచుకోవాల్సిన తహతహ చానళ్ళు ప్రదర్శిస్తే వాటి అవసరాన్ని అర్ధం చేసుకోవచ్చు. అయితే దేనికయినా ఒక హద్దు వుందని గుర్తుంచుకుని వ్యవహరించినప్పుడే చేసే విమర్శలకు ఒక విలువ వుంటుంది. మీడియా సంచలనాలను గురించి నిన్న గవర్నరుగారు చెప్పినా, మొన్న మరో సందర్భంలో ముఖ్యమంత్రిగారు చెప్పినా – ఎలా చెప్పారన్న కోణంలోనుంచి కాకుండా ఎందుకుచెప్పారన్న సానుకూల వైఖరితో ఆత్మ విమర్శ చేసుకోగలిగిననాడే - మీడియా మరొకరికి సుద్దులు చెప్పగలుగుతుంది. అప్పటివరకు గురివింద గింజ సామెతను గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్తితి వుంటుంది. (11-05-2010) -భండారు శ్రీనివాస రావు NOTE: All the images in this blog are copy righted to their respective owners. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి