2, మార్చి 2010, మంగళవారం

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!


దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!

"అయాం సోల్డ్" - అన్నారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు.

ముఖ్యమంత్రి అమ్ముడుపోవడమా!అందులోను వైఎస్సార్? ఎవరికి అమ్ముడుపోయారు? ఎంతకు అమ్ముడుపోయారు?



అది డిసెంబరు నెల. 2007 వ సంవత్సరం.

అప్పటికే -108- అంబులెన్సులు రాష్ట్రాన్ని చుట్టిపెడుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి.నిజానికి ఈ సర్వీసులకు ప్రాచుర్యం కల్పించిన ఘనత రాజశేఖరరెడ్డి గారిదే. ఏ పబ్లిక్ మీటింగ్ లోనయినా సరే - 'కుయ్ ...కుయ్' మని 108 అంబులెన్సుని అనుకరిస్తూ దాని ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియచేసేవారు.

ఆ రోజుల్లోనే - సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది.అదే ఎఫ్ డీ హెచ్ ఎస్. -'ఫిక్సెడ్ డేట్ హెల్త్ సర్వీస్' - నిర్దేశిత దిన వైద్య సేవలు. ఇందుకు పూర్వ రంగం గురించి కొంత ప్రస్తావించాల్సివుంటుంది.

ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటే, కేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పయినా, వారిచ్చే నాటు మందుల పయినా ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.

ఈ నేపధ్యంలో -

అప్పటికే - ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి, పనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు - హె చ్ ఎం ఆర్ ఐ (హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారు ఈ సమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది.ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.

ఈ వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ ఎన్ ఎం లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టేక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే, ఫోన్ చేసి ఆసుపత్రిలో చేర్పిస్తారు.రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన పరీక్షలు నిర్వహిస్తారు.

'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెహ్ ఎం ఆర్ ఐ నిర్వాహకులు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ తీసుకుని ఆనాడు సచివాలయానికి వెళ్ళారు.ఇప్పటి ముఖ్యమంత్రి, ఆనాటి ఆర్ధిక మంత్రి అయిన రోశయ్య గారు కూడా పాల్గొన్న ఆ సమావేశం మొదలయి మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో- రాజశేఖరరెడ్డి గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హటాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్ ఐడియా) అనేసారు.

అంతే!

దాదాపు ఏడాదికి నూరు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!

___________________________________________________________________________________________

-భండారు శ్రీనివాసరావు (02-03-2010)

____________________________________________________________________________________________

--(హెలికాప్టర్ దుర్ఘటనలో రాజశేఖర రెడ్డి గారు కన్నుమూసి ఆరు మాసాలు గడిచిన సందర్భంలో 02-03-2010 తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితం - భండారు శ్రీనివాసరావు)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

4 కామెంట్‌లు:

  1. That is great of you to bring this out for public consumption. Congratulations. In fact I was also in that meeting when he responded as "I am Sold" to Dr. Balaji Utla's Presentation on FDHS Scheme. And that too spontaneously.Probably that one single great decision of Dr. YSR, enhancing the scope of Public Private Partnership, for provision of Health and Emergency Services in AP, made the state as the "Health Reforms of Hub of Asia (may be World)". Jwala Narasimha Rao Vanam

    రిప్లయితొలగించండి
  2. మర్రి చెన్నారెడ్డి గారి తర్వాత అంతా ఫాస్ట్ గానూ అంతా దూరదృష్టి తో నిర్ణయాలు తీసుకున్నది y.s..గారేనేమో ...?

    రిప్లయితొలగించండి