ఎటు పోయాయ్ ఆ రోజులు? - భండారు శ్రీనివాసరావు
మా తాతగారి కాలం నాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా కరెంట్ బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.
మా నాన్న గారి కాలం వచ్చేసరికి కరెంట్ రాలేదు కానీ రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి.
మా వూరి మొత్తం జనాభాలో ఆరోజుల్లో యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప రైలుని చూసిన వాళ్లు కానీ, బస్సు ఎక్కిన వాళ్లు కానీ, మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వా ళ్లు.
ఇక మా అమ్మ-
కట్టెల పొయ్యి ముందు కూర్చుని - పొగచూరిన వంటింట్లో పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట - కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్లు మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగావేసి పాలకుండని వాటిపై ఉంచి - పైన ఒక రాతిపలకని కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై - అరచేతి మందాన మీగడ కట్టేది. మర్నాడు - ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు. మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టే వాళ్లు. ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి- ఆటల్లోకి జారుకునే వాళ్లు. మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే - అంట్లగిన్నెలు సర్దేసి - వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్లు కుట్టేవారు. రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈ పనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. వాటితో పాటు శ్రమతెలియకుండా పాటలు పాడుకుండేవారు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.
ఇక మారోజులు వచ్చే సరికి - రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి - గ్యాస్ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి. కరక్కాయ సిరాలు- పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్ పెన్నులుగా, బాల్‌పాయింట్ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్కకాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది. బేడలూ, అర్ధణాలూ, కాసులూ, చిల్లికాసులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్లు కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్ రాళ్లు రోడ్లపై వెలిశాయి. ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు - నిత్యకృత్యంగా మారి - అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోతున్నాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.
ఆరోజుల్లో సెలవులు ఇస్తే చాలు - పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తేవాళ్లు. ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు- ఒకటేమిటి - ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని- ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని - పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్లు.
ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి - మాయాబజారు సినిమాలో మాదిరిగా - కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ - ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు - ఆడిన ఆటలు, పాడిన పాటలు - కనురెప్పలకిందే కరిగి పోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.
ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే -
తెలతెలవారుతూనే బావి గట్టున చేదతో తోడుకుని చేసే స్నానాలు-
జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ-
లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం-
రోజూ తినే వరి అన్నానికి - ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి - పనివాళ్లు వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం-కళ్లాల„సమయంలో - కొత్త వడ్లు కొలిచి - కొనుక్కుతినే కట్టె మిఠాయి-
సాయంత్రం చీకటి పడేవేళకు - మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు-
వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ-
ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒక నాడు వున్నాయని అన్నా - కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు నమ్ముతారా? కళ్లతో చూసిందే నమ్ముతాం అని వాళ్లంటే మీరేం చేస్తారు?
(16 -7- 2008)
NOTE: All the images in this blog are copy righted to their respective owners.
Bhavaniki tagga basha kaligivundadtam kuda oka kala.appati marupurani andamaina rojulu chala chakkaga kallaku kattinatlu enta baga cheppavu.idi chadivina ippati pillalu appati rojulu antha manchiga vundevaani tappakunda anukuntaru.Thankyou for such a good article.
రిప్లయితొలగించండిచాలా సంతోషం.
రిప్లయితొలగించండిచదవడం ఒక ఎత్తయితే, దాన్ని గురించి అలోచించి నాలుగు మంచి ముక్కలు రాయగలగడం మరో ఎత్తు.
పాత రోజులను మననం చేసుకుని వాటిని ఒక చోట గుదిగుచ్చడం అన్న ఆలోచనతప్ప - ఇవి చదివి ఎవరో మారిపోతారన్న ఆశ లేదు. బహుశా మా నాన్న, తాతయ్యల కాలంలో ఈ బ్లాగులు వచ్చివుంటే వాళ్ళు కూడా మా తరాన్ని గురించి ఇలాంటి భ్రమల్లోనే ఉండేవారేమో. తరాల మధ్య ఈ అంతరాలు తరతరాలుగా వస్తూవున్నవే. ఏ తరానికి ఆ తరం రానున్న తరం గురించి ఇలాగే అనుకుంటారు. పాత జ్ఞాపకాలకు అక్షర రూపం ఇవ్వడం తప్ప ఇలాంటి రచనలకు ఏదో ప్రయోజనం ఉంటుందని అనుకోను. చాదస్తం అని కొట్టిపారేయకుండా మీలాంటి వాళ్ళు ఇలా మెచ్చుకుంటూ రాయడమే సంతోషం కలిగిస్తోంది. చాలా చాలా థాంక్స్. - భండారు శ్రీనివాసరావు
ఇలాంటి రచనలకు ఏదో ప్రయోజనం వుంటుందని అనుకొను అన్నారు లేదండీ తప్పక వుంటుంది మళ్ళీ పాత రోజులు గుర్తు రావడమ్ మనసంతా ఎటో వెళ్లిపోతుంది...ఆ ఆనందం ఆ ఫీలింగ్స్ వ్యక్తీకరించడం అయ్యే పని కాదు...ప్రతీ వొక్కళ్లూ తప్పక డైరీ తిరగ వేస్తే ఆ ఆనందమే వేరు
రిప్లయితొలగించండిడియర్ కేవీ ఎస్ వీ
రిప్లయితొలగించండిబహుశా ఇలాటి సందర్భాల్లో - అంటే మీలాటి మిత్రులు వ్యక్తం చేసే ఈ మాదిరి అభిప్రాయాలు విన్నప్పుడు లేదా చదివినప్పుడు- మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి ఇంగ్లీష్ లో ఒక చిన్న పదం వుంది.- "థాంక్స్" . - భండారు శ్రీనివాసరావు