2, ఫిబ్రవరి 2010, మంగళవారం
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు - పదహారో భాగం) - భండారు శ్రీనివాస రావు
మా ఇంటికి పెద్ద దూరం కాదు కానీ, ఒక మోస్తరు దూరంలో 'రష్యన్ సర్కస్' వుంది. కానీ టికెట్స్ దొరకడం చాలా కష్టం. దాన్ని చూడాలంటే కనీసం మూడు నెలలముందు నుంచే ప్రయత్నం ప్రారంభించాలి. అయితే మాస్కో రేడియోలో పనిచేస్తున్న విదేశీయులకోసం ఒక సౌలభ్యం వుంది. ఎన్ని టిక్కెట్లు కావాలో తెలియచేస్తే వాళ్లే తెప్పించి పెడతారు. అల్లా ఒకరోజు రష్యన్ సర్కస్ చూసే అవకాశం లభించింది.
రష్యన్ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయిన రష్యన్ సర్కస్ -కేధరిన్ ది గ్రేట్ - కాలం నుంచే వుంది. ఇంగ్లీష్ భాష తెలియని రష్యాలో - రష్యన్ సర్కస్ ఆవిర్భావానికి ఒక ఇంగ్లీష్ పౌరుడే కొంత మేరకు దోహద పడడం ఒక విశేషం. చార్లెస్ హగెస్ అనే ఆంగ్లేయుడు - కేధరిన్ ది గ్రేట్ క్వీన్ రాణి గారి సమక్షంలో ఒక చక్కని ప్రదర్సన ఇచ్చాడట. దాంతో ముచ్చట పడిపోయిన రాణి గారు- అతగాడికోసం రెండు సర్కస్ డేరాలు నిర్మించి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారట. రాణి తలచుకుంటే డేరాలకు కొదవేముంది. అతడికోసం సెంట్ పీటర్స్ బర్గ్ - కమ్యూనిస్టుల ఏలుబడిలో 'లెనిన్ గ్రాడ్' గా పేరుమార్చుకుని - మళ్ళీ తదనంతర కాలంలో తిరిగి సెంట్ పీటర్స్ బర్గ్ అన్న పాత పేరుకు మారిన నగరంలో - సర్కస్ డేరాలు నిర్మించి పెట్టారు. కొన్నేళ్ళ తరవాత ఆ ఇంగ్లీష్ దొరవారు ఇంగ్లాండ్ కు వెళ్ళిపోయాడు కానీ అతడి బృందంలోని సభ్యులు మాత్రం రష్యన్ల ఆదరాభిమానాలకు కట్టుబడిపోయి ఆ దేశంలోనే వుండిపోయారు. అలా చిగురించిన రష్యన్ సర్కస్ వట వృక్షం మాదిరిగా విస్తరించి సోవియట్ల కాలంలో ఖండాంతర ఖ్యాతిని సముపార్జించుకుంది. తొంభయ్యవ దశకం దాకా ఒక వెలుగు వెలిగి - ఇటీవలనే తన నూట యిరయవ్వవ వార్షికోత్సవం కూడా జరుపుకుంది.
గ్రేట్ మాస్కో స్టేట్ సర్కస్ ని 1971 లో మాస్కోలోని వేర్నాద్ స్కీ ప్రాస్పెక్ట్ లో ప్రారంభించారు. 3400 మంది వసతిగా కూర్చుని తిలకించగల విశాలమయిన ఎయిర్ కండిషన్ డేరాను నిర్మించారు. దీని ఎత్తు 36 మీటర్లు. ఇందులో అయిదు ఎరీనాలు వున్నాయి. సర్కస్ జరిగే ప్రధాన వేదికకు 18 మీటర్లు దిగువన వీటిని ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి - ఈ ఎరీనాలు ఒక దాని వెంట మరొకటి పైకి వస్తాయి. అందువల్ల అట్టే వ్యవధానం లేకుండా - రంగ స్తలాల రూపురేఖలు వాటంతట అవే మారిపోతుంటాయి. మన వైపు సురభి కంపెని నాటక ప్రదర్శనల మాదిరిగా.
రష్యన్ సర్కస్ చూడకుండానే ఇండియాకు తిరిగివచ్చేస్తామేమో అన్న బెంగ ఆవిధంగా తీరిపోయింది. సర్కస్ నుంచి తిరిగివస్తుంటే దోవలో ఒక సినిమా హాలు కనబడింది. టికెట్ లు కొనుక్కుని లోపలకు వెళ్లి చూద్దుము కదా - అది మన శంకరాభరణం.
పాటలన్నిటినీ యధాతధంగా తెలుగులో ఉంచేసి, సంభాషణలను మాత్రం రష్యన్ లోకి డబ్ చేశారు. 'ఆకలేసిన బిడ్డ అమ్మా అని ఒకరకంగా అంటుంది ...' అంటూ శంకరాభరణం శంకర శాస్త్రి (సోమయాజులు గారి) నోట రష్యన్ పలుకులు వినబడుతుంటే చెప్పరాని ఆనందం వేసింది. రష్యాలో డబ్బింగ్ పట్ల యెంత శ్రద్ధ తీసుకుంటారో ఈ సినిమా చూస్తె తెలుస్తుంది. తెలుగు శంకరాభరణం సినిమా లో నటించిన నటీ నటుల గాత్రానికి తగిన స్వరం కలిగిన డబ్బింగ్ కళాకారులనే ఎంపిక చేయడం వల్ల- సోమయాజులు గారు, ఆ సినిమా లో నటించిన తదితరులు అచ్చు రష్యన్ లో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగింది.
సినిమా చూసి ఇంటికి రాగానే మద్రాసులో వున్న నా క్లాసుమేటు, ఆ చిత్రానికి సంభాషణలు రాసిన జంధ్యాలకు ఫోన్ చేసి చెప్పేవరకు ఉగ్గబట్టుకోలేక పోయాను.ఒకే రోజున అయాచితంగా లభించిన ఈ రెండు అవకాశాలు మా మాస్కో జీవితంలో మరచిపోలేని మధుర అనుభవాలు.
(రాజీవ్ గాంధీని తలచుకుంటూ కంట తడిపెట్టిన రష్యన్ వృద్ధ మహిళ గురించి ఇంకోసారి)
NOTE: All the images in this blog are copy righted to their respective owners.
Excellent write up Srinivasa Rao garoo. I had seen Russian Circus in a movy. Its really great.
రిప్లయితొలగించండిI hope we will be able to see the Russian version (dubbed) Sankarabharanam. Is it possible that we may get a c d of that great movy in Russian!