19, జనవరి 2010, మంగళవారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు - పదో భాగం)- భండారు శ్రీనివాసరావు

   










నదిపై పిల్లల  ఫుట్ బాల్  ఆట 
నీళ్ళపై నడయాడగల యోగపురుషులున్న పుణ్య భూమి గా పేరుగాంచిన భారత దేశంనుంచి వెళ్ళిన మేము - మాస్కోలో 'నదిపై ఫుట్ బాల్ ఆడుతున్న పిల్లల'ను కళ్ళారా చూసాము.
ఉత్తర ధృవానికి చేరువగా వుండడం వల్ల, మాస్కోలో ఉష్ణోగ్రతలు సున్నాకంటే ముప్పయి నలభై డిగ్రీలు తక్కువగా వుంటాయి. ఈ చల్లదనానికి మాస్కో నగరం మధ్యలో పాయలుగా పారే మాస్కవా నదిలో నీళ్ళు గడ్డకట్టుకు పోతాయి. కాంక్రీటు మాదిరిగా గట్టిపడిన ఆ నది ఉపరితలం పిల్లలకు ఆట మైదానంగా మారిపోతుంది. ఇక దానిపై ఫుట్ బాల్ ఆటలేనా, స్కేటింగ్ లేనా, ఓహ్! అది చూసి తీరాల్సిన దృశ్యం.



సాధారణంగా మనవైపు ముసురు పట్టినప్పుడు, చల్లగాలులు వీస్తున్నప్పుడు చంటి పిల్లలను బయట తిప్పడానికి సంకోచిస్తాము. కానీ అక్కడ అలా కాదు. ఒక పక్క మంచు నిలబడి కురుస్తూనే వుంటుంది. మరో పక్క నెలలు నిండని శిశువులను సయితం చలి దుస్తుల్లో 'ప్యాక్' చేసి ఆరుబయట వొదిలేసి తల్లులు 'షాపింగ్' చేస్తుంటారు. అది చూస్తూ 'మన దేశం నుంచి వెళ్ళిన తల్లులు' ఇలా ఎలా ? అన్న ప్రశ్నలు వేసుకుని సతమతమౌతుంటారు.
తుమ్మి చిరంజీవ
అలా అని - తుమ్మని వాళ్ళూ , పడిసం పట్టని వాళ్ళూ అసలే లేరని కాదు. మనదగ్గర పల్లెల్లో ఇప్పటికీ పిల్లలు తుమ్మినప్పుడు దగ్గరున్న పెద్దవాళ్ళు వాళ్ళ నెత్తిపై తట్టి 'చిరంజీవ! చిరంజీవ!!' అని అంటూ వుండడం కద్దు. అలాగే అక్కడ కూడా ఎవరయినా తుమ్మగానే పక్కనున్నవాళ్ళు ' బూజ్ ద్దరోవా '( బహుశా దీనికి అర్ధం వెయ్యేళ్ళు బతకమని కాబోలు) అంటుంటారు. మోడరన్ అమ్మాయిల మాటేమోగాని పాత తరం మనుషులు ఇప్పటికీ చిన్న చిన్న నలతలకు ఇళ్ళల్లోనే చిట్కా వైద్యాలు చేస్తుంటారని పిలిపెంకో దంపతులు చెబుతుండేవాళ్ళు.
భోజనాలకు కటకట






పిలిపెంకో ఓసారి పట్టుపట్టి మమ్మల్ని లెనిన్ గ్రాడ్ రైల్లో తీసుకువెళ్ళాడు. అక్కడ పట్టుమని రెండు రాత్రులు కూడా గడపలేదు. ఎప్పుడు వెళ్లి ఇంట్లో పడదామా అన్న ఆరాటంతోనే సరిపోయింది. ఆ నగరంలో చూడాల్సినవి ఎన్నోవున్నాయి. కానీ తినకుండా తిరగడం అన్నదే సమస్యగా మారింది.



 శాఖాహారులకు హోటళ్ళలో తినడానికి ఏమీ దొరకదు. ముతక బియ్యంతో పొడి పొడిగా వండిన అన్నంపై ఉప్పూ మిరియప్పొడి చల్లుకు తినాలి. పెరుగు కాదు కానీ పెరుగు లాంటిది 'కిఫీర్'   దొరుకుతుంది. దానితో సరిపెట్టుకుని భోజనం అయిందనుకోవాలి. అలాగని మాంసాహారులకు రుచికరంగా అన్నీ దొరుకుతాయని అనుకోనక్కరలేదు. ఉడికించిన కోడిగుడ్లు మినహా మిగిలినవేవీ మనవైపునుంచి వెళ్ళిన వాళ్లకు అంతగా రుచిస్తాయనుకోవడానికి లేదు. మాంసాన్ని ఉప్పునీళ్ళల్లో ఉడికించి అదేమాదిరిగా సర్వ్ చేస్తారు. ఉప్పుకారాలు దట్టించి, నూనెల్లో వేయించి వేయిన్నొక్క రకాలుగా వంటలు వండుకుని తినే అలవాటు వున్న వాళ్లకు ఆ తిండి సయించడం కష్టమే. అందుకే అక్కడికి వ్యాపారపు పనులమీదనో లేక ఇండో సోవియట్ సాంస్కృతిక సంఘం ఆహ్వానం మేరకో వచ్చినవాళ్ళు భోజనానికి కటకట పడుతుంటారు.అలా వచ్చినవాళ్ళు మొదటి రోజు అక్కడి హోటళ్లు, బస ఏర్పాట్లు చూసి పరవాలేదనుకుంటారు. విందుల్లో మందు తప్ప ఇష్టపడి తినదగిన భోజనం కనబడక పోవడంతో- ఆకలి ఎరుగని దేశంలో వాళ్లకు ఆకలి కష్టాలు మొదలవుతాయి.

(భోజనానికి బస్సు వేసుకువచ్చిన అతిధులతో మా ఇల్లు ఎలా కళకళ లాడిందన్న ముచ్చట మరోసారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

3 కామెంట్‌లు:

  1. padi anubhavaalanoo okkudutuna aaswaadimchaanu. mee ratalu saamyavaada vyavastha anta madhuraanubhootulni
    vedajallutunnaayi. naenu saamyavaadakudini.aa daesaanni samdarsimchina telugollu raasinadamtaa chadivaesi ninnati ussrni baagaa abhimaanichina vaadini. mae raatallo nijaayitee vennamti vumtoumdi. koddigaa anumaanam koodaa appudappudu tomgi choostoomdi.

    రిప్లయితొలగించండి
  2. padi anubhavaalanoo okkudutuna aaswaadimchaanu. mee ratalu saamyavaada vyavastha anta madhuraanubhootulni
    vedajallutunnaayi. naenu saamyavaadakudini.aa daesaanni samdarsimchina telugollu raasinadamtaa chadivaesi ninnati ussrni baagaa abhimaanichina vaadini. mae raatallo nijaayitee vennamti vumtoumdi. koddigaa anumaanam koodaa appudappudu tomgi choostoomdi.

    రిప్లయితొలగించండి
  3. వెంకట సుబ్బారావు గారికి
    మీ అభిమానానికి ధన్యవాదాలు.
    కొన్ని విషయాలు చదివిన తరవాత 'నిజమా!' అన్న ఆశ్చర్యం కానీ అనుమానం కానీ తొంగిచూడడంలో సందేహపడాల్సింది ఏమీలేదు. అందుకే నేను మొదటి భాగంలోనే రాసాను. గుప్తుల స్వర్ణ యుగం గురించి చరిత్రలో చదువుకున్నాము. అలాగే ఇది. పాతికేళ్లలో అక్కడా పరిస్తితులు చాలా మారిపోయాయని అంటున్నారు. సోవియట్ ప్రభుత్వ చరమాంకంలో నేను మాస్కోలో వుండడమనేది కేవలం యాదృచ్చికం. సామాన్యుడి జీవితం ఎలావుండాలని అందరం కోరుకుంటామో అలాంటి జీవితాన్ని నేను అక్కడ రుచి చూసాను. కానీ కధ అక్కడితో ఆగిపోలేదు. అన్నీ వున్నా లేనిదానికోసం అర్రులు చాచడం మనిషికి సహజం. ఆ క్రమంలో జరిగిన చరిత్రే ఈ 'మార్పు చూసిన కళ్ళు'
    - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి